కన్నీరూ నీరే

7 Oct, 2018 00:08 IST|Sakshi
‘సాక్షి’కి ఇచ్చిన ముఖాముఖి ఇంటర్వ్యూలో నాన్నను తలచుకుని జీవితాన్ని తరచి చూసిన తారకతత్వం.. మీ కోసం.  

 అమ్మ, ప్రణతి మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌ ఉంది.

మా ఇంట్లో నేనే అల్లరి.

మనవళ్లంటే నాన్నకు చాలా ఇష్టం.

రిజల్ట్‌ని బట్టి రిలేషన్‌షిప్స్‌ ఉండవు.

నేను ప్రాక్టికల్‌.

‘అరవింద సమేత వీర రాఘవ’ నాలో మార్పు తెచ్చింది.

దుఃఖం మనిషిని ఎడారిలో నిలబెడుతుంది.మనసంతా పొడిపొడిగా అనిపిస్తుంది.ముట్టుకుంటే పగిలిపోతుందేమోనన్నంతగా..హృదయం సున్నితం అయిపోతుంది.కష్టం ఒక తీవ్రమైన, తీరని దాహం. ఈ దాహాన్ని కన్నీరే తీర్చగలదు.బంధాల్లో పంచుకున్న ఉప్పే..బాధలోని ఉప్పెనని సమసిపోయేలా చేయగలదు.అవును. కన్నీరూ.. నీరే!జీవనతృష్ణకు పన్నీరే!!∙  

జీవితం చిత్రమైనది. కొన్ని నెలల వ్యవధిలోనే ఒక జననం, ఓ దుర్ఘటన చూశారు. ఇప్పుడు మీరు జీవితాన్ని చూసే కోణంలో ఏదైనా మార్పు వచ్చిందా?
ఎన్టీఆర్‌: జీవితం మీద నాకు అవగాహన ఉంది. ‘జీవితం అంటేనే క్షణికం’. ఆనందాలను ఎదురుచూసి, అవి వచ్చినప్పుడు ఆనందించినట్లుగానే ఒడిదుడుకుల కోసం కూడా సిద్ధంగా ఉండాలి. అవి ఎదుర్కొనేంత మనోధైర్యం ఉండాలి. అప్పుడే అది జీవితం అవుతుంది. ఇది తెలుసు కాబట్టి కొత్తగా నాలో ఏ మార్పూ రాలేదు.
     
ఈ ఆలోచనా ధోరణి ఎప్పుడు అలవాటైంది? 
మొదట్నుంచీ ఇంతే. బేసిక్‌గా నేనిలానే ఉంటాను. మనకు ఎప్పుడు పిలుపొస్తుందో తెలియదు. జీవితం తాలూకు అన్ని బరువు బాధ్యతలు నిర్వర్తించాలి, ఆనందాలు అనుభవించేయాలి. అద్భుతమైన జీవితాన్ని బతకాలన్నదే నా ఉద్దేశం. నేను నిద్రలేచిన ప్రతి రోజునీ బోనస్‌లానే అనుకుంటాను.
     
నాన్నగారి హఠాన్మరణం నుంచి మీ అమ్మగారు తేరుకున్నారా?
ఆ షాక్‌ నుంచి మెల్లిగా తేరుకుంటున్నారు. గాయం ఇంకా పచ్చిగానే ఉంది. మా అందరికంటే అమ్మకు, పెద్దమ్మకు (కల్యాణ్‌ రామ్‌ తల్లి) కష్టం. ఇద్దరూ నెమ్మదిగా ఆ విషాదం నుంచి బయటికొస్తున్నారు. 
   
ఈ సమయంలో అమ్మకు కొడుకుగా ధైర్యం చెప్పాలి. అలాగే ఇద్దరు బిడ్డలకు తండ్రిగా వాళ్లతో హుషారుగా గడపాలి. ఈ రెండు పరిస్థితులను ఎలా హ్యాండిల్‌ చేస్తున్నారు?
కొన్ని భావాలను బయటకు చెప్పుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఉన్న ఈ పరిస్థితిని పంచుకోవడానికి పదాలు దొరకడంలేదు. చెప్పడానికి వీలుగా ఉండే వాక్యాలు కొన్నిసార్లు దొరకవు. ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు నా పరిస్థితి అదే (కాసేపు మౌనం).
     
సాధారణంగా ఆనందం, దుఃఖం.. ఈ రెంటినీ ఎవరితో పంచుకుంటారు?
నాలో సగం నా భార్య ప్రణతి. తనతో అన్నీ చెప్పుకుంటాను. మా అమ్మ, నాన్న, కల్యాణ్‌ అన్న, కొంతమంది మిత్రులు... వీళ్లంతా నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తులు. నా కోసం నిలబడేవాళ్లు. వాళ్ళతో చెప్పుకుంటాను. ఇప్పుడు నాన్నగారు లేరు.
     
కొన్ని ఆనంద సంఘటనలు, విచారకర పరిస్థితులు కొత్త బంధాలను తీసుకు వస్తాయంటారు. మీకు అలాంటివి ఏమైనా ఏర్పడ్డాయా? 
ఏదీ లేదు. నా బంధాలన్నీ అలానే ఉన్నాయి. ఇలాంటివి నేను నమ్మను. ఇవాళ ఇది జరిగిందని కొత్తగా ఓ బంధం ఏర్పడటం అనేది లేదు. ఉన్న బంధాలు పోతాయని లేదు. బంధాలన్నీ మంచికి, చెడుకి అతీతంగానే ఏర్పడతాయన్నది నా నమ్మకం. చెడు జరిగిందని ఏ బంధాన్నీ తుంచేసుకోలేం. నా పిల్లలిద్దరూ చిన్నవాళ్లే అయినా వాళ్లను చూస్తున్నప్పుడు ఏదో బిగ్గెస్ట్‌ సపోర్ట్‌లా అనిపిస్తుంది. ఇక నా జీవితం అంతా నా పిల్లలే. 
     
దీన్నే సినిమాలకూ అన్వయిస్తారా? రిజల్ట్‌తో సంబంధం లేకుండా డైరెక్టర్‌తో కొనసాగుతారా?
రిజల్ట్‌ని బట్టి రిలేషన్‌షిప్‌లు ఉండవు. ఉండకూడదు అని నమ్ముతాను. మనం ఆరు నెలల పాటు ఒక ప్రయాణం (సినిమా మేకింగ్‌) చేసిన తర్వాత దాని తాలూకు రిజల్ట్‌ బాగాలేకపోయినా ఆ ఆరు నెలల ప్రయాణం చాలా బావుంటే దాన్ని వదిలేయలేం కదా. రిలేషన్స్‌ మనకు అద్భుతమైన ఫీలింగ్‌నిస్తాయి. లోపల చాలా బలాన్ని, భరోసాన్నిస్తాయి. అందుకే సినిమా రిజల్ట్‌తో అవి ముడిపడి ఉండకూడదని అనుకుంటాను. 
     
పాతికేళ్ల వయసులో కొంచెం ఆవేశపరుడు అనిపించుకున్నారు. ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. అప్పుడు అలా ఆవేశంగా ఉండి ఉండకూడదని ఎప్పుడైనా అనిపించిందా?  
నేనెప్పుడూ దేనికీ పశ్చాత్తాపపడలేదు. పాతికేళ్ల వయసులో ఆవేశపరుడు అని మీరు అంటున్నారు. ఆ ఆవేశమే సక్సెస్‌ తీసుకువచ్చింది అని నేనంటే? మనం మనుషులం. నిరంతరం మారుతూనే ఉంటాం. మార్పు మంచికా లేక చెడుకా అని మనం చెప్పలేం. అయితే మనం మారుతూనే ఉండాలి. మారుతూనే ఉంటాం. ఒక్కో వ్యక్తికి ఒక్కో వయసులో ఒక్కోలాంటి యాటిట్యూడ్‌ ఉంటుంది. పాతికేళ్ల వయసులో నాకు పెళ్లి అవ్వలేదు. 27 ఏళ్ల వయసులో పెళ్లయింది. నాకో లైఫ్‌ పార్టనర్‌ ఉంది. ఇద్దరు పిల్లలున్నారు. నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. 
     
మనవళ్లను చూసుకొని మీ నాన్నగారు ఎలా ఫీల్‌ అయ్యేవారు? 

మనవళ్లందరితో నాన్నగారు క్లోజ్‌. జానకి రామ్‌ అన్న, కల్యాణ్‌ అన్న పిల్లలు, నా పిల్లలు అభయ్‌తో, భార్గవ్‌తో కూడా సరదాగా ఉండేవారు. నా ఆనందమేంటంటే నాన్నగారు నా రెండో అబ్బాయి భార్గవ్‌ని కూడా చూశారు. మా ఇంట్లో జరిగిన అన్ని వేడుకలకు.. ఆ మధ్య జరిగిన భార్గవ్‌ నామకరణ వేడుక వరకూ అన్నింట్లో నాన్నగారు  ఉన్నారు. ఇక మీద జరగబోయే వేడుకల్లో ఉండరు. అది మాకెప్పటికీ కొరతగానే ఉంటుంది. భౌతికంగా మాతో లేకపోయినా మా అందరి జ్ఞాపకాల్లో ఆయన ఎప్పటికీ ఉండిపోతారు.  
     
పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు మీ నాన్నగారిని సలహా అడిగేవారా?
అడుగుతాం. మా అందరికీ  రాముడి పేర్లు పెట్టారు. జానకిరామ్, కల్యాణ్‌ రామ్, తారకరామ్‌ అని. మా పిల్లలకు కూడా మేం అలానే పెట్టాం. జానకిరామ్‌ అన్న కొడుక్కి తారక రామారావు అని, కల్యాణ్‌ అన్న శౌర్యా రామ్‌ అని పేర్లు పెట్టారు. నా పిల్లలకు అభయ్‌ రామ్, భార్గవ రామ్‌ అని నామకరణం చేశా. నాకు చాలా ఇష్టమైన పేరు భార్గవ రామ్‌.
     
పిల్లలిద్దరూ అల్లరి చేస్తున్నారా? 

అల్లరి కామన్‌. అయితే ఏ ఇంట్లో అయినా పిల్లల అల్లరి తట్టుకోవడం కష్టం. మా ఇంట్లోవాళ్లు నా అల్లరి తట్టుకోలేరు. పిల్లలను నేను బాగా ముద్దు చేసేస్తుంటాను. మా అబ్బాయిలతో ‘నిన్ను సాల్ట్‌ పెప్పర్‌ వేసి కొరుక్కు తినేస్తాను రా’ అంటుంటా. మా పెద్దబ్బాయి ఎప్పుడైనా ‘ఇదిగో తీసుకో.. నన్ను తినేయ్‌’ అని సరదాగా అంటుంటాడు.
     
సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తే భర్తకు కంప్లైంట్‌ చేస్తుంది భార్య. మీ అల్లరిని ప్రణతి ఎవరికి చెబుతారు?
మా అమ్మకు (నవ్వుతూ). ‘వాడి అల్లరి గురించి తెలిసిందే కదా’ అంటుంది. భార్గవ్‌ అప్పుడు ఆడపిల్ల పుట్టాలి అనుకున్నాం కానీ అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు ప్రణతి అంటుంది.. నాకు ముగ్గురు కొడుకులు అని. నాతో కలిపి ముగ్గురు అని తన ఉద్దేశం.
     
కోడలితో తన కొడుకు చేసిన అల్లరిని అత్తగారు షేర్‌ చేసుకుంటారా ?
చాలా షేర్‌ చేసుకుంటారు. అబ్బో.. నా అల్లరి గురించి చెప్పాలంటే ఒక్కటి కాదు.. చాలా ఉన్నాయి. మా అమ్మ ఏకంగా పుస్తకం రాసేంత ఉన్నాయి. జనరల్‌గా అమ్మమ్మ, తాతయ్యలు ఇంట్లో ఉంటే పిల్లలకు బోలెడన్ని కథలు చెబుతుంటారు. నా పిల్లలకు ఆ అడ్వాంటేజ్‌ ఉంది. మా అమ్మ పిల్లలకు చాలా కథలు చెబుతుంది. నా డౌట్‌ ఏంటంటే.. నా అల్లరి పుస్తకంలో నుంచి కూడా ఏమైనా లీక్‌ చేస్తుందేమో అని (నవ్వులు).
   
అత్తా కోడళ్ల ఈక్వేషన్‌ ఎలా ఉంటుంది? 
నా పెళ్లవ్వక ముందు నేను బాగా కోరుకున్నది ఒక్కటే. మా అమ్మ, నా భార్య బాగా కలసి మెలసి ఉండాలని. ఎందుకంటే నా జీవితంలో అతి ముఖ్యమైన ఆడవాళ్లు వాళ్లిద్దరే. ఎవరితో ఎవరికి పడకపోయినా బాధపడేవాడ్ని. లక్కీగా అలాంటిదేం జరగలేదు. ఇద్దరి మధ్య  అద్భుతమైన అండర్‌స్టాడింగ్‌ ఉంది. నేను ఒక్కడ్నే అబ్బాయిని కాబట్టి అమ్మకు అమ్మాయి లేని లోటు ఉండేది. అందుకే ప్రణతిని కూతురిలా చూసుకుంటుంది.
     
అందుకేనేమో మీ అమ్మగారి తోబుట్టువుల కూతుళ్లను ఆమె బాగా చూస్తారట. అక్కాచెల్లెళ్ల విషయంలో మీరు కూడా బాధ్యతగా ఉంటారని విన్నాం.. 

ఇది సహజమైన బాధ్యత. దీని గురించి బయటికి చెప్పాలంటే ఏదోలా ఉంటుంది.
     
చెబితే ఆకతాయితనంగా ఉండే అబ్బాయిలకు ఓ ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది కదా?
అమ్మవాళ్ళు మొత్తం తొమ్మిది మంది. వాళ్లకు పుట్టినవాళ్లల్లో ఆడపిల్లలు ఐదుగురు ఉన్నారు. కూతుళ్లందరూ బాగుండాలని అమ్మ కోరిక. అమ్మ కోరికకు తిరుగుండదు కదా. ఇందాక అన్నాను కదా.. జీవితం క్షణికం అని. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి తరం కాదు. ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి. మన బాధ్యతలన్నీ తీర్చాలి. అన్నగా, కొడుకుగా, భర్తగా, తండ్రిగా, ఫ్రెండ్‌గా, మనవడిగా, నటుడిగా... ఈ బాధ్యతలన్నీ సక్రమంగా పూర్తి చేస్తే  జీవితానికి ఓ పరిపూర్ణత వస్తుందని నమ్ముతాను. నేను ప్రాక్టికల్‌ పర్సన్‌ని. ‘జీవితం అంటే ఇది.. ఇలా ఉండాలి’ అని బోధించే రకాన్ని కాదు నేను. ప్రాక్టికల్‌గా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం.

మొన్న ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో మీ నాన్నగారి గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. ప్రాక్టికల్‌గా ఉండే మనిషి ఎమోషనల్‌గా ఉండటం కుదురుతుందా?
కుదురుతుంది. ప్రాక్టికల్‌గా ఉండటమే ఎమోషనల్‌గా ఉండటం అంటున్నాను. ప్రాక్టికాలిటీ అంటే నిజాన్ని అంగీకరించడం. అందులో ఎమోషన్‌ కూడా ఓ భాగమే. ఎమోషనల్‌గా ఎందుకు ఉండకూడదు అంటాను. మా నాన్నగారు చనిపోయారు. మరణం సహజం అని తెలుసు. తెలిసినా మనిషి పోయినందుకు బాధగా ఉంటుంది. మా నాన్న పోయారు. బాధ చాలా ఉంటుంది. అది కన్నీళ్ల రూపంలో వస్తుంది. నా దృష్టిలో అది కూడా ప్రాక్టికాలిటీనే.

మీ ఫ్యామిలీ ఎక్కువ రోడ్‌ యాక్సిడెంట్స్‌కి గురి కావడం చూస్తున్నాం. అది భయంగా అనిపిస్తుందా? 
లేదు. జరిగింది జరిగిపోయింది. ఆ ఘటనలను ఎనలైజ్‌ చేయకూడదు. ఇలా జరిగింది కాబట్టి అలా ఆలోచిస్తున్నాం తప్పితే ఒకవేళ వేరేలా జరిగితే? ఇలా అనుకోం కదా. మనం దేంట్లో నుంచి తప్పించుకోలేం కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం.. హఠాత్తుగా పైన తిరుగుతున్న ఫ్యాన్‌ మన తల మీద పడొచ్చు. లేదా బయటికి వెళ్లినప్పుడు వేరే ఏదో జరగొచ్చు. ఇది ఇలానే ఎందుకు జరిగింది? అని ఎనలైజ్‌ చేయలేం. జరగాలని రాసి పెట్టి ఉంటే.. జరుగుతుంది. అంతే. అందుకే ఉన్నంతవరకూ హ్యాపీగా జీవించాలి.బిగ్‌బాస్‌ ఫస్ట్‌ సీజన్‌లో నాకు మంచి పేరు రావడం ఆనందంగా ఉంది. నెక్ట్స్‌ సీజన్‌లో నేనే చేస్తానా? అంటే దాని గురించి మాట్లాడడం టూ ఎర్లీ అవుతుంది.

   

త్రివిక్రమ్‌ని స్వామీ అనడంవెనక స్టోరీ లేదు
‘అరవింద సమేత వీర రాఘవ’ అంటూ.. టైటిల్‌లో హీరోయిన్‌కి ప్రాధాన్యం ఇచ్చారు... 
కథకు సరిపోతుందని ఆ టైటిల్‌ పెట్టాం. లక్ష్మీసమేత లక్ష్మీనరసింహులువారు, సీతాసమేత రాములువారు అని దేవాలయాల్లో అంటుంటాం. దేవతలను గౌరవంగా స్మరించుకోవడం అనేది మన సంప్రదాయంలోనే ఉంది. ఈ సినిమా కథ అలాంటిదే కాబట్టి, ఇది జెన్యూన్‌ టైటిల్‌గా భావించాం. ఒక మనిషి జీవితంలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమన్నది ఈ సినిమాలో చెప్పాం.
     
త్రివిక్రమ్‌తో ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నారు. కాంబినేషన్‌ కుదిరాక ‘సూపర్‌ హిట్‌’ని టార్గెట్‌ చేయాలని మాట్లాడుకున్నారా?

త్రివిక్రమ్‌ నాకు చాలా కాలం నుంచి తెలుసు. మా కాంబినేషన్‌ కుదిరాక హిట్‌ సినిమానే తీయాలనే ఒత్తిడి నేను పెట్టుకోలేదు. అసలు దాని గురించి ఆయనతో మాట్లాడలేదు. బేసిక్‌గా నేను సినిమా జర్నీ బాగుండాలని కోరుకుంటాను. ఒక్కోసారి ఫిల్మ్‌ మేకింగ్‌ జర్నీ బాగుండదు. కానీ రిజల్ట్‌ బాగుంటుంది. ఇంకొన్నిసార్లు జర్నీ బాగుంటుంది కానీ ఎండ్‌ రిజల్ట్‌ నెగటీవ్‌గా ఉండొచ్చు. ఒక్కోసారి జర్నీ బాగుంటుంది. రిజల్టూ బాగుంటుంది. నాది, త్రివిక్రమ్‌ది జర్నీ బాగుంది. మంచి సినిమా ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేశాం. అది మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. ఎండ్‌ రిజల్ట్‌ గురించి ఊహించలేం. ఒక సూపర్‌హిట్‌ సినిమాను ఎలా ప్రేక్షకులకు అందించాలి అని అడిగితే ఏ ఫిల్మ్‌మేకర్‌ దగ్గరా సమాధానం ఉండదు. ఇలా చేయాలని ఒక మెథడ్‌ ఉండదు. 
     
‘అజ్ఞాతవాసి’ తర్వాత ఓ హిట్‌ సినిమా తీయాలనే ప్రెజర్‌తో త్రివిక్రమ్‌ ఈ సినిమా చేసినట్లు మీకనిపించిందా?
 హిట్‌ సాధించాలనే ప్రెజర్‌ త్రివిక్రమ్‌కే కాదు. అలాంటి ప్రెజర్‌ అందరికీ ఉంటుంది. ఆ మాటకు వస్తే నాకూ ఉంటుంది. నేనూ  వైఫల్యాలను చూశాను. ఇక్కడ ఎవరూ ఫెయిల్యూర్‌కి అతీతం కాదు. ఒత్తిడి కామన్‌. అయితే దీనిని ఎంత పాజిటివ్‌గా తీసుకుని, ముందుకు వెళతామన్నదే జీవితం.
     
ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలొచ్చాయి. ఇది కూడా ఆ కోవకు చెందిన సినిమానే కదా?
అవును.. ఇది ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. ఈ జానర్‌లో చాలా సినిమాలు వచ్చాయి. ఓ పరిష్కారం కోసం వాళ్ల కోణంలో సినిమాలు తీశారు. ‘అరవింద..’ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో వయొలెన్స్‌ కూడా ఒక పార్ట్‌లానే ఉంటుంది. సందేశం కోసం సినిమా తీయకూడదు. స్టోరీలో దానికి ఆస్కారం ఉండి, సమాజానికి ఉపయోగపడుతుందంటే అప్పుడు సందేశం ఉండాలి. ఈ సినిమాలో ఒక డైలాగ్‌ ఉంది. ‘యుద్ధం చేసే సత్తా లేనివాడికి శాంతి అడిగే హక్కులేదు’ అని. ఎంత అర్థం ఉంది. నిజమే కదా.. మాట్లాడకుండా ఒక సమస్యకు పరిష్కారం ఉండదు కదా. అలాగని ‘అరవిందసమేత’ ఫుల్‌ యాక్షన్‌ సినిమా కాదు. ఇగో శాటిస్‌ఫ్యాక్షన్, పూర్తి హింస నేపథ్యంలో సాగే చిత్రం కాదు. ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు కనెక్ట్‌ అయ్యాను. వ్యక్తిగతంగా కూడా నాలో మార్పు వచ్చిందనుకుంటున్నాను. మంచి క్యారెక్టర్‌ చేశాను. మంచి భర్త, మంచి నాన్న, మంచి కొడుకు.. ఇలా ఇంకా బెటర్‌ పర్సన్‌ కావాలనుకుంటున్నాను. ఈ సినిమా ప్రభావం ఆడియన్స్‌పై కూడా ఉండొచ్చు.

త్రివిక్రమ్‌ని స్వామీ అని ప్రీ–రిలీజ్‌ వేడుకలో అన్నారు..
అలా అనడానికి స్టోరీ లేదు. మామూలుగా భయ్యా అని అంటుంటాం కదా. అలా సరదాగా పిలిచినదే. 

ఈ సినిమా మీ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటుందా? త్రివిక్రమ్‌ స్టైల్లోనా?
ఇది నా ఇమేజ్‌ మీద తీసినది కాదు. త్రివిక్రమ్‌ జర్నీలో ఎన్టీఆర్‌ కలిశాడు. త్రివిక్రమ్‌ స్టోరీ టెల్లింగ్‌లో మేముందరం భాగం అయ్యాం. ఎప్పుడైతే డైరెక్టర్‌కు ఆ స్వేచ్ఛ దొరుకుతుందో అప్పుడు మంచి పాత్రలు రాయగలడు. దర్శకుడు, హీరో భార్యాభర్తల్లాంటి వాళ్లు. ఎలా అంటే హీరోకి మొదటి ప్రేక్షకుడు దర్శకుడే. ఎందుకంటే తను అనుకున్న కథకు ముఖం నటుడు. నటులు శాటిస్‌ఫై చేయాల్సిన మొట్టమొదటి ప్రేక్షకుడు కూడా దర్శకుడే అవుతాడు. డైరెక్టర్‌ దృష్టి కోణం నుంచే ఏ సినిమా అయినా వస్తుంది.  ఈ విషయంలో నా డైరెక్టర్స్‌ అందరితో మంచి సంబంధాలున్నాయి. 

‘పెనివిటీ...’ సాంగ్‌కు బాగా కనెక్ట్‌ అయినట్లున్నారు? 
మా నాన్నగారు చనిపోయిన తర్వాత తీసిన పాట ఇది. ఆ పాట తీస్తున్నంత సేపూ మా అమ్మగారే గుర్తు వచ్చారు. నా జీవితంలో రీసెంట్‌గా ఓ దుర్ఘటన జరిగింది కాబట్టి ఈ పాటకు కదిలిపోయానని కాదు. అందరికీ రిలేట్‌ అవుతుంది. ఈ సినిమాలో త్రివిక్రమ్‌ మార్క్‌ ఏంటీ అంటే అది ‘పెనివిటీ.. ’ సాంగ్‌. 

సినిమాలో రాయలసీమ స్లాంగ్‌ మాట్లాడారు కదా. కష్టం అనిపించిందా?
రాయలసీమ యాస గురించి రచయిత పెంచల్‌దాస్‌గారితో మాట్లాడితే నాకు అర్థం అయ్యింది. ఆ యాస పలకడం చాలెంజింగ్‌గా అనిపించింది. 

►‘అరవింద సమేత..’ తర్వాత వెంటనే చేయబోయేది రాజమౌళి సినిమానే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రామ్‌చరణ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఓ ఎగై్జట్‌మెంట్‌. ఈ సినిమా ఓ కొత్త ఒరవడికి నాంది అనిపిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ కాదు. జస్ట్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం అలా ఇచ్చాం. అలాగే అశ్వినీ దత్‌గారి బ్యానర్‌లో ఓ సినిమా ఉంది. 

►మహేశ్‌బాబు, నేను, రామ్‌చరణ్‌ కలిసి సినిమా చేయడానికి మాకు ప్రాబ్లమ్‌ లేదు. కానీ ఎవరు హ్యాండిల్‌ చేయగలరు? ఆ కెప్టెన్‌ (దర్శకుడు) ఎవరు? మేం ముగ్గురం కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం. కానీ ప్రీ ప్లాన్‌ చేసి సినిమాలు చేయాలనుకోం. ప్రీ ప్లాన్‌ చేసుకున్నవి ఏం అయ్యాయో పర్సనల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉంది.

ఫైనల్లీ.. మీ నాన్నగారి గురించి ఇంకో ప్రశ్న.. మీ సక్సెస్, ఫెయిల్యూర్స్‌కి ఎలా స్పందించేవారు?
మా సక్సెస్‌కి ఆనందం పొందారు. ఫెయిల్యూర్స్‌కి బాధపడ్డారు. సంతోషం ఏంటంటే నాన్నగారు అన్నీ చూసేశారు. పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారు.
– డి.జి. భవాని​​​​​​​

మరిన్ని వార్తలు