పెద్దింటి అమ్మాయి

10 Feb, 2019 00:14 IST|Sakshi

చేసింది రెండు సినిమాలే అయినా తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది సారా అలీఖాన్‌. గర్ల్‌–నెక్స్‌ –డోర్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న సారా అలనాటి అందాల కథానాయిక షర్మిలా టాగోర్‌ ముద్దుల మనవరాలు. సైఫ్‌ అలీఖాన్‌–అమృతాసింగ్‌ల కూతురు.  బాలీవుడ్‌ న్యూ ఫేవరెట్‌ ఫేస్‌  సారా గురించి కొన్ని ముచ్చట్లు ఆమె మాటల్లోనే...

ఫోన్‌లో పాటలు!
ఇంట్లో సినిమా వాతావరణం పెద్దగా లేకపోయినప్పటికీ, ‘నువ్వు సినిమాల్లో నటించాల్సిందే’ అని ఎవరూ అనకపోయినప్పటికీ సినిమాలు ఇష్టంగా చూస్తుండేదాన్ని. ఏదైనా పాత్ర బాగా నచ్చితే ‘ఈ పాత్రలో నేను నటిస్తే ఎంత బాగుండేది’ అనుకునేదాన్ని. స్కూల్‌ హెడ్‌మాస్టర్‌కి ఫోన్‌ చేసి హిందీ పాటలు పాడటం నుంచి, వాషింగ్‌ పౌడర్‌ నిర్మా యాడ్‌ను అనుకరిస్తూ గంతులు వేయడం వరకు రకరకాల చిలిపిపనులు చేసేదాన్ని.

అచ్చంలా అలాగే!
చిన్నప్పటి సరదా జ్ఞాపకం ఇది...ఎప్పుడైనా అమ్మతో గొడవపడుతున్నప్పుడు, ఆమెకు విసుగొచ్చేది. ‘ప్చ్‌...అచ్చం నువ్వు మీ  నాన్నాలాగే’ అనేది.ఎప్పుడైనా నాన్నతో గొడవైనప్పుడు... ‘ప్చ్‌...నువ్వు అచ్చం మీ అమ్మలాగే’ అంటుండేవాడు!

మరీ అంతొద్దు...
ఈ ఆన్‌లైన్‌ యుగంలో ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూసుకుని బాధ పడనక్కర్లేదు. దీనివల్ల ఆరోగ్యానికి చేటు తప్ప ఒరిగేదేమీ లేదు. నేను ఒకసారి క్యాప్‌ ధరించడం చూసి ఒకరు అన్నారు: ‘‘బఫూన్‌లా ఉన్నావు’’ అని. అంతమాత్రాన నేనేమీ చిన్నబోలేదు. అరవలేదు. హాయిగా నవ్వుకున్నాను. ఆన్‌లైన్‌ కామెంట్స్‌కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇస్తాను.

చదువు...
నా దృష్టిలో చదువుకు బాగా ప్రాధాన్యత ఉంది. చదివిన చదువు ఎప్పుడూ వృథా పోదు. చదువుకున్న వ్యక్తిలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జీవితంలో ముందుకు వెళ్లడానికి అవసరమైన జ్ఞానం వస్తుంది. సొంతకాళ్ల మీద ఎలా నిలబడాలో తెలుస్తుంది.

కొత్త జీవితం
‘నటన అంటే ఆషామాషీగా తీసుకోవాల్సిన వృత్తి కాదు’ అని చెబుతుంటారు నాన్న. ఆ ఒక్క మాటలోనే ఎన్నో పాఠాలు ఉన్నాయి అనిపిస్తుంది నాకు. బయట సంగతి ఎలా ఉన్నా ఇంట్లో మామూలు అమ్మాయిగానే పెరిగాను. సినిమాల్లోకి వచ్చాకే...దీపావళి పార్టీ, క్రిస్మస్‌ పార్టీ, బర్త్‌ డే పార్టీ, హాయ్‌ పార్టీ, బై పార్టీలు పరిచయమయ్యాయి. చెప్పాలంటే ఇప్పుడు నాకు జీవితం కొత్తగా ఉంది. 

మరిన్ని వార్తలు