నా పేరు మర్చిపోయారు!

26 Jun, 2016 23:26 IST|Sakshi
నా పేరు మర్చిపోయారు!

సత్యరాజ్... అంటే ఎవరు? అని అడిగితే చాలామంది ‘ఎవరాయన?’ అన్నట్లు చూస్తారు. అదే ‘కట్టప్ప’ అని అడగండి... తడుముకోకుండా సమాధానం చెప్పేస్తారు. ‘బాహుబలి’లో చేసిన కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా సత్యరాజ్ అభిమానులను సంపాదించుకున్నారు. త్వరలో ఆయన దెయ్యంగా భయపెట్టనున్నారు. సత్యరాజ్, ఆయన తనయుడు శిబిరాజ్ కలసి నటించిన తమిళ హారర్ సినిమా ‘జాక్సన్ దొరై’. దరణీధరన్ దర్శకుడు. నిర్మాత జక్కం జవహర్‌బాబు తెలుగులో ‘దొర’గా అనువదించారు. జులై 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా సత్యరాజ్ చెప్పిన విశేషాలు...

కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన పీరియాడికల్ హారర్ మూవీ ‘దొర’. జాక్సన్ అనే బ్రిటీష్ దెయ్యానికీ, దొర అనే ఇండియన్ దెయ్యానికీ మధ్య కథ జరుగుతుంది. నేను ఇండియన్ దెయ్యంగా నటించా. తెలుగు, తమిళంతో సహా ప్రస్తుతం అన్ని భాషల్లోనూ హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ధరణీదరన్ చెప్పిన కథ బాగా నచ్చి, ఈ సినిమా ఒప్పుకున్నాను. తొలిసారి దెయ్యం పాత్ర చేశా.

ఆత్మలు ఇలా ప్రవర్తించాలి, ఇలాగే ఉండాలని రూల్ లేదు కదా! వాటికి ప్రత్యేకమైన మేనరి జమ్స్ ఉంటాయో.. ఉండవో? అందుకే నా స్టయిల్‌లో దర్శకుడు చెప్పినట్లు నటించాను.   

రాజమౌళి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘స్టూడెంట్ నెం.1’ తమిళ రీమేక్‌తో మా అబ్బాయి శిబిరాజ్ హీరోగా పరిచయమయ్యాడు. గతంలో శిబీతో కలసి నటించాను. మళ్లీ ‘దొర’లో నటించడం హ్యాపీగా ఉంది.

ఈతరం దర్శకులు నన్ను, నా నటనను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాస్తున్నా రు. రాజమౌళి, కొరటాల శివ, శ్రీకాంత్ అడ్డాల.. ఇలా ప్రతి ఒక్కరూ విభిన్నమైన పాత్రలు రాయడం వలనే నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్క రించుకునే అవకాశం లభించింది. ఓ నటుణ్ణి దృష్టిలో పెట్టుకుని దర్శకులు పాత్రలు రాస్తుంటే గర్వంగా ఉంటుంది. ఇంతకంటే కావల్సింది ఏముంటుంది?

సుమారు 220 చిత్రాల్లో నటించా. 38 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాను. కానీ, ప్రస్తుతం అందరూ నా పేరు మర్చిపోయి ‘కట్టప్ప’ అని పిలుస్తున్నారు. చిన్నారులు సైతం ‘కట్టప్ప’ అని గుర్తుపడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఘనత దర్శకుడు రాజమౌళిదే. జీవితంలో ఒక్కసారే ఇటువంటి పాత్రలు లభిస్తాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’లో కట్టప్ప పాత్ర ఇంకా బలంగా ఉంటుంది.

 ‘బాహుబలి 2’తో పాటు సంతోష్ శ్రీనివాస్ సినిమాలో రామ్ తండ్రిగా.. తెలుగు ‘పటాస్’లో సాయికుమార్ చేసిన పాత్రను తమిళ రీమేక్‌లో చేస్తున్నాను.