స్క్రీన్‌ టెస్ట్‌

3 May, 2019 01:37 IST|Sakshi

దాసరి స్పెషల్‌

మరణించిన తర్వాత కూడా అందరి హృదయాల్లో జీవించి ఉన్నారంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవారో ఊహించవచ్చు. దర్శకరత్న డా. దాసరి నారాయణరావు అలాంటివారే. 2017 మే 30న ఆయన భౌతికంగా దూరమయ్యారు. సినీ కార్మికుల పక్షాన నిలిచిన ఆయన వాళ్ల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయారు. రేపు దాసరి జయంతి. ఈ సందర్భంగా ఈ వారం ‘దాసరి’ స్పెషల్‌ క్విజ్‌

1. దాసరి నారాయణరావు దర్శకునిగా పరిచయమైంది 1972లో ‘తాతమనవడు’తో. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘ఎర్రబస్సు’లో మంచు విష్ణు హీరోగా నటించారు. 2014లో విడుదలైన ఆ సినిమాతో దర్శకరత్న మొత్తం ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారో తెలుసా?
ఎ) 100 బి) 120 సి) 90 డి) 151

2. దాసరి తన కెరీర్‌ మొత్తంలో పది రోజుల్లో షూటింగ్‌ పూర్తిచేసి విడుదల చేసిన సినిమా ‘నీడ’. ఆ చిత్రం ద్వారా మహేశ్‌బాబు బాల నటునిగా, రమేశ్‌బాబు హీరోగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంలోని రెండో హీరో పాత్రలో ఓ నటుడు పరిచయమయ్యారు. అతనెవరో తెలుసా?
ఎ) చంద్రమోహన్‌ బి) హరనాథ్‌ బాబు సి) ఆర్‌. నారాయణమూర్తి డి) ఈశ్వరరావు

3. రచయితగా, దర్శకునిగా దాసరి చాలా నంది అవార్డులు అందుకున్నారు. నటునిగా నంది అవార్డు అందుకున్న మొదటి సినిమా పేరేంటి?
ఎ) మామగారు బి) నాయుడుగారి కుటుంబం సి) సూరిగాడు డి) యంఎల్‌ఏ ఏడుకొండలు

4.  ఓ ప్రముఖ నటునికి దాసరి నారాయణరావు చెప్పిన కథ నచ్చి 1,116 రూపాయల పారితోషికాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చారు. దాసరి దర్శకత్వంలో ఆ సినిమాను ప్రారంభించాలనుకున్నారు. నిర్మాతకు వచ్చిన ప్రాబ్లమ్‌ వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాసరికి మొదట అడ్వాన్స్‌ ఇచ్చిన ఆ హీరో ఎవరు?
ఎ) శోభన్‌ బాబు బి) అక్కినేని నాగేశ్వరరావు  సి) ఎన్టీఆర్‌ డి) ఎస్వీ రంగారావు

5. దర్శకునిగా దాసరి దాదాపు 150 సినిమాలు చేస్తే, నటునిగా చిరంజీవి 150 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. దాసరి కొంచెం సీనియర్‌ అయినా ఇద్దరూ దాదాపుగా సమకాలీకులే. దాసరి దర్శకత్వంలో చిరంజీవి ఎన్ని చిత్రాలు చేశారో తెలుసా?   
ఎ) 8 బి) 4 సి) 2 డి) 1

6. కథే హీరో అంటూ చిన్న చిత్రాలను ఎంకరేజ్‌ చేసిన దాసరి తెలుగులో అందరి టాప్‌ స్టార్స్‌ని డైరెక్ట్‌ చేశారు. ఆయన దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో నటించిన కథానాయకుడు ఎవరో కనుక్కోండి.
ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ  సి) అక్కినేని నాగేశ్వరరరావు డి) ఎన్టీఆర్‌

7. దాసరి మొదట రచయితగా పనిచేసి దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. తర్వాతి కాలంలో ఆయన నిర్మాతగా మారారు. నిర్మాతగా ఆయన మొదటి సినిమా పేరేంటి?
ఎ) గోరింటాకు బి) స్వయంవరం సి) శివరంజని డి) సంసారం–సాగరం

8. ఓ ఇతిహాసాన్ని నాలుగు భాగాలుగా దాసరి తెరకెక్కించాలనుకున్నారు. ఆ సినిమాతో దర్శకుడిగా రిటైర్‌ కావాలనుకున్నారు. ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. దాసరి ఇష్టపడిన ఆ కథ చెప్పుకోండి చూద్దాం.
ఎ) మహాభారతం బి) రామాయణం  సి) భాగవతం డి) కురుక్షేత్రం

9. దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాతా మనవడు’. ఆ చిత్రంలో తాతగా యస్వీఆర్‌ నటించారు. మరి మనవడిగా మురిపించిన నటుడెవరో గుర్తుందా?
ఎ) చలం బి) శరత్‌బాబు సి) బాలకృష్ణ (అంజిగాడు) డి) రాజబాబు

10. ‘ఒక లైలా కోసం తిరిగాను లోకం..’ అనే పాట అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘రాముడు కాదు కృష్ణుడు’ చిత్రంలోనిది. ఆ పాట రచయితెవరు?
ఎ) వేటూరి  బి) శ్రీశ్రీ సి) కృష్ణశాస్త్రి డి) దాసరి

11. దాసరి శిష్యుల్లో ఓ దర్శకుడు మాత్రం గురువుగారిలా 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. ఆ శిష్యుడు ఎవరో తెలుసా?
ఎ) రవిరాజా పినిశెట్టి బి) కోడి రామకృష్ణ సి) రాజా వన్నెంరెడ్డి డి) రేలంగి నరసింహారావు

12. ‘జ్యోతి బనే జ్వాలా’ అనే బాలీవుడ్‌ చిత్రంలో రాజేశ్‌ ఖన్నా హీరోగా నటించారు. ఆ సినిమాకు మాతృక కృష్ణంరాజు హీరోగా నటించిన ఓ తెలుగు సినిమా. ఆ సినిమా పేరేంటి?
ఎ) రంగూన్‌ రౌడి బి) కటకటాల రుద్రయ్య  సి) తాండ్ర పాపారాయుడు డి) ఉగ్రనరసింహం

13. దాసరి దర్శకత్వంలో 1972లో ప్రారంభమైన నిర్మాణ సంస్థ ఇప్పటికీ సినిమాలు తీస్తూ చాలా యాక్టివ్‌గా ఉంది. ఆ నిర్మాణ సంస్థ పేరేంటో తెలుసా? (చిన్న క్లూ: ఆ సంస్థ మొదటి సినిమా ‘బంట్రోతు భార్య’)
ఎ) వైజయంతీ మూవీస్‌ బి) దేవీ ఫిలింస్‌ సి) గీతా ఆర్ట్స్‌ డి) పద్మాలయా పిక్చర్స్‌

14.  ‘స్వర్గం–నరకం’ చిత్రం దాసరికి దర్శకునిగా మంచి పేరు సంపాదించింది. ఆ చిత్రంలో ఓ హీరోగా ఈశ్వరరావు ముందే హీరోగా సెలెక్ట్‌ అయ్యారు. సెకండ్‌ హీరోగా నటించి తర్వాతి కాలంలో మంచి ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఆ నటుడెవరో తెలుసా?
ఎ) మురళీ మోహన్‌ బి) మోహన్‌బాబు  సి) రామ్మోహన్‌ డి) నరసింహరాజు

15 దాసరి దర్శకత్వం వహించిన ‘మేఘ సందేశం’ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకొంది. ఆ చిత్రంలో ఏయన్‌ఆర్‌ హీరోగా నటించగా ఇద్దరు ప్రముఖ హీరోయిన్‌లు నటించారు. అందులో ఒక హీరోయిన్‌ జయసుధ మరో హీరోయిన్‌ ఎవరో గుర్తుందా?
ఎ) జయప్రద బి) శ్రీదేవి  సి) విజయశాంతి డి) రాధి

16. సూపర్‌స్టార్‌ కృష్ణతో దాసరి తీసిన మొదటి చిత్రం ‘రాధమ్మ పెళ్లి’. దాసరి దర్శకత్వం వహించినవాటిలో కృష్ణ మూడు మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించారు. వారిద్దరి కాంబినేషన్‌లో మొత్తం ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా?
ఎ) 9 బి) 6 సి) 12 డి) 8

17. దాసరి దర్శకత్వం వహించిన మొదటి  చిత్రంలోని తాత పాత్ర రాసినప్పుడు ముందు ఎస్వీఆర్‌ని దృష్టిలో పెట్టుకొని రాయలేదు. దాసరికి ఎంతో ఇష్టమైన నటుడు, స్నేహితుడి కోసం రాశారు ఆ పాత్రను. పారితోషికం విషయంలో ప్రాబ్లమ్‌ వచ్చి ఆ పాత్రను ఆ నటుడు చేయలేదు. ఎవరా నటుడు?
ఎ) పద్మనాభం బి) కైకాల సత్యనారాయణ  సి) నాగభూషణం డి) రావు గోపాల్‌రావు

18. 1979లో దాసరి దర్శకత్వం వహించిన చిత్రం ‘గోరింటాకు’. కె. మురారి నిర్మించిన ఆ చిత్రంలో దాసరి అక్కా అని ఎంతో ఆప్యాయంగా పిలిచే సావిత్రి ఓ పాత్రలో నటించారు. శోభన్‌బాబు హీరోగా నటించిన ఆ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) సుజాత బి) సుహాసిని సి) సుమలత డి) శ్రీప్రియ

19. సహజనటిగా పేరు తెచ్చుకొన్నారు జయసుధ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన నటి జయసుధ. ఆమె ఆయన దర్శకత్వంలో ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
ఎ) 29 బి) 17 సి) 19 డి) 24

20. దాసరి సినీ పరిశ్రమకు రాకముందు పాలకొల్లులో ఉన్నప్పుడు కావిడి మెడలో వేసుకొని పండ్లు ఆమ్మేవారు. ఆయన ఏ పండ్లను అమ్మారో తెలుసా?
ఎ) మామిడి పండ్లు బి) పనస పండ్లు  సి) సపోటా పండ్లు డి) అరటి పండ్లు

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) డి 2) సి 3) ఎ 4) సి 5) డి 6) సి 7) సి 8) ఎ 9) డి 10) డి 11) బి
12) ఎ 13) సి 14) బి 15) ఎ 16) బి 17) సి 18) ఎ 19) ఎ 20) డి

నిర్వహణ: శివ మల్లాల

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు