వెండి తెరపై మండే భాస్వరం

18 Jan, 2020 02:38 IST|Sakshi

యంగ్‌ బాలీవుడ్‌ –11 / స్వర భాస్కర్‌

నటన, చదువు, సామాజిక బాధ్యత ఉన్న నటీమణుల పరంపర హిందీలో ఉంది. షబానా ఆజ్మీ, స్మితాపాటిల్, దీప్తీ నావెల్‌లది ముందు తరం. నందితాదాస్‌ది తర్వాతి తరం. స్వరభాస్కర్, రాధిక ఆప్టే తదితరులది నేటితరం. సినిమా రంగంలో ఉన్నవారు ప్రజల సమస్యలకు గట్టిగా ప్రతిస్పందించాలి అంటుంది స్వర భాస్కర్‌. తెర మీదగానీ నిజ జీవితంలోగాని ఆమె ‘సాధారణ బుర్ర’లకు ఇస్తున్న షాకులు చాలానే ఉన్నాయి.

సంజయ్‌ లీలా బన్సాలీ అంటే హిందీలో చాలాపెద్ద పేరు. ఆయన తీసిన ‘పద్మావత్‌’ చాలా కారణాల రీత్యా వార్తల్లోకి ఎక్కింది. ఆ సినిమా చూశాక స్వర భాస్కర్‌ ఆయనకు ఒక బహిరంగ లేఖ రాసింది. ‘డైరెక్టర్‌గారూ... సినిమా అంతా చూశాక నేనంతా కలిíపి ఒక యోనికి కుదించబడ్డాను అన్న భావన  కలిగింది’ అని అందులో రాసింది.స్త్రీ ఉనికి అంతా ఆమె లైంగికతే అన్న భావనలో సంజయ్‌ లీలా బన్సాలీ పద్మావత్‌ పాత్రను (దీపికా పడుకోన్‌) తీర్చిదిద్దాడని స్వర భాస్కర్‌ ఆరోపణ. ఈ ఉత్తరం దుమారం రేపింది. 2018లో ‘వీరి ది వెడ్డింగ్‌’ సినిమా వచ్చింది. అందులో స్వర భాస్కర్‌ భర్త విదేశాలలో ఉండగా ఒంటరిగా జీవించే భార్యగా నటించింది. భర్తతో ఆమెకు విధేదాలు ఉంటాయి. అలాగని భర్తను చీట్‌ చేయలేదు. ఒంటరి జీవితంలోని ఫ్రస్ట్రేషన్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె తనను తాను తృప్తి పరుచుకునేందుకు సిద్ధపడుతుంది. ఆ సన్నివేశం తెర మీద ఇన్‌హిబిషన్స్‌  లేకుండా చేసింది.

భారతీయ సినిమాలలో ఈ సన్నివేశంలో నటించిన మొదటి నటి ఆమె. దీని మీద భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు సంప్రదాయవాదులు గుర్రుమన్నారు. కాని స్వర పట్టించుకోలేదు. స్త్రీల గురించి, మనుషుల నిజ ప్రవర్తనను ప్రభావితం చేసే సంఘటనల గురించి తెలియనివారే ఇటువంటి కామెంట్లు చేస్తారు అని కొట్టి పారేసింది. ఇటీవల ‘సిఏఏ’ చట్టం కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. దీని మీద విద్యార్థులు గట్టి అభ్యంతరాలు చెప్పారు. దేశంలో చాలా నగరాల్లో నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. ముంబై ఆజాద్‌ మైదాన్‌లో భారీ సభ జరిగితే అందరి కంటే ముందు స్వర భాస్కర్‌ హాజరయ్యింది. ‘భారత రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడం ప్రతి నిజ భారతీయుడి విధి. మనందరం కలిసికట్టుగా దీనిని ఎదిరిద్దాం. ఆవాజ్‌దో హమ్‌ ఏక్‌ హై’ అని ఆ సభలో నినదించింది. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ముసుగులు ధరించిన దుండగలు విద్యార్థులపై దాడికి తెగబడుతున్నారన్న వార్త వినగానే అంతరాత్రిపూట వారి సహాయం కోసం వీడియో రిలీజ్‌ చేసిందామె.

బాలీవుడ్‌లో ఇప్పుడు చెరపలేని పేరుగా మారిన స్వరభాస్కర్‌ తండ్రి తెలుగువాడు అన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన పేరు చిత్రపు ఉదయభాస్కర్‌. కోరుకొండ స్కూల్‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్రభావంతో మిలట్రీలోకి వెళ్లాడు. నేవీలో పని చేశాడు. రిటైర్‌ అయ్యాక కూడా ఆయనకున్న విశేష అనుభవం రీత్యా రక్షణ రంగ నిపుణుడుగా పని చేస్తున్నాడు. స్వరభాస్కర్‌ తల్లి ఇరా భాస్కర్‌ బిహారీ. ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో సినిమా శాస్త్రాన్ని బోధించే ప్రొఫెసర్‌ ఆమె. వీరి సంతానమైన స్వర ముందు నుంచి చురుకు. జె.ఎన్‌.యులో చదువుకుంటున్నప్పుడు ఒక గట్టి గొంతు. స్వర భాస్కర్‌ జె.ఎన్‌.యులో చదువుకున్న చాలామందికి మల్లే వామపక్ష భావజాలంతో ప్రభావితమైన విద్యార్థి. కవిత్వం పట్ల మక్కువ ఉంది. తను స్వయంగా రాస్తుంది. సాహిత్యం పట్ల అనురక్తి ఉంది. నటన పట్ల కుతూహలం ఉంది. జె.ఎన్‌.యులో ఉండగా ఆమెకు నటన పట్ల ఆసక్తి కలిగింది. ఎన్‌.కె.శర్మ యాక్ట్‌ ఒన్‌ అనే థియేటర్‌ గ్రూప్‌ ఢిల్లీలో ఎక్కువమందికి తెలుసు.

కొన్నాళ్లు ఆ గ్రూప్‌తో కలిసి పని చేసింది స్వర భాస్కర్‌. నాటకాలు వేసింది. అయితే ఆమెకు సినిమాలలో పని చేయాలని ఉండేది. 2008లో ముంబై చేరుకుందామె. బాలీవుడ్‌లో అడుగుపెట్టాక స్వర భాస్కర్‌ను మొదట ప్రేక్షకులు గుర్తించింది ‘లిజన్‌ అమాయా’ అనే సినిమాతో. దీప్తి నావెల్‌ తల్లిగా స్వర భాస్కర్‌ కూతురుగా ఆ సినిమాలో నటించారు. దీప్తి నావెల్‌కు భర్త చనిపోయి ఉంటాడు. పాత కాలపు మిత్రుడు ఆమె పట్ల ఆదరంగా ఉంటాడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కాని కూతురు స్థానంలో ఉన్న స్వర భాస్కర్‌ ఆ పెళ్లిని అంగీకరించదు. తన తల్లి కేవలం శారీరక సుఖం కోసమే ఈ పని చేయాలనుకుంటోంది అనే భావనలో ఆ టీనేజ్‌ అమ్మాయి సతమతమవుతుంది. కాని పెళ్లి అనేది కేవలం భౌతిక సుఖం కోసం కాదని జీవన సహచర్యం కోసం కూడా అని ఆమెకు మెల్లగా తెలిసి వస్తుంది. ధునుష్‌ హిందీలో తొలిసారిగా నటించిన ‘రాంఝనా’, అర్జున్‌ కపూర్‌ ‘ఔరంగజేబ్‌’, సల్మాన్‌ ఖాన్‌ ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో’ సినిమాలు ఆమెకు మంచి పాత్రలు ఇచ్చాయి.

కాని ఆమెను ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది మాత్రం ‘తను వెడ్స్‌ మను’ పార్ట్‌ 1, పార్ట్‌ 2 చిత్రాలు. తను వెడ్స్‌ మనులో భర్తకు తెలియకుండా తప్పు చేసి ఆ గిల్ట్‌తో నలిగిపోయే పాత్రలో ఆమె ఆకట్టుకుంది. దాంతో లీడ్‌ రోల్‌ చేసే విధంగా రెండు మంచి అవకాశాలు ఆమెకు వచ్చాయి. ఆ సినిమాలే ‘నీల్‌ బత్తి సన్నాట’, ‘అనార్కలీ ఆఫ్‌ ఆరా’. ఒక చేయగలిగిన నటికి చేయగలిగిన పాత్రలు వస్తే ఆమె ఎలా చెలరేగగలదో ఈ సినిమాలు నిరూపిస్తాయి. ‘నీల్‌ బత్తి సన్నాటా’లో స్వరభాస్కర్‌ ఒక సింగిల్‌ మదర్‌. పదో క్లాస్‌కు వచ్చిన కూతురు ఉంటుంది. ఆ కూతురు బాగా చదువుకోవాలని ఆ తల్లి కోరిక. లెక్కలు రాని కూతురు మాత్రం చదువు ఆపేసి తల్లిలానే పని మనిషిగా కుదురుకుంటే చాలు అనుకుంటూ ఉంటుంది. కాని తల్లి మాత్రం కూతురు కోసం తపన పడుతుంది. కూతురిలో రోషం తెప్పించాలని తానూ విద్యార్థిగా మారి కూతురి క్లాస్‌లో చేరుతుంది. తాను లెక్కలు నేర్చుకుని కూతురికి నేర్పాలని తపన పడుతుంది. కాని కూతురు ఆమెను తప్పుగా అర్థం చేసుకుంటుంది.

కాని చివరకు తల్లి ఆశయానికి అనుగుణంగా బాగా చదువుకుని ఐ.ఏ.ఎస్‌ ఆఫీసర్‌ అవుతుంది. ఈ సినిమాలో స్వరభాస్కర్‌ అనుక్షణం తన ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రిలీజయ్యాక ఆమె ఎన్నో ప్రశంసలు దక్కాయి. కాని అంతకంటే ముఖ్యమైన సినిమా ‘అనార్కలీ ఆఫ్‌ ఆరా’. బిహార్‌లో ‘డబుల్‌ మీనింగ్‌’ పాటలను స్టేజ్‌ మీద పాడుతూ నర్తింటే లోకల్‌ ఫిమేల్‌ పాప్‌ సింగర్ల సమూహం ఒకటి ఉంది. ‘ఆరా’ అనే ఊరిలో అలాంటి గాయని అనార్కలీ. ఆమె స్టేజ్‌ మీద బూతు పాటలు పాడుతుంది కనుక మనిషి కూడా బూతై ఉంటుందని తప్పుడు అంచనా వేస్తాడు ఆ ఊరి పెద్దమనిషి ఒకడు. లొంగ దీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆమె లొంగదు.

జీవిక కోసం ఎన్ని పనులు చేసినా ఆత్మాభిమానం ఉన్న స్త్రీ బలవంతులకు లొంగదు అని అనార్కలీ తన పాత్ర ద్వారా చెబుతుంది. ఈ సినిమాలో బిహారీ భాషలో డైలాగ్స్‌ చెప్పడానికి, బూతు గాయనిగా హావభావాలు పలికించడానికి, ఉన్మత్తత ప్రదర్శించడానికి స్వరభాస్కర్‌ ఏ మాత్రం సంకోచించలేదు.ఆ పాత్ర ఆమెకు చాలా పేరు తెచ్చింది. స్వరభాస్కర్‌ ఇప్పుడు ‘షీర్‌కుర్మా’ అనే సినిమాలో నటిస్తోంది. ‘షీర్‌కుర్మా’ అంటే సేమ్యా పాయసం అని అర్థం. ఇందులో ముస్లిం మొహల్లాలో ఉండే ఇద్దరు స్త్రీల మధ్య సాన్నిహిత్యాన్ని స్వర తన పాత్ర ద్వారా చూపించనుంది. కల్పిత, కల్మష ప్రవర్తన తెర మీద, తెర బయట అక్కర్లేదంటుంది స్వరభాస్కర్‌. నిజాయితీ ముఖ్యం అంటుందామె. సత్యాన్ని సత్యంగా చూపించడానికి, చెప్పడానికి సంకోచించాల్సిన పని లేదంటుంది ఆమె. బాలీవుడ్‌లో ఎందరో హీరోయిన్లు, కేరెక్టర్‌ ఆర్టిస్టులు స్త్రీలలో ఉన్నారు. వారు మన దారిలో తారసపడినా పడకపోయినా స్వరభాస్కర్‌ తప్పక తారసపడుతూనే ఉంటుంది– చాలా కారణాలకు. ఇది మాత్రం తప్పదు.
– సాక్షి ఫ్యామిలీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా