ఎన్టీఆర్‌కి దాన వీర శూర కర్ణ బాలకృష్ణకి శాతకర్ణి...

31 Jan, 2017 23:36 IST|Sakshi
ఎన్టీఆర్‌కి దాన వీర శూర కర్ణ బాలకృష్ణకి శాతకర్ణి...

–టీఎస్సార్‌
‘‘తెలుగు సినిమా చరిత్రలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఓ మైలురాయి. తెలుగు వారికి తెలియని ఓ తెలుగు వీరుణ్ణి క్రిష్‌ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎన్టీఆర్‌గారిని ‘దాన వీర శూర కర్ణ’గా  ప్రేక్షకులు గుర్తించుకున్నట్లు.. బాలకృష్ణను ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గా గుర్తు పెట్టుకుంటారు. ఈ సినిమా తర్వాతి తరాలకు ఒక పాఠ్యాంశంలా నిలుస్తుంది’’ అని ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. బాలకృష్ణ, శ్రియ జంటగా క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయం సాధించిన సందర్భంగా ఆ చిత్ర యూనిట్‌ను టీఎస్సార్‌ సన్మానించారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నటించడం నా పూర్వజన్మ సుకృతం. నాన్నగారు ‘శాతకర్ణుడి’ చరిత్రతో సినిమా చేద్దామనుకున్నారు.

ఆ అవకాశం నాకు వచ్చిందంటే ఆయన ఆశీస్సులే. కళలను ప్రోత్సహిస్తున్న సుబ్బరామి రెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా చరిత్రపై బాలకృష్ణ గారి వేలిముద్ర ‘గౌతమిపుత్ర శాతకర్ణి’’ అని క్రిష్‌ అన్నారు. బాలకృష్ణ, క్రిష్, నిర్మాతలు జాగర్లమూడి సాయిబాబు, బిబో శ్రీనివాస్, రచయిత బుర్రా సాయిమాధవ్, సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్, సంగీత దర్శకులు చిరంతన్‌ భట్‌ తదితరులను టీఎస్సార్‌ సన్మానించారు. దర్శకులు కె.రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, పీవీపీ, సాయి కొర్రపాటి, హీరోలు వెంకటేష్, మంచు విష్ణు, మనోజ్, నటి జయసుధ, హీరోయిన్‌ తమన్నా పాల్గొన్నారు.