ఆ సినిమాలు చెడగొడుతున్నాయి

8 May, 2019 01:01 IST|Sakshi

సహాయ నటుడిగా కెరీర్‌ మొదలు పెట్టి, విలన్‌గా, హీరోగా రాణిస్తున్న అజయ్‌ నటించిన తాజా చిత్రం ‘స్పెషల్‌’. వాస్తవ్‌ దర్శకత్వంలో నందలాల్‌ క్రియేషన్స్‌ పతాకంపై నందం శ్రీవాస్తవ్‌ నిర్మించిన ఈ సినిమాని జూన్‌ 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో వాస్తవ్‌ మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. తెలుగులో ఈ జోనర్‌ చాలా అరుదు. తమిళంలో రెగ్యులర్‌గా వస్తున్నాయి. టేకింగ్‌ పరంగా ‘గజిని, పిజ్జా, సెవెన్త్‌ సెన్స్, కాంచన, అపరిచితుడు, హాలీవుడ్‌లో వచ్చిన సిక్త్స్‌ సెన్స్, అన్‌ బ్రేకబుల్, సైకో’ వంటి సినిమాలను తలపించేలా మా మూవీ ఉంటుంది. ఇది మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకోవచ్చు. భారతదేశం మొత్తం బాధపడుతున్న ఓ విషయాన్ని చూపించబోతున్నాం.

చిన్నసినిమా బూతు సినిమాలకు కేరాఫ్‌గా మారింది. ఈ సినిమాలు యూత్‌ని చెడగొడుతున్నాయి. వీటికి నాంది ‘అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలే. ఈ సినిమాల వల్ల నెలకు ఒకటి చొప్పున ఈ తరహావి వస్తున్నాయి. దాసరి నారాయణరావుగారి తర్వాత తెలుగు మోడ్రన్‌ సినిమాకు గురువు అనిపించుకోవాల్సిన రామ్‌గోపాల్‌ వర్మగారు ‘జీఎస్టీ’ లాంటి బూతు సినిమాలు తీస్తున్నాడు. సామాజిక బాధ్యత ఉన్న తెలుగు సినిమాలు తీసిన ఏకైక దర్శకుడు కృష్ణవంశీగారు, హీరో చిరంజీవిగారు’’ అన్నారు. ‘‘క్షణం, గూఢచారి’ సినిమాలకు నాలుగు రెట్లు ఎక్కువగా ‘స్పెషల్‌’ ఉంటుంది. ప్రతి జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు బయ్యర్లు మా సినిమాని అడుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల చేసే అవకాశం ఇచ్చిన వాస్తవ్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని బాపిరాజు అన్నారు. రంగ, అక్షత, సంతోష, అశోక్‌ కుమార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎన్వీఎస్‌ మణ్యం, కెమెరా: బి. అమర్‌ కుమార్‌. 

మరిన్ని వార్తలు