మరో రెండేళ్ల తర్వాత పెళ్లి ప్లాన్స్‌.. !

25 Nov, 2018 00:35 IST|Sakshi

ఐదు రోజుల ముందే బర్త్‌డే (నవంబర్, 30) విషెస్‌ చెప్పేస్తున్నాం.. ఇంతకీ బర్త్‌డే ప్లాన్స్‌ ఏంటి?
రాశీ ఖన్నా: ముందుగా విషెస్‌కి థ్యాంక్స్‌. బర్త్‌డేకి పెద్ద ప్లాన్‌ ఉంది. ఢిల్లీ, ముంబై, చెన్నై నుంచి ఫ్రెండ్స్‌ వస్తున్నారు. హైదరాబాద్‌లోనే పార్టీ కాబట్టి ఇక్కడి ఫ్రెండ్స్‌ ఎలాగూ వస్తారు. సూపర్‌ ఫన్‌గా ఉండబోతోంది. ‘థీమ్‌ పార్టీ’ ప్లాన్‌ చేçస్తున్నాను. అంతకుముందేమో రెడ్‌ అండ్‌ వైట్, గతేడాది గోల్డ్‌ అండ్‌ బ్లాక్‌ కాంబినేషన్‌. ఈసారి... ఇప్పుడే చెప్పను. సర్‌ప్రైజ్‌. ఏ కలర్‌ థీమ్‌ అనుకుంటే ఆ కలర్‌ డ్రెస్సులు వేసుకుంటాం. డెకరేషన్‌ అంతా కూడా ఆ కలర్‌ థీమ్‌లోనే ఉంటుంది.

ఢిల్లీ, ముంబై, చెన్నై... త్రీ స్టేట్స్‌లో ఫ్రెండ్స్‌ని కవర్‌ చేశారా?
(నవ్వేస్తూ).. ఢిల్లీ నేను పుట్టి, పెరిగిన ఊరు కాబట్టి అక్కడ చైల్డ్‌హుడ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. ముంబైలో మోడలింగ్‌ చేశాను. అందుకని అక్కడ కొత్త ఫ్రెండ్స్‌ అయ్యారు. తమిళ సినిమాలు చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా ఫ్రెండ్స్‌ ఉన్నారు. తెలుగు సినిమాలు చేస్తూ హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యాను కాబట్టి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. నేను పార్టీలకు దూరంగా ఉంటాను. సంవత్సరానికి నా అంతట నేను ఇచ్చే పార్టీ అంటే అది నా బర్త్‌డేకే. అందుకే వీలైనంత గ్రాండ్‌గానే పార్టీ చేసుకుంటాను.

చిన్నప్పటి బర్త్‌డేస్‌ గురించి?
మా పేరెంట్స్‌ గ్రాండ్‌గా చేసేవాళ్లు. స్కూల్లో స్వీట్స్‌ ఇవ్వడం, ఇంటి దగ్గర ఫ్రెండ్స్‌కి పార్టీ ఎరేంజ్‌ చేయడం.. అన్నీ మంచి జ్ఞాపకాలే. చిన్నప్పుడు అమ్మానాన్న అంత గ్రాండ్‌గా చేసేవాళ్లు కాబట్టే నాకు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ అంటే ఇంట్రస్ట్‌ పెరిగిందేమో.

హీరోయిన్‌గా ఇది మీకు ఐదో బర్త్‌డే అనుకుంటా. అంతకుముందు చిన్ని ప్రపంచం. ఇప్పుడు పెద్ద ప్రపంచం. ఫ్యాన్స్‌ కూడా సెలబ్రేట్‌ చేయడం ఎలా అనిపిస్తోంది?
జీవితంలో ఆనందపడటానికి చాలా విషయాలుంటాయి. వాటిలో ఫ్యాన్స్‌ ప్రేమ ఒకటి. కొందరు ఫ్యాన్స్‌ నా బొమ్మలు గీసి పంపిస్తుంటారు. జనరల్‌గా నాకు గ్రీటింగ్‌ కార్డ్స్‌ ఇష్టం. ఫ్యాన్స్‌ నాకోçసం బొమ్మలు గీసి ఇచ్చే ఆ గ్రీటింగ్‌ కార్డ్స్‌ని నేను పెద్ద బహుమతిలా భావిస్తాను. ఏం చేసినా వారి రుణం తీర్చుకోలేనిది.

హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ అయి నాలుగేళ్లయింది. అప్పటికీ ఇప్పటికీ మీ లైఫ్‌లో వచ్చిన మార్పేంటి?
నటిగా, మనిషిగా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. యాక్చువల్‌గా నేను ‘కామ్‌’ పర్సన్‌. ఇక్కడికొచ్చాక ఇంకా కామ్‌ పర్సన్‌ అయ్యాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. సక్సెస్, ఫెయిల్యూర్‌.. రెండూ చూస్తున్నాను. ఏదీ తలకి ఎక్కించుకోవడంలేదు. ఏది జరిగితే  అది జరిగిందిలే అని లైఫ్‌ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్నాను. ప్రతీ మూమెంట్‌ని సెలబ్రేట్‌ చేçస్తున్నాను. ప్రతీ ఫెస్టివల్‌ని సెలబ్రేట్‌ చేస్తాను. 

కార్తీక పౌర్ణమిలాంటివి కూడా చేస్తారా.. ఉపవాసం ఉంటారా?
మొన్న కార్తీక పౌర్ణమికి దీపాలు వెలిగించాను. ఈసారి ఉపవాసం చేయలేదు. అయితే మా ఇంట్లో వాళ్లు మాత్రం ఉపవాసం చేస్తుంటారు. యాక్చువల్లీ పండగలు చేసుకోవడం అంటే.. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడమే. ఆధ్యాత్మికతలో ఆహ్లాదం ఉంటుంది.

ఇంతకుముందు మాట్లాడుతూ జనరల్‌గా నేను ‘కామ్‌ పర్సన్‌’ని అన్నారు. ‘నాలాంటివాళ్లకు ఇండస్ట్రీ సూట్‌ అవుతుందా’ అని సినిమాల్లోకి వచ్చే ముందు ఏమైనా భయపడ్డారా?
ఆ భయం ఉండేది కాదు. మన పని మనం చేసుకుంటూ అనవసరంగా ఇతరుల జోలికి వెళ్లకుండా ఉంటే హ్యాపీగా ఉండగలుగుతాం అనుకున్నాను. బేసిక్‌గా నేను చాలా ప్రైవేట్‌ పర్సన్‌ని. చాలా సెక్యూర్డ్‌ పర్సన్‌ని. నా పనేదో నేను చూసుకుంటాను. పక్కనోళ్ళ జోలికి పోను. తర్వాత ఏం జరగబోతోంది అని ఆలోచించను. సినిమాలు చేయడం, వాటిని ప్రమోట్‌ చేయడం. ఇంటికెళ్లి హ్యాపీగా అమ్మానాన్నలతో గడపడం.. అంతే.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ‘మీటూ’ అంటూ చాలా మంది ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీకేమైనా చెప్పడానికి ఉన్నాయా?
చాలా ఏళ్లుగా ఫేస్‌ చేస్తున్న చేదు అనుభవాలను బయటకు వచ్చి నిర్భయంగా చెప్పగలగడం గ్రేట్‌. వాళ్ల ధైర్యం నిజంగా అభినందనీయం. ‘మీటూ’ అంటూ నాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ‘ఊహలు గుసగుసలాడె’ సినిమాతో ఇక్కడికి వచ్చాను. అప్పటినుంచి ఇప్పటివరకూ అన్నీ మంచి అనుభవాలే. ‘టాలీవుడ్‌ ఈజ్‌ వన్నాఫ్‌ ది బెస్ట్‌ ఇండస్ట్రీస్‌’. ఇక్కడ చాలా గౌరవిస్తారు. 

ఇండస్ట్రీకి వచ్చాక ఇంకా కామ్‌గా అయ్యానన్నారు. ఏం చేస్తే అలా అవ్వడానికి కుదురుతుంది?
మెడిటేషన్‌. రోజూ ఓ పదిహేను నిమిషాలైనా ధ్యానం చేయాల్సిందే. ధ్యానం అంటే కళ్లు మూసుకోవడం అని చాలామంది అనుకుంటారు. అయితే పరిసర ప్రాంతాలను మరచిపోయి, ఎలాంటి ఆలోచనలు లేకుండా కాసేపు ఉండటమే ధ్యానం. ప్రాక్టీస్‌ మీద అది కుదురుతుంది. ఆల్రెడీ నేను చాలా కామ్‌. ధ్యానం నన్నింకా కామ్‌ పర్సన్‌ని చేసింది.

తొలి ప్రేమ, శ్రీనివాస కల్యాణం చిత్రాల్లో చాలా స్లిమ్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపించారు. మెంటల్‌ పీస్‌ కోసం ధ్యానం. మరి.. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం?
నిజం చెప్పాలంటే నేనసలు డైటింగ్‌ చేయను. నచ్చింది తింటా. చాక్లెట్స్, పరాటా.. అన్నీ తింటాను.  వారంలో ఆరు రోజులు కనీసం గంట అయినా జిమ్‌లో గడుపుతాను. ఇంటి దగ్గర చేసిన వంటను ఎక్కువగా ఇష్టపడతాను. డైట్‌ అని తినకపోతే అది మన ముఖంలో ప్రతిబింబిస్తుంది. ఫ్రెష్‌గా కనిపించం. నచ్చినవి తినడం, ఎక్స్‌ట్రా కేలరీస్‌ని జిమ్‌లో కరిగించడం (నవ్వేస్తూ).

హిట్, ఫ్లాప్‌.. ఈ రెండు రిజల్ట్స్‌తో మీ ట్రావెల్‌ ఎన్ని రోజులు ఉంటుంది.. నటిగా అభద్రతాభావం ఏమైనా?
యాక్చువల్లీ ఏ రిజల్ట్‌తోనూ నేను ఎక్కువ సేపు ట్రావెల్‌ చేయలేను. దాన్నుంచి ఈజీగా మూవ్‌ ఆన్‌ అయిపోతాను. ఇక ఇన్‌సెక్యూరిటీ అంటారా? అస్సలు లేదు. నిన్ను నువ్వు నమ్మితే ఎటువంటి అభద్రతాభావానికి లోను కావనేది నా ఫిలాసఫి. అంతా నమ్మకమే. నమ్మకం ఉంటే ఏదీ మనల్ని భయపెట్టదు.

రీసెంట్‌గా తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. నాలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ‘అడంగామారు’ సినిమా చేయడం గురించి?
నేను చేసిన ఫస్ట్‌ తమిళ సినిమా ‘ఇమైక్క నొడిగళ్‌’ చిత్రం ఆగస్ట్‌లో రిలీజైంది. అందులో స్పెషల్‌ రోల్‌ అయినప్పటికీ మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ‘జయం’ రవితో ‘అడంగామారు’ (తెలుగులో ‘సుభాష్‌’) చేస్తున్నాను. నాలుగు భాషల్లో ఈ సినిమా చేయడం నటిగా ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఇది కాకుండా  విశాల్‌తో ‘అయోగ్య’ చేస్తున్నాను. ఇది ‘టెంపర్‌’ సినిమాకి రీమేక్‌. తెలుగు ‘టెంపర్‌’ చూశాను. ఆ సినిమా పాయింట్‌ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా క్లైమాక్స్‌. 

సాధారణంగా మీ రోజు ఎలా మొదలవుతుంది?
నిద్రపోయే ముందు.. ఉదయం లేచాక దేవుణ్ణి ప్రార్థిస్తాను. అలా చేయడం వల్ల మనలో పాజిటివ్‌ వైబ్స్‌ స్టార్ట్‌ అవుతాయని నా నమ్మకం. 

మీకేదైనా కష్టం వస్తే ఎవరి మీద ఆధారపడతారు? దేవుడు, అమ్మ, నాన్న?
దేవుడు.

మీ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది?
దేవుడా... నాకు ఇది కావాలి.. అది కావాలి అన్నట్టుగా ఏం పూజ చేయను. సర్వం తెలిసిన దేవుడి దగ్గరికి వెళ్లి ‘ఇది కావాలి’ అని అడగకూడదనుకుంటాను. మనకేం ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకే కోరికల లిస్ట్‌ చదవను.

కొన్ని సినిమాల్లో సింగర్‌గా గొంతు వినిపించారు. మళ్లీ ఎప్పుడు?
ట్రై చేస్తున్నాను. వీలున్నప్పుడల్లా పాడుతూనే ఉంటాను.

హీరోయిన్‌ అయ్యాక ఎక్కువగా ట్రావెల్‌ చేస్తున్నారు? ప్రయాణాలు ఇష్టమేనా?
పదిహేడేళ్ల వయసులో కెరీర్‌ కోసం ఫస్ట్‌ టైమ్‌ ఫ్లైట్‌ ఎక్కాను. ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఇప్పుడూ ట్రావెలింగ్‌ అంటే అంతే ఎగై్జటింగ్‌గా ఉంటుంది. అయితే మరీ వారంలో రెండు మూడు సార్లు వేరే స్టేట్, వేరే కంట్రీ అంటే .. ‘అరే.. ఎంత తిరగాలిరా బాబూ’ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్‌ కాసేపే.

పర్టిక్యులర్‌గా ఏదైనా కంట్రీని విజిట్‌ చేయాలని ఉందా?
సినిమా షూటింగ్స్‌ వల్ల ఆల్మోస్ట్‌ అన్ని దేశాలు చూసేశాను. అలాగే బెల్జియం మిగిలింది. ఆ ప్లేస్‌ విజిట్‌ చేయాలనుంది.

మీరు చేసిన పాత్రల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినది ఏదైనా ఉందా?
ప్రతీ పాత్ర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాను. ‘శ్రీనివాస కల్యాణం’ నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా తెలుగు సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు. ‘తొలిప్రేమ’ సినిమాలో పోషించిన వర్ష పాత్రకు, నాకు ఎటువంటి పోలికా లేదు. తనకంటే నేను చాలా మెచ్యూర్డ్‌. కానీ ఆ సినిమాలో సెకండ్‌ హాఫ్‌లో వర్ష చూపించే ఓర్పును (పేషెన్స్‌) ఎక్కువ నేర్చుకున్నాను. 

ఇటీవల ‘శ్రీనివాస కల్యాణం’లో మిమ్మల్ని పెళ్లి పీటల మీద చూశాం.. రియల్‌ లైఫ్‌లో ఎప్పుడు చూడొచ్చు?
ఇప్పటికైతే ఆ ప్లాన్స్‌ లేవు. సినిమాలు.. సినిమాలు.. అంతే. అమ్మానాన్న మరో రెండేళ్ల తర్వాత పెళ్లి ప్లాన్స్‌ మొదలుపెట్టేట్లు ఉన్నారు (నవ్వుతూ). 

మరి.. కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు?
మా ఇద్దరికీ వేవ్‌లెంగ్త్‌ బాగా కుదరాలి. అతను ‘కైండ్‌ హార్టెడ్‌’ అయ్యుండాలి. కైండ్‌ అని ఎందుకు అన్నానంటే ఎక్కడ ‘దయ’ ఉంటుందో అక్కడ బాగా చూసుకునే మనసు ఉంటుంది.

జనరల్‌గా ఏ అమ్మాయిని అడిగినా ‘మంచి మనిషి అయ్యుండాలి’ అంటారు. పెళ్లి చూపుల్లో ఒక్కసారి చూసి, పెళ్లి చేసుకుంటారు. ఒక్క చూపులో జడ్జ్‌ చేయగలిగే ‘సూపర్‌ పవర్‌’ ఏదైనా మీకుందా?
(నవ్వేస్తూ). అలాంటి అతీత శక్తులేవీ నాకు లేవు. అయితే ఒక మనిషి లుక్‌ అతను ఎలాంటివాడో కొంతవరకూ చెప్పేస్తుంది. మాట్లాడే విధానం ద్వారా కూడా కొంత తెలుసుకోవచ్చు. పెళ్లి చేసుకునే అబ్బాయిని అయినా, ఫ్రెండ్‌ని అయినా.. ఎవరినైనా కొన్ని రోజుల్లోనో, నెలల్లోనో తెలుసుకోవడం కష్టం. వాళ్లతో ట్రావెల్‌ చేస్తేనే మనసు అర్థమవుతుంది.

ఖాళీ సమయాల్లో బుక్స్‌ బాగా చదువుతారని విన్నాం. మీరు చదివినవాటిలో బాగా ప్రభావితం చేసిన బుక్‌ గురించి?
నాకు బుక్స్‌ చదవడం ఇష్టం. వాటికోసం స్పెషల్‌గా షాపింగ్‌ చేస్తాను. ఈ మధ్యకాలంలో చదివిన ‘ప్యాలెస్‌ ఆఫ్‌ ఇల్యూషన్స్‌’ బుక్‌ నన్ను చాలా ప్రభావితం చేసింది. ద్రౌపది కోణం నుంచి మహాభారతం చెప్పే పుస్తకం అది. ఎవరో ఫ్రెండ్‌ ఇస్తే చదవడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం నాలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందంటే... ‘వీళ్లు ఇలాంటివాళ్లు’ అని మనుషుల మీద ఓ నిర్ణయానికి రావడం మానేశాను. సంఘటనలను బట్టి మనుషుల ప్రవర్తన మారుతుంటుంది. అందుకని ఏదో ఒక ఇన్సిడెంట్‌ చూసి, ‘వీరి మనస్తత్వం ఇలాంటిది’ అని జడ్జ్‌ చేయడం తప్పని తెలుసుకున్నాను. బుక్స్‌ ఇచ్చే నాలెడ్జ్‌ అంతా ఇంతా కాదు. అందుకే ఖాళీ దొరికితే చదవాలి. నేను ఖాళీ సమయాల్లో బుక్స్‌తో బిజీ అయిపోతా.

ఫైనల్లీ.. ఒక సందర్భంలో ‘దేవుడు నాకు కావల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు’ అని అన్నారు. మరి ఆ ఎక్కువని తిరిగి ఎలా దేవుడికి ఇస్తారు?
దేవుడికి మనం ఏదైనా ఇవ్వడమంటే అది సేవ రూపంలోనే అనుకుంటాను. మా అమ్మ ఏం చెబుతారంటే కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకూడదంటారు. అందుకే బయటకు చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడను.

మీరు, వాణీకపూర్‌ (‘ఆహా కల్యాణం’ ఫేమ్‌) అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్స్‌కి వెళుతున్నారు. అసలు మీ ఇద్దరికీ ఫ్రెండ్‌షిప్‌ ఎలా స్టార్ట్‌ అయింది?
మేం ఇద్దరం ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లమే. మోడలింగ్‌ టైమ్‌ నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. మా ఫ్రెండ్‌షిప్‌ పదేళ్లుగా కొనసాగుతోంది. తను నా సిస్టర్‌లాగా. 

ప్రొఫెషనల్‌గా తను మీ అంత ఫాస్ట్‌గా లేరు. ఏమైనా సలహాలిస్తారా?
వాణీ కపూర్‌ మంచి నటి. కెరీర్‌ కొంచెం స్లోగా ఉంది. రీసెంట్‌గా ఓ పెద్ద ప్రాజెక్ట్‌ ఓకే చేసింది. రణ్‌బీర్‌తో ఓ పీరియాడికల్‌ మూవీ చేస్తోంది. 

ఐదేళ్ల తర్వాత రాశీ ఖన్నా ఎలా ఉండబోతున్నారు?
నిజం చెప్పాలంటే అంత ప్లానింగ్‌ ఉండదు. అనుకోకుండా అనూహ్యంగా జరిగేదే జీవితం. సో... ప్లాన్‌ చేసుకుని ఏం ఉపయోగం? లైఫ్‌ ఎలా వెళితే అలా వెళ్లిపోవడమే.

మీరేమో అందంగా ఉంటారు. ఒకవేళ డీ–గ్లామరస్‌ రోల్‌ వస్తే?
డీ–గ్లామరస్‌ మేకప్‌ వేసుకోవడానికి రెడీ. ఓన్లీ మేకప్‌ మాత్రమే కాదు.. హెయిర్‌ సై్టల్‌ ఏదైనా ఎలా అయినా చేసుకోవడానికి రెడీ. ఎందుకంటే చాలెంజెస్‌ ఎప్పుడో కానీ రావు కదా. 

మీ మనస్తత్వానికి విరుద్ధంగా ఉన్న పాత్ర చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది?
ఏ పాత్ర చేసినా అందులో సెన్స్‌ ఉందా? లేదా? అని ఆలోచిస్తాను. అలా ఉంటే బావుంటుంది అని నమ్ముతాను. ఒకవేళ కొంచెం అటూ ఇటూగా ఉంటే నా అభిప్రాయాన్ని చెబుతాను.  
– డి.జి. భవాని

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు