ఎక్కువ చిత్రాలు చేయాలనే ఉంది

17 Oct, 2018 00:13 IST|Sakshi

‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ఇప్పటివరకూ చాలా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ వచ్చాయి. కానీ, ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో మా సినిమా ఉంటుంది. ఆ పాయింట్‌ని ఈ యాంగిల్‌లో కూడా చూడొచ్చా! అనేలా స్టోరీని తీర్చిదిద్దారు. కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్‌ చేశానో.. ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూసినప్పుడూ అంతే ఎంజాయ్‌ చేశా’’ అని రామ్‌ అన్నారు. ఆయన హీరోగా అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్‌ నిర్మించిన ఈ సినిమా రేపు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామ్‌ పంచుకున్న విశేషాలు... 

∙ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్‌ పాయింట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో నాది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పాత్ర. పల్లెటూరి నుంచి పట్నం వచ్చిన యువకుడిగా నటించాను. 

∙త్రినాథరావు, రైటర్‌ ప్రసన్న మధ్య మంచి ర్యాపో ఉంది. త్రినాథరావు ఒక ప్రేక్షకుడిలా సీన్‌ని పరిశీలిస్తుంటారు. ప్రసన్న పాత్రల గురించి సెట్స్‌లో వివరిస్తూ ఉంటారు. ఒక సన్నివేశం చేసేటప్పుడు నేను, డైరెక్టర్, రైటర్‌ డిస్కస్‌ చేసుకున్న తర్వాతే షూట్‌కి వెళతాం. 

∙త్రినాథరావు ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ మాస్‌ ఓరియంటెడ్‌. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ని మిక్స్‌ చేసి తెరకెక్కించారు. ఆయన గత చిత్రాల్లో హీరోయిన్‌ తండ్రితో హీరో చాలెంజ్‌ చేసే స్టైల్లో ఉంటుంది. ఈ సినిమాలో అలా కాకుండా ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంటుంది. 

∙సక్సెస్‌ కావాలని నేను సినిమాలు చేయను. ప్రతి సీన్‌ సక్సెస్‌ కావాలని అనుకుంటాను. అలాంటి సమ యాల్లో కథ వర్కవుట్‌ అయితే సక్సెస్‌ అవుతాయి.  రిలీజ్‌ తర్వాత ఫలితాన్ని అనలైజ్‌ చేసుకుంటా. నా దగ్గరి వాళ్లతో డిస్కస్‌ చేస్తా. 

∙ఈ సినిమా ప్రధానంగా ప్రకాష్‌రాజ్, అనుపమ పరమేశ్వరన్, నా మధ్యనే రన్‌ అవుతుంది. సన్నివేశాల పరంగానే కామెడీ ఉంటుంది. ఇందులోని మెయిన్‌ పాయింట్, డైలాగ్స్‌ ఆలోచింపజేసేలా ఉంటాయి. 

∙ఓ హీరోగా ఎక్కువ సినిమాలు చేయాలని నాకూ ఉంది. అయితే నన్ను ఎగై్జట్‌ చేసే కథలు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. మా పెదనాన్నగారు(‘స్రవంతి’ రవికిషోర్‌) కూడా కథలు వింటారు. నాకు ఏమాత్రం నచ్చుద్ది అని ఆయనకు అనిపించినా నన్ను కథ వినమంటారు. 

∙దర్శకుడు ప్రవీణ్‌ సత్తారుగారితో కొన్ని కారణాల వల్ల సినిమా ముందుకెళ్ల లేదు. భవిష్యత్‌లో ఓ సినిమా చేస్తా. నా తర్వాతి ప్రాజెక్టు కోసం ప్రస్తుతం కథలు వింటున్నాను. ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు. 


∙‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రం తర్వాత ‘దిల్‌’ రాజుగారితో  మరో సినిమా చేయాలనుకున్నా సరైన కథ కుదరలేదు. రాజుగారు ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. సినిమా బాగా రావాలనే తపన ఉన్న వ్యక్తి. అందుకే సినిమా మేకింగ్‌లో బాగా ఇన్‌ వాల్వ్‌ అవుతారు.  

మరిన్ని వార్తలు