వెండి వెన్నెల‌..నువ్వు ఇలా...

20 Jan, 2019 00:05 IST|Sakshi

‘క్రిష్ణగాడి వీరప్రేమగాథ’తో తెలుగు ప్రేక్షకులకు ‘మహాలక్ష్మి’గా పరిచయమైంది మెహ్రీన్‌ కౌర్‌ పీర్జాదా. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘నోటా’ ‘కవచం’, ‘ఎఫ్‌–2’ చిత్రాలతో చేరువైన మెహ్రీన్‌ ముచ్చట్లు తన మాటల్లోనే...


నన్ను మార్చేసింది
కెమెరా ముందు నిల్చున్న క్షణాలన్నీ నా దృష్టిలో ఆనందమయమే. రకరకాల పాత్రలు చేస్తున్న క్రమంలో నన్ను నేను కొత్తగా కనుగొనే ప్రయత్నం చేస్తున్నాను. ‘నటన’ నాలో మార్పు తెచ్చిందా అంటే...యస్‌ అని అంటాను. క్రమశిక్షణ, ఏకాగ్రత పెరగడం, సమయం సద్వినియోగం చేసుకోవడంతో పాటు నా గురించి నేను కేర్‌ తీసుకునేలా చేసింది నటన.

విధివిలాసం
దుస్తులకు, వ్యక్తిత్వానికి సంబంధం లేదని నమ్ముతాను.  మోడ్రన్‌ స్టైల్లో  కనిపించినంత మాత్రానా గ్రామీణనేపథ్యం ఉన్న పాత్రలు చేయలేరు అనేది అపోహ మాత్రమే. అలా అయితే నేను మహాలక్ష్మి పాత్ర చేసి ఉండేదాన్ని కాదేమో! పంజాబ్‌లో పుట్టి ఢిల్లీలో పెరిగాను. న్యూయార్క్, కెనడా నుంచి హైదరాబాద్‌ వరకు  జరిగిన నా జర్నీ అంతా డెస్టినీ అనుకుంటాను. హైదరాబాద్‌లో ఉంటే హోమ్‌సిక్‌ ఉండదు. హోమ్‌టౌన్‌లో  ఉన్నట్లుగానే ఉంటుంది!

ఎందుకంటే...
‘మిస్‌ పర్సనాలిటీ సౌత్‌ ఏషియా’గా ఎన్నికైన తరువాత ఫ్యాషన్‌ ప్రపంచం నుంచి అవకాశాలు వచ్చాయి. పెద్ద పెద్ద బ్రాండ్లకు పనిచేశాను. అలా  ముంబైకి షిఫ్ట్‌ అయ్యాను. ఆ తరువాత సినిమాల్లోకి! ‘హిందీ సినిమాల్లో కాకుండా తెలుగులో  ఎందుకు నటిస్తున్నారు?’ అనే ప్రశ్న ఎదురవుతుంటుంది. ఈరోజుల్లో తెలుగు, హిందీ లేదా ఇతర భాష అనే తేడా లేదు. ఇక్కడ కూడా ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు.

గలగలమని...
ఫ్యామిలీ సపోర్ట్‌ ఉంటే ధైర్యంగా ముందడుగు వేయగలం. నాకు అలాంటి సపోర్ట్‌ ఉన్నందుకు గర్వంగా ఉంటుంది. మా కుటుంబసభ్యులు ఎప్పుడూ తమ నిర్ణయాన్ని నా మీద రుద్దే ప్రయత్నం చేయరు.‘నీ మనసు చెప్పినట్లే చెయ్‌’ అని చెబుతుంటారు. మౌనంగా ఉండడం కంటే  ఎప్పుడూ గలగలమని మాట్లాడుతూ ఉండడమే నాకు ఇష్టం. చుట్టూ బంధువులో, స్నేహితులో ఉండాల్సిందే.

గన్‌ అంటే ఇష్టం!
ఏదో ఒక ఆట  ఎంచుకొని ప్రాక్టీస్‌ చేయమని అమ్మ చెప్పడంతో ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. నెయిల్‌పాలిష్, హెయిర్‌ స్టైల్‌...మొదలైన వాటి కంటే ‘గన్‌’ అంటేనే నాకు ఇష్టంగా ఉండేది. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న ఎయిర్‌ పిస్టల్‌తో ప్రాక్టీస్‌ చేసేదాన్ని. ఇప్పటికీ నేను పంజాబ్‌కు వెళితే షూటింగ్‌ రేంజ్‌కు వెళ్లి ప్రాక్టీస్‌  చేస్తుంటాను. 

మరిన్ని వార్తలు