కాంచనవనం

16 Sep, 2018 01:41 IST|Sakshi

ఆకాశ వీధి నుంచి ప్రయాణం మొదలుపెట్టారామె. సినీపథంలో పరుగులు తీశారు. వాటిని దాటుకుని ఆమె తపోవనం చేరారు. అక్కడే తన దేవుడ్ని, తనని తెలుసుకున్నారు. ఆ వనమే కాంచనవనం.

సన్మాన వేడుక కోసం హైదరాబాద్‌ వచ్చారు. అవార్డులూ రివార్డులు మీకు కొత్త కాదు..
కాంచన: 46 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం ఈ సన్మానాలు, సత్కారాలు. కొత్త కాకపోయినా హ్యాపీ.

స్వాతంత్య్రం రాకముందు (1939) ఆగస్ట్‌ 16న పుట్టారు. మొన్న బర్త్‌డేని ఎలా జరుపుకున్నారు?
పదేళ్లుగా పుట్టినరోజు వేడుకలు లేవు. అసలు గుర్తుండేది కాదు. ఇప్పుడంటే వాట్సాప్‌ వచ్చింది కాబట్టి, ఎవరి పుట్టినరోజైనా ఇట్టే తెలిసిపోతోంది. అప్పట్లో అవి లేవు కదా. అందుకని గుర్తుపెట్టుకుని విషెస్‌ చెప్పేవాళ్లు తక్కువ ఉండేవాళ్లు. పుట్టిన రోజు ప్రత్యేకత ఏమీ లేదు. రోజూలానే పూజా పునస్కారాలు చేసుకుని, కాలక్షేపం చేశాను.

చాలా ఏళ్ల తర్వాత ‘అర్జున్‌ రెడ్డి’లో మోడ్రన్‌ నానమ్మ పాత్రలో కనిపించడం ఆనాటి మీ అభిమానులకు ఓ ఆనందం. నేటి తరానికీ దగ్గరయ్యారు. ఇన్నేళ్లుగా ఎందుకు నటించలేదు?
సరిగ్గా గుర్తు లేదు కానీ 1983లోనో 84లోనో ఇండస్ట్రీ వదిలేశా. సినిమా ప్రపంచానికి దూరంగా మరో లోకంలోకి వెళ్లాను. అందుకని సినిమాలు చేయడం కష్టం అనిపించింది. చాలామంది అడిగినా ఫోకస్‌ పెట్టడం ఈజీ కాదనిపించింది. ఓపిక కూడా పోయింది. ఇలాంటి పరిస్థితిలో సందీప్‌ రెడ్డి, విజయ్‌ దేవరకొండ నన్ను చూడ్డానికి వచ్చేవాళ్లు. మాట్లాడేవాళ్లు. వెళ్లేవాళ్లు. ‘మా సినిమాలో నానమ్మగా చేయాలి’ అన్నారు. కథ బాగుంది. ఇద్దరూ ఉత్సాహంగా కనిపించారు. సరే అన్నా.

సినిమాలు సడెన్‌గా ఎందుకు మానేశారు?
ఎందుకంటే నాకు ఏం లేకుండా చేశారు. మా దాయాదులే చేశారు. మా పిన్నమ్మ వాళ్ల పిల్లలు.

అంత అవసరం వాళ్లకు ఏం ఉంది?
వాళ్లు చాలా గొప్పవాళ్లు. మేం సామాన్యులం అని. మేం గొప్పవాళ్లం అవ్వకూడదనేమో. వాళ్లు జమీందారీలు, మేం మామూలు వాళ్లం అని ఫీల్‌ అయ్యేవాళ్లు. సొంత అమ్మ చెల్లెలిగారి పిల్లలు.

మీకు అవకాశాలు రాకపోవడానికి వాళ్లెలా కారణం అయ్యారు?
మా పిన్నమ్మ కొడుకుతో ఇక్కడి (సినిమా ఇండస్ట్రీ) వాళ్లు టచ్‌లో ఉండేవాళ్లు. తను తప్పుదారి పట్టించడంతో అలా జరిగింది.

మీరు సైలెంట్‌గా ఉన్నారా?  
మాటలు వేరు.. చేతలు వేరుగా. చాలా మంది అడిగారు.. ఇదే ప్రశ్న. మేం ఏమీ చేయలేం అనేదాన్ని. అయినా 45 ఏళ్ల తర్వాత ‘అర్జున్‌ రెడ్డి’ లాంటి హిట్‌ సినిమా చేయగలిగానంటే అది ఆనందమే కదా. గతాన్ని తలచుకోవడం వేస్ట్‌. 

మరో లోకం అన్నారు. అంటే.. ఆధ్యాత్మిక బాట అనుకోవచ్చా? గ్లామర్‌ ప్రపంచంలో పాపులారిటీని చూశాక ఈ బాటలో వెళ్లడం అంత ఈజీ అంటారా?
చాలా కష్టం. అయితే ఆటోమేటిక్‌గా వచ్చేసింది. అది మనలో ముందే రాసి ఉంటుంది. రాయిని చూసినప్పుడు జస్ట్‌ రాయిలా కనిపిస్తుంది. శిల్పి ఏదైనా చెక్కితే అందులో దాగున్నది బయటికి వస్తుంది. అలాగే మనలో కూడా దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది బయటకు తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ దైవత్వాన్ని చూడటం అలవాటు చేసుకుంటే ఆధ్యాత్మిక బాటలో వెళ్లడం చాలా సులువు.

ఆధ్యాత్మిక బాట త్యాగాలను కోరుతుంది కదా?
ఆ త్యాగాలు చేయడానికి మనిషి సిద్ధమైపోతాడు. ఎందుకంటే నీ అంతట నువ్వు ఈ రూట్‌ని సెలెక్ట్‌ చేసుకోలేవు. దానంతట అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. వీళ్లైతే నాకు బావుంటారు అని పవర్‌ స్వయంగా సెలెక్ట్‌ చేసుకుంటుంది. వివేకానందుడిని సెలెక్ట్‌ చేసుకున్నట్టు. రామకృష్ణ పరమహంస నుంచి వివేకానంద వరకూ.. చాలామందిని ఎంచుకుంది. ఆది శంకర కూడా చిన్న వయసులోనే సన్యాసం పుచ్చుకుంటాను అన్నాడు. వెళ్లిపోయాడు. అది విధి.

భక్తి చిన్నప్పుడే మీకు అలవడిందా?
అలవాటు కాదు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇది మన ఇళ్లల్లో ఆచారం. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం పూజలు ముగించాకే మిగతా పనుల్లోకి వెళ్తాం కదా. ఆ అలవాటు జీవితాంతం కొనసాగుతుంది. కొందరు పాటించకపోవచ్చు. ఒక రాయికి దండం పెట్టుకుంటే అదే చిన్న గుడిలా అనిపిస్తుంది. నీ మనసు లగ్నం చేసి చూస్తే ప్రతి దాంట్లోకి పవర్‌ వస్తుంది. ఆ పవర్‌ నీకు సహాయం చేస్తుంది. నాకు సహాయంగానే ఉంది.

ఇక్కడ ‘పవర్‌’ అంటే దేవుడు. మరి ఆ పవర్‌ మీ తల్లిదండ్రుల విషయంలో మిమ్మల్ని తక్కువగా చూడటం జరిగింది కదా. ఆస్తి విషయంలో మీ కన్నవాళ్లే మిమ్మల్ని మోసం చేశారు?
వాళ్ల కోసమే నా సుఖ సౌఖ్యాలు త్యాగం చేసుకున్నాను. మామూలుగా పిల్లల కోసం పెద్ద వాళ్లు బతకడం చూస్తుంటాం. కానీ నాలాంటివాళ్లు తల్లిదండ్రుల కోసం ఉంటారు. నేను అమ్మవారిని ఎక్కువగా పూజిస్తాను. ఆ మర్నాడు గోకులాష్టమి. నాకు నరసింహస్వామి కనిపించాడు. భూగర్భం నుంచి నల్లటి మబ్బుల వరకూ మొత్తం ఆయనే నిండిపోయినట్లుగా అనిపించింది. ‘నీకు నేను ఉన్నాను’ అని అభయం దొరికిందనడానికి ఆ దృశ్యం నిదర్శనం. ఆ దృశ్యంలో ‘నువ్వు ప్రహ్లాదుడివి.. నేను నరసింహ స్వామిని’ అన్నాడు. అంతేగా.. ప్రహ్లాదుడి పట్ల తండ్రి నిర్దయగా ఉంటే నరసింహ స్వామి రక్షణగా ఉన్నాడు కదా. నాకు ఆ దేవుడు సహాయంగా ఉన్నాడు. అందుకే మా ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా ఆ ప్రభావం నా వృత్తి మీద పడలేదు.  ఆస్తుల విషయాల్లో తలమునకలై ఉండేవాళ్లు.  ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎలా డైలాగ్‌ చెప్పగలుగుతున్నావు? ఎలా నటించగలుగుతున్నావు? అని షూటింగ్‌ లొకేషన్లో అడిగేవాళ్లు. ‘ఎక్కడి గడి అక్కడే వదిలేయాలి’ అనేదాన్ని.  

అప్పట్లో మీ పర్సనల్‌ లైఫ్‌లో మీరు ఎదుర్కొన్న సమస్యలు అందరికీ తెలుసా?
వాణిశ్రీ, నేను చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ప్రాబ్లమ్స్‌ షేర్‌ చేసుకునేవాళ్లం. తనకేదైనా సమస్య అంటే నేను తోడుగా.. నాకేదైనా అంటే తను తోడుగా ఉండేది.

ఈ ప్రపంచంలో మనకు హాని చేయని వ్యక్తులు, మన గురించి నిస్వార్థంగా ఆలోచించే వ్యక్తులు అమ్మానాన్న మాత్రమే అని నమ్మకం. మీ జీవితంలో ఆ నమ్మకం లేకపోవడం బాధాకరం.
భగవంతుడు ఎంత బాగా చూసుకుంటున్నాడు? ఈ వయసులో నేను నీతో ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నానో గమనించావా? నాన్‌స్టాప్‌గా మాట్లాడుతున్నాను. నా గొంతులో బలం తగ్గినట్లు అనిపించిందా? నాకు కాన్ఫిడెన్స్‌ లేనట్లు నీకు అనిపించిందా? అప్పట్లో నాతో కలసి నటించిన నా తోటి నటీనటులు చాలామంది ఇప్పుడు లేరు. రామారావుగారు వెళ్లిపోయారు. నాగేశ్వరరావుగారు వెళ్లిపోయారు. భగవంతుడు నన్నింకా ఇక్కడే ఉంచాడు.. ఆయనకు సేవ చేసుకోవడానికి. నేనెంతో ఇష్టపడే దేవుడికి రోజూ సేవ చేసుకోగలుగుతున్నా. దేవుడికి మించిన అండ ఏం ఉంటుంది?

ఏం జరిగినా దేవుడు ఉన్నాడనే నమ్మకంతో వెళుతున్నారు. కానీ జీవితంలో కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఓ జీవిత భాగస్వామి ఉండాలంటారు. మీకు అనిపించలేదా?
అనిపించింది. అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ బంధం ఒక బెడద కింద అవుతుందని కూడా అనిపించింది. ఆ రోజుల్లో చాలామంది చచ్చీ చెడీ కలిసి ఉండేవారు. తర్వాత తరానికి వచ్చేసరికి ‘లివ్‌ అండ్‌ లిట్‌ లెవ్‌’ అంటున్నారు. మనం ఆనందంగా ఉండాలి.. ఆనందంగా ఉండనివ్వాలి. అది ఫర్వాలేదు. అయితే మనం ఇబ్బంది పడి, వాళ్లను ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే.. అప్పుడు జీవితం బాగుంటుందా? ‘ఛీ ఇంతేనా?’ అనిపిస్తుంది కదా. ఈ ఆలోచనలే నాకు పెళ్లి మీద మనసు లేకుండా చేశాయి.

ప్రస్తుతం డివైనిటీ (దైవత్వం) విషయంలో విదేశీయులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. వాళ్లు భగవద్గీత చదువుతున్నారు. మనకు సంబంధించిన కళలను చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. వాళ్లకు తెలిసినంతగా మనవాళ్లకు తెలుసా? అని నా అభిప్రాయం. జనరల్‌గా మన ఆచారాలంటే ఉదయాన్నే నిద్ర లేవడం, కళలు (డ్యాన్స్‌లాంటివి) నేర్చుకోవడం... అలా ఉంటుంది. కానీ అవన్నీ మన కంటే వాళ్లు ఎక్కువగా పాటిస్తున్నారు.

మరి.. మీ అమ్మానాన్నగారు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయలేదా?
వాళ్లు ఎప్పుడూ ఆస్తిపాస్తుల గోలలో ఉండేవాళ్లు. ఇక ఈ విషయం గురించి పట్టించుకునే తీరిక ఎక్కడ ఉంటుంది?

కో–స్టార్స్‌లో మీకు ఆప్తులు ఉన్నారని చెప్పారు. వాళ్లెవరూ మీకు సలహా ఇవ్వలేదా?
ఇచ్చేవాళ్లు. అయితే భగవంతుడికి ముందే తెలుసు. నాది ఆధ్యాత్మిక బాట అని. అందుకే అలా జీవిత భాగస్వామి లేకుండా మిగిల్చాడేమో. ‘భక్త తుకారం’ (1973) సినిమా చేసినప్పుడు నేను భక్తి మార్గంలో నడవడానికి ఆ సినిమా నాంది అవుతుందని ఊహించలేదు. కానీ ఆ సినిమా నాంది అయింది. ‘ఏమండీ మీ బతుకు భక్త తుకారాం అయిపోయింది’ అనేవాళ్లు.


ఈ జన్మలో దక్కనిది వచ్చే జన్మలో అయినా దక్కాలనుకుంటాం. మళ్లీ జన్మంటూ ఉంటే మంచి తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారా?
లేదు. నేను స్వామితోనే ఉండాలనుకుంటున్నాను. ఇంకో జన్మ అక్కర్లేదు. పూర్తిగా అన్నీ చేసేసి వెళ్లిపోతాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఈ జన్మ తాలూకు కర్మని పూర్తి చేస్తాను. అలా చేసే బలాన్ని, హెల్త్‌ని భగవంతుడు నాకు ఇచ్చాడనుకుంటున్నాను.  

ఎయిర్‌ హోస్టెస్‌ నుంచి హీరోయిన్‌ అయ్యారు. హీరోయిన్‌గా ఫస్ట్‌ సినిమా ‘కాదలిక్క నేరమిల్లై’ (1964–తమిళ్‌) సూపర్‌ డూపర్‌ హిట్‌. ఆ అవకాశం గురించి?
డైరెక్టర్‌ సీవీ శ్రీధర్‌ ఫ్లైట్‌లో ప్రయాణించినప్పుడు నన్ను చూశారు. అప్పుడు ఆయన ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమా ప్లాన్‌ చేస్తున్నారు. హీరోయిన్‌గా నన్ను అడిగితే చేశాను. నా అసలు పేరు వసుంధరా దేవి. అప్పటికే ఆ పేరుతో ఓ నటి (ప్రముఖ నటి వైజయంతి మాల తల్లి వసుంధరా దేవి) ఉండటంతో నా పేరుని కాంచనగా మార్చారు. ఫస్ట్‌ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండాపోయింది.

ఇంకో జన్మ ఉండటం, ఉండకపోవడం అనేది దేవుడి లీల అంటారు. మరో జన్మ ఉండకపోవడానికి మానవులు ఏదైనా చేసే ఆస్కారం ఉందా?
ఏమీ చేయక్ల్కర్లేదు. భగవంతుడికి మనల్ని మనం పూర్తిగా అర్పించుకోవడమే. ఎవ్వరికీ అర్పించుకోవద్దు. చేసేవాళ్లు చేస్తుంటారు, పెట్టేవాళ్లు పెడుతుంటారు. మనకు రావల్సింది మనకు వస్తుంది. చెబితే తెలుసుకునేది కాదు. అనుభవించాల్సిందే.

హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ‘మసక మసక చీకటిలో’ వంటి సాంగ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి ఐటమ్‌ సాంగ్స్‌ అవుతాయని ఊహించారా?
లేదు. వాస్తవానికి ఆ పాట కథలో భాగంగా ఉంటుంది. కావాలని అతికించిన పాటలా ఉండదు. ఒక ఆర్గనైజేషన్‌ (సినిమా) కోసం మనం వర్క్‌ చేస్తున్నప్పుడు సక్సెస్‌ కోసమే పని చేస్తాం. వర్క్‌ ఈజ్‌ గాడ్‌. ఎంటర్‌ అయ్యాక వచ్చింది చేయాలి. అలా అనుకునే ఆ పాట చేశాను.

తమిళ అమ్మాయి అయినా తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు?
పుట్టింది తమిళనాడులో. సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో. మా కుటుంబం ఆంధ్ర ప్రదేశ్‌లో. మూలం తెలుగు. అయినా నన్ను కాచుకున్నది తమిళనాడు. మీనాక్షి అమ్మవారంటే ఇష్టం. నేను ఎయిర్‌ హోస్టెస్‌గా ఉన్నప్పుడు ఫ్లైట్‌లో రష్‌ తక్కువ ఉన్నప్పుడు గోపురాలు ఏవైనా వస్తే, మా æపైలట్స్‌ పిలిచేవాళ్లు. ఎంత వీలుంటే అంత దగ్గరిగా చూసేవాళ్లం. నాలో భక్తి పెరగడానికి అది కూడా ఓ కారణం ఏమో?

విగ్రహారాధన గురించి చెబుతారా?
మానవుడికి ఓ రూపం ఉంది కాబట్టి, దేవుడికి రూపం ఇచ్చి, పూజలు చేస్తున్నారు. విగ్రహారాధన సులువు అని. కానీ స్వామి పేరు చెప్పకుండా, ఎదుట విగ్రహం లేకుండా ‘అయ్యా.. అమ్మా’ అని పూజ చేసుకున్నా ఫర్వాలేదు. వాళ్లు కూడా దేవుళ్లే.

తల్లిదండ్రులను సవాల్‌ చేసి, కోర్టుకి వెళ్లి మీ ఆస్తి దక్కించుకుని, మొత్తం దేవాలయానికి రాసేశారు. ఎందుకలా?
అది మా చెల్లెలికి రావాల్సిన ఆస్తి. తిరుపతికి రాసేయాలని తను అనుకుంది. అనుకున్నట్లే చేశాం. జీవితంలో ఎత్తు పల్లాలు ఎన్నో చూశా. అన్నీ ఉండి లేనిదాన్ని అనిపించుకున్నా. 1983లో దాయాదులు అస్తి లేకుండా చేశారు. అయినా దైవ కృప, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ నిలదొక్కుకున్నా. చెన్నైలో కలియుగ దైవం వేంకటేశ్వరుడికి రూ. 80 కోట్ల విలువ చేసే స్థలం ఇవ్వటం ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా. నా మదిలో ఎప్పుడూ  వేంకటేశ్వరున్ని ధ్యానిస్తూనే ఉంటాను.

ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? మీరు దయనీయ స్థితిలో ఉన్నారన్నది చాలామంది ఊహ...
నన్ను మా చెల్లెలు, మరిదిగారు బాగా చూసుకుంటున్నారు. ఒక మనిషికి డబ్బు, హోదా అన్నింటికంటే చూసుకోవడానికి మనుషులు ఉండటం పెద్ద అండ. మనతో పాటు నిలబడగలిగే వాళ్లు ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?  మా చెల్లెలు, మరిది వాళ్లంతా నాకు అండగా ఉన్నారు. చాలామంది ఊహించుకుంటున్నట్లు దయనీయ స్థితిలో లేను. చాలా బాగున్నాను.

ఫైనల్లీ ప్రస్తుతం మీ జీవన శైలి ఎలా ఉంది?
ఉదయాన్నే మూడున్నరకు మెలుకొవ వస్తుంది. పనులేం చేయను. పుస్తకాలు చదువుకుంటూ ఉంటాను. ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. భగవంతుడి ధ్యానంలోనే ఉంటాను.

– డి.జి. భవాని

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా