నా పనే మాట్లాడుతుంది 

13 Dec, 2018 00:17 IST|Sakshi

‘‘ఈ ఏడాది 65 పాటలు రాశాను. పబ్లిసిటీపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. అందుకే ఏ వేదికపైనా మాట్లాడలేదు. నా పనే మాట్లాడాలని కోరుకుంటాను’’ అని పాటల రచయిత కృష్ణకాంత్‌ అన్నారు. శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ చిత్రంలో అన్ని పాటలు రాసిన కృష్ణకాంత్‌ విలేకర్లతో మాట్లాడారు. 

∙ఈ సినిమా టైటిల్‌ ‘పడిపడి లేచె మనసు’ అనుకోగానే  ‘ప్రళయంలోనూ ప్రణయంతోనే పరిచయం అయ్యే మనసు పడిపడి లేచె మనసు’ అనే త్రీ లైన్స్‌ రాశాను. ఈ లైన్స్‌లోనే సినిమా కథ ఉంది. అన్ని ప్రేమకథలు ఒకేలా ఉంటాయి. కానీ ప్రేమికులు ఎదుర్కొనే సంఘర్షణ డిఫరెంట్‌. ఈ సినిమాలో ఓ కొత్త కాన్‌ఫ్లిక్ట్‌ ఉంది. అది ఆడియన్స్‌కు కనెక్ట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది. ∙హను రాఘవపూడి అన్ని సినిమాలకు నేను పని చేశాను. ఆయన సినిమాలో అన్ని పాటలు సందర్భానుసారంగానే ఉంటాయి. ఈ సినిమాలోనూ అంతే. విశాల్‌ చంద్రశేఖర్‌ కూల్‌గా ఉంటాడు. తనతో వర్క్‌ చేయడం ఈజీ. ∙నా ఫేవరెట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎవరో ఒకరి పేరు చెప్పలేను. ఒక్కో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో ఒక్కో అనుభవం ఉంది. కీరవాణి, రెహమాన్‌గార్లతో కాకుండా అందరితో వర్క్‌ చేశాను. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్ర్రి, వేటూరిగార్లంటే నాకు ఇష్టం. వేటూరిగారు నాకు ప్రేరణ. ఆయన లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాసే పాటలు రిక్షావాడికి కూడా అర్థం అవుతాయి. ఐదేళ్ల క్రితం సినిమాలోని పాటల్లో బీట్స్‌కి ఇంపార్టెన్స్‌ ఉండేది. ఇప్పుడు లిరిక్స్‌కి ఉంటున్నాయి. ∙ఇప్పటివరకు ప్రేమకథా చిత్రాలు చేశాను. డిఫరెంట్‌గా చేయడానికి సిద్ధమే. గీత రచయితలకు సాహిత్యంపై అవగాహన ఉండాలి. జీవితాన్నైనా చదవాలి.. లేకపోతే పుస్తకాలైనా చదవాలి.

∙ప్రభాస్‌ 20వ చిత్రానికి ఇప్పటివరకు మూడు పాటలు రాశాను. ‘దటీజ్‌ మహాలక్ష్మి’ సినిమాకు సింగిల్‌ కార్డ్‌ రచయితగా చేశాను. రాజశేఖర్‌ ‘కల్కి’, నాని ‘జెర్సీ’లకు రాస్తున్నా. 

మరిన్ని వార్తలు