'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

26 Jul, 2019 12:50 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ

సాక్షి, బీచ్‌రోడ్డు(విశాఖపట్నం) : ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌ డియర్‌ కామ్రేడ్‌ సినిమాను చూసి మెచ్చుకున్నారని ఆ చిత్ర హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆయన సినిమా చూసిన విధానం నచ్చిందని, నాతో పాటు హీరోయిన్, దర్శకుడు, ఇతర నటీనటులను అభినందిస్తూ.. తనతో సినిమా చేయాలని కోరారని చెప్పారు. ఆయన అలా అడగడంతో చాలా గర్వంగా ఫీలయ్యానని తెలిపారు. డియర్‌ కామ్రేడ్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నగరానికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. 

డియర్‌ కామ్రేడ్‌ అలరిస్తుంది
డియర్‌ కామ్రేడ్‌ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది. మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడమే నా లక్ష్యం. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేసి అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనుంది. 

దక్షిణాది ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం 
మొదట డియర్‌ కామ్రేడ్‌ను తెలుగులోనే అనుకున్నాం. దక్షిణాదికి సంబంధించిన వారు ఈ చిత్రంలో నటించారు. పనిచేశారు. అందువలన ఈ సినిమాను దక్షిణ  భాషల్లో చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆ విషయం నిర్మాతలకు చెప్పగానే.. ఒప్పుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ మరువలేను.  ఇప్పటి వరకు పది నగరాల్లో సినిమా ప్రమోషన్లు నిర్వహించాం. చివరిగా వైజాగ్‌లో డియర్‌ కామ్రేడ్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటి. వైజాగ్‌ అనే ఫీల్‌ భలేగా ఉంటుంది. 

మైత్రీ మూవీస్‌తో మరో సినిమా
డియర్‌ కామ్రేడ్‌ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్‌తో నాకు మంచి బంధం ఏర్పడింది. త్వరలోనే వారితో మరో సినిమా చేయనున్నాను. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నా.  

100 కోట్ల క్లబ్‌లో చేరడం చాలా హ్యాపీ
గీత గోవిందం చిత్రం ప్రేక్షకులను అలరించిన తీరు మాటల్లో చెప్పలేను. ఆ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరడం చాలా సంతోషంగా ఉంది. అయినా నాకు కలెక్షన్ల పై పెద్దగా ఆసక్తి లేదు. నేను చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయా లేదా అనేదే ముఖ్యం. 

సరైన సమయంలో విడుదల
మూడేళ్ల కిందట డైరెక్టర్‌ భరత్‌ నాకు డియర్‌ కామ్రేడ్‌ కథ చెప్పారు. అయితే అప్పటికే కొన్ని సినిమాలు ఒప్పుకోవడంతో ఈ కథ చేయడానికి కొంత సమయం పట్టింది. ఏడాది పాటు ఈ సినిమా షూటింగ్‌ చేశాం. అవుట్‌ పుట్‌ చాలా బాగా వచ్చింది. సరైన సమయంలో సినిమా విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది.  

మరిన్ని వార్తలు