అది అవాస్తవం... బడ్జెట్‌లోనే తీశాం!

27 Jul, 2017 23:33 IST|Sakshi
అది అవాస్తవం... బడ్జెట్‌లోనే తీశాం!

‘‘నా సినిమా జర్నీ సంతృప్తికరంగా సాగుతోంది. కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. కొన్నింటిని డెవలప్‌ చేసుకుంటున్నాను. మరికొన్నింటిని తెలుసుకుంటున్నాను’’ అన్నారు డైరెక్టర్‌ సంపత్‌ నంది. ఆయన దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన సినిమా ‘గౌతమ్‌నంద’. భగవాన్, పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా సంపత్‌ నంది చెప్పిన విశేషాలు.

►‘బెంగాల్‌ టైగర్‌’ రిలీజ్‌ అయిన వెంటనే నేను మూడు, నాలుగు నెలలు స్క్రిప్ట్‌ వర్క్‌ చేశాను. ‘రచ్చ’ సినిమా తర్వాత భగవాన్, పుల్లారావులకు నేనో సినిమా చేయాల్సింది. ‘గౌతమ్‌నంద’తో కుదిరింది. కథ విని అద్భుతంగా ఉందని, మా దగ్గర గోపీచంద్‌గారి డేట్స్‌ ఉన్నాయన్నారు. గోపీగారు ఈ కథకు బాగుంటారనుకుని ఆయనకు కథ చెప్పాను. ఆయన కూడా ఎగై్జట్‌ అయ్యారు. అలా ఈ సినిమా మంచి ఎనర్జీతో స్టార్టయ్యింది.

►నా గత సినిమాలతో పోలిస్తే కొంచెం టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే ఈ సినిమా మీద హోప్స్‌ పెట్టుకున్నాను. నా గత చిత్రాలు రచ్చ, బెంగాల్‌ టైగర్‌ కమర్షియల్‌ సినిమాలు కాబట్టి, ఆడేస్తాయనుకున్నాను. ‘గౌతమ్‌నంద’ కంటెంట్‌ బేస్డ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. ప్రేక్షకులు ఎలా రియాక్ట్‌ అవుతారు? విమర్శకులు ఎలా రెస్పాండ్‌ అవుతారు? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

►గౌతమ్‌ ఘట్టమనేని అనే వ్యక్తి గౌతమ్‌నందగా ఎలా మారాడు? అన్నదే కథ. హీరో క్యారెక్టర్‌లో రెండు షెడ్స్‌ ఉంటాయి. డబ్బున్న మనిషి... మంచి మనిషిగా ఎలా మారాడు? అనేది స్టోరీ లైన్‌. విశ్వంలో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంటే మనందరం డబ్బు చుట్టూ తిరుగుతున్నాం అనే కాన్సెప్ట్‌ నుంచి పుట్టిందే ఈ కథ.

►ఘట్టమనేని అనే సర్‌ నేమ్‌కు సమాజంలో ఒక గౌరవం ఉంది. ఆ ఫ్యామిలీతో ఎటాచై ఉన్నవారందరూ మంచి స్థానంలో ఉన్నారు. ఆ పేరు పెట్టగానే హీరోను కూడా ప్రేక్షకులు నమ్ముతారనే నమ్మకంతో హీరోకు ఈ పేరు పెట్టడం జరిగింది.

► ‘రచ్చ’, ‘బెంగాల్‌టైగర్‌’ సినిమాల్లో ఒక బలమైన కథను స్ట్రాంగ్‌గా చెప్పలేకపోయానేమో.. అందుకే అవి నంబర్‌ వన్‌ కేటగిరీలోకి వెళ్లలేకపోయాయేమో అన్న ఫీలింగ్‌ నాకే పర్సనల్‌గా కలిగింది. అందుకే ఒక బలమైన క్యారెక్టర్‌కు మంచి కథ సూట్‌ అయితే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఈ స్క్రిప్ట్‌ రాయడం జరిగింది.

► లుక్‌ విషయానికొస్తే కథ రాసుకున్నప్పుడే గౌతమ్‌ ఘట్టమనేని క్యారెక్టర్‌కు నేను స్కెచ్‌ లుక్స్‌ రెడీ చేసుకున్నాను. గోపీచంద్‌కు ఆ లుక్స్‌ చూపించి మనం ట్రై చేయాలి అని చెప్పాను. ఆయన సర్‌ప్రైజ్‌ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌గారికి చేసే రాము అనే స్టైలిష్ట్‌ దగ్గరకు వెళ్లి హెయిర్‌స్టైల్‌ను సెట్‌ చేశాం. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ భాస్కర్‌తో కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశాం. అలా ఒక కొత్త లుక్‌ సెట్‌ అయింది.

►లుక్‌ సూట్‌ అవుతుందో లేదో అని నాకు టెన్షన్‌గా ఉండేది. అంటే గౌతమ్‌ ఘట్టమనేని అని చెబితే వెర్బల్‌గా మాత్రమే కాదు విజువల్‌గానూ గ్రాండ్‌గా ఉండా లి. నేను, మా చిత్ర యూనిట్‌ ఫోర్బ్స్‌ ఎంట్రీ కోసం వచ్చిన టాప్‌టెన్‌ లిస్ట్‌ తీసుకున్నాం. వారి పిల్లలు ఎలా ఉంటారు? థ్రిల్‌ కోసం ఏం చేస్తారు? ఎలాంటి కాస్ట్యూమ్స్‌ వేసుకుంటారు? ఎలాంటి బ్రాండ్స్‌ వేసుకుంటారు? అనేది అబ్జర్వ్‌ చేశాం. ఈ సినిమాలో గోపీచంద్‌కు అన్నీ ఒరిజినల్‌ బ్రాండ్స్‌నే వాడటం జరిగింది.

► ఈ సినిమాలో ‘ఇవా’ది ఇంపార్టెంట్‌ రోల్‌. ఇవా ఎవరు అంటే డాగ్‌. గౌతమ్‌కు ఫ్రెండ్‌. ‘ఇవా’ హీరోకు ఎలా హెల్ప్‌ చేసింది? అనేది సినిమాలో చూస్తారు. ‘ఇవా’తో షూట్‌ త్రీడేస్‌ అనుకుంటే సిక్స్‌ డేస్‌ పట్టింది. మేమందరం మాములుగా వస్తే ఇవా మాత్రం బెంజ్‌ కారులో వచ్చేది. ఈ సినిమాలో ఓ సాంVŠ  కోసం కోటి ఖర్చు చేశామన్నది అవాస్తవం. ఈ సినిమాకు ఓవర్‌ బడ్జెట్‌ కాలేదు. కథ చెప్పినప్పుడు నిర్మాతలకు ఏ బడ్జెట్‌ చెప్పామో అదే బడ్జెట్‌లో తీయడం జరిగింది. కథ పరంగా నాకు చాలా సంతృప్తి కలిగింది. నా గత సినిమాల్లో స్క్రిప్ట్‌ పరంగా నేను 60 శాతం శాటిస్‌ఫై అయితే ఈ కథ పరంగా 90 శాతం తృప్తి కలిగింది. ఇది పవన్‌కల్యాణ్‌కు అనుకున్న కథ కాదు. ఆయనతో సినిమా అంటారా.. ఎప్పుడు పిలిస్తే అప్పుడే.

►నాయర్‌ పిళ్లై అనే అతను రాసిన క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్, రమణ మహర్షి పుస్తకంలో ఉన్న కాన్సెప్ట్‌ ఈ సినిమాకి ఆధారం. ఒక మనిషి తన జీవితంలో ఒక్కసారైనా నేను ఎవరు? అని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నతోనే ఈ సినిమా జర్నీ స్టార్ట్‌ అవుతుంది.

►ప్రస్తుతం నిర్మాతగా ‘పేపర్‌బాయ్‌’ చేస్తున్నా. ఈ చిత్రానికి. జయ్‌శంకర్‌ దర్శకుడు. సినిమాను డబ్బులతో పోల్చకూడదని నా అభిప్రాయం. అయితే తీసిన వారికి, కొన్నవారికి లాభాలు రావాలి. నేను నిర్మాతను అయితే ఎక్కువ డబ్బులు పెడతాను.

► ఇండస్ట్రీలో నాకు గాడ్‌ఫాదర్‌ ఎవరూ లేరు. మా నాన్నగారే నాకు అన్నీ. నేను అక్షరాలు నేర్చుకున్నది పోసానిగారి దగ్గర కాబట్టి ఆయ నంటే అభిమానం. నెక్ట్స్‌ సినిమా ఇంకా ఏ హీరోతోనూ అనుకోలేదు. ఇలాగే ఒక మంచి క్యారెక్టర్‌కు కథను డెవలప్‌ చేసి, దానికి సూట్‌ అయ్యే హీరోకి వినిపించాలనుకుంటున్నాను.

►ఎంతో పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న తర్వాత ఆరోపణలు రావడం ఎవరికైనా బాధగా ఉంటుంది. రవితేజగారితో ‘బెంగాల్‌ టైగర్‌’ సినిమా కోసం ఏడాదిన్నర పని చేశాను. అయితే డ్రగ్స్‌ గురించి నాకేం తెలియదు. అందుకే ఆడియో ఫంక్షన్‌ (‘బెంగాల్‌ టైగర్‌) లో ఆయన్ను గోల్డ్‌ అన్నాను.