రెండు కళ్లూ చాలవు

30 Oct, 2018 00:19 IST|Sakshi

అభిమానులు తమ స్టార్‌ హీరో సినిమా ఒక్కసారి చూసి ఉండలేరు.తక్కువలో తక్కువ రెండు సార్లు చూస్తారు.ఇక వీరాభిమాని తక్కువలో తక్కువ చూస్తూనే ఉంటాడు.అభిమానం నిండటానికి ఒక్క గుండె సరిపోదు.స్టార్‌ని చూసుకోవడానికి రెండు కళ్లూ సరిపోవు. అందుకేనేమో అభిమానుల కోసమే హీరోలు  సింగిల్‌ చెక్కుకే డబుల్‌ లుక్స్‌ ఆఫర్‌ ఇస్తున్నారు. 

ఒక షేడ్‌ క్లాస్‌... ఇంకో షేడ్‌ మాస్‌. ఒక షేడ్‌లో అందంగా, ఇంకో షేడ్‌లో అందవిహీనంగా.. ఇలా ఒకే సినిమాలో హీరో లేక హీరోయిన్‌ రెండు రకాల లుక్స్‌లో కనిపిస్తే అభిమానులకు పండగే. రానున్న రోజుల్లో అలాంటి ఫెస్టివల్‌ని సెలబ్రేట్‌ చేసుకోబో తున్నాం. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్, తెలుగు మాస్‌ మహారాజా రవితేజ, సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌ రానా.. వీళ్లు మాత్రమే కాదండోయ్‌.. స్టార్‌ హీరోయిన్‌ నయనతార కూడా ఒక సినిమాలో రెండు లుక్స్‌లో కనిపించనున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.

కాలా తర్వాత పేట్టా
రజనీకాంత్‌ ‘కబాలి’, ‘కాలా’లో అండర్‌ వరల్డ్‌ డాన్‌గా వేసినా రెండు సినిమాల్లోనూ రెండు భిన్నమైన లుక్కులతో కనిపించారు. ఆయన వయసు  68. అయినా సరే జోరు తగ్గకుండా ప్రతి సినిమాలో కొత్తదనం కోసం తాపత్రయపడుతూనే ఉన్నారు. అనుకున్న సమయానికి 15 రోజులు ముందుగానే ఆయన తాజా చిత్రం ‘పేట్టా’ షూటింగ్‌ పూర్తయ్యిందని భోగట్టా. ఇందులో రజనీ  మాస్‌ లుక్‌లో,  క్లాస్‌ లుక్‌లోనూ కనిపించనున్నారు. ఆ స్టిల్స్‌ ఇప్పటికే రిలీజయ్యి అభిమానులకు ఉత్సాహం తెప్పిస్తున్నాయి. ఇందులో రజనీ ఎమ్‌.ఐ.ఎస్‌.ఏ (మెయిన్‌టెనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ యాక్ట్‌) ఖైదీగా కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. అలాగే  డెహ్రాడూన్‌ షెడ్యూల్‌లో దాదాపు 500 మంది స్టూడెంట్స్‌తో రజనీ షూట్‌లో పాలొన్నారు కనుక ఆయన హాస్టల్‌ వార్డెన్‌గానూ కనిపిస్తారన్న ప్రచారం ఊపందుకుంది.  ఈ సినిమాకు ‘పిజ్జా’ ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు. ఇద్దరు ప్రముఖ తమిళ డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్‌  కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో తొలిసారి రజనీతో త్రిష స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటుంటే హిందీ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తమిళంలో తొలి అడుగు వేయనున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచంద్రన్‌ స్వరకర్త. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

చిరుగడ్డపు రాకుమారుడు
కృష్ణ గడ్డంతో నటించిన ‘అంతం కాదిది ఆరంభం’, ‘రక్త సంబంధం’ వంటి సినిమాలు పెద్ద హిట్‌ అయ్యాయి. కాని  మహేశ్‌బాబు ఇప్పటికి 24 సినిమాల్లో నటించినా గడ్డంతో కనిపించలేదు. కాని కెరీర్‌లో మైలురాయిగా ఉండబోయే 25వ సినిమా ‘మహర్షి’ కోసం ఆయన గడ్డం పెంచారు. ‘భరత్‌ అనే నేను’లో ఓ పాటలో కొద్ది క్షణాలు మీసకట్టుతో కనిపిస్తేనే థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ విజిల్స్‌ కొడితే ఈ సినిమాలో ఫుల్‌ గడ్డం, మీసంతో కనిపిస్తే ఇంకెంత సంతోషిస్తారో. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షి’ షూటింగ్‌ అమెరికాలో జరుగుతోంది. ఈ షూట్‌లో మహేశ్‌ బాబుకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఇందులో మహేశ్‌ అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో క్లీన్‌ షేవ్‌తో కనిపించారు. కాలేజీ సీన్స్‌లో మహేశ్‌ మాస్‌గా కనిపిస్తే, ఈ లుక్‌లో పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి సీఈవోగా కనిస్తారని టాక్‌. ఈ విషయం గురించిన క్లారిటీ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న థియేటర్‌లో తెలుస్తుంది. ‘అల్లరి’ నరేశ్, జయసుధ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. దేవిశ్రీప్రసాద్‌  స్వరకర్త.

ట్రిపుల్‌ ధమాకా
ఒకే సినిమాలో మూడు గెటప్‌లతో మెప్పించడం కష్టమైన పని. ఇటీవల ఎన్‌.టి.ఆర్‌ ‘జై లవకుశ’లో ఆ ఫీట్‌ను సక్సెస్‌ఫుల్‌గా సాధించారు. ఇప్పుడు రవితేజ సాధించడానికి రెడీ అవుతున్నారు.  శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’లో  రవితేజ మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారనేది ఇటీవల రిలీజ్‌ చేసిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ కన్ఫర్మ్‌ చేసింది. ఆత్మల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఆరేళ్ల తర్వాత సౌత్‌ గడప తొక్కారు ఇలియానా. ఈ చిత్రం నవంబర్‌ 16న విడుదల కానుంది. సునీల్, లయ, శ్లోక (లయ కుమార్తె), అభిమన్యుసింగ్, తరుణ్‌ అరోరా, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త.

మారిపోయి రానా
‘బాహుబలి’ సినిమా కోసం రానా ఫుల్‌గా వెయిట్‌ పెరిగారు. ఆ తర్వాత ‘ఘాజి’, ‘నేనే రాజు నేనే మంత్రి’ కోసం స్లిమ్‌ అయ్యారు. ఇదంతా ఆయన కమిట్‌మెంట్‌కు నిదర్శనం. తన నెక్ట్స్‌ చిత్రాలకు కూడా  ఇదే కమిట్‌మెంట్‌ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అందుకే ‘అరణ్య’, ‘1947’ చిత్రాల కోసం బరువు తగ్గారు.  ఈ రెండూ తెలుగు, తమిళతో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్నాయి. ‘1947’ సినిమా గురించి చెప్పాలంటే.. ఇందులో రానా  1940–1950ల నాటి సైనికుడి పాత్రలో నటిస్తున్నారని సమాచారం. అలానే ఇందులోనే మరో లుక్‌లో కూడా కనిపిస్తారట. ‘బాహుబలి’ సినిమా తర్వాత నాజర్, సత్యరాజ్, రానా కలిసి నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ‘అరణ్య’లోనూ డిఫరెంట్‌ గెటప్స్‌ చేస్తున్నారట. 

మోహన్‌ కమాల్‌
క్యారెక్టర్స్‌ కోసం రిస్క్‌ తీసుకోవడానికి మోహన్‌లాల్‌ ఏమాత్రం వెనకాడరు. అందుకే మలయాళ సినిమా ‘ఒడియన్‌’  కోసం దాదాపు 18 కేజీల బరువు తగ్గారు. లాల్‌ వయసు 58. ఈ వయసులో బరువు పెరగడం, తగ్గడం.. రెండూ అంత ఈజీ కాదు. అది కూడా 18 కేజీల బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. కానీ మోహన్‌లాల్‌ కష్టపడి యంగ్‌ లుక్‌లోకి మారిపోయారు. వీఏ శ్రీకుమార్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రకాశ్‌ రాజ్, మంజిమా మోహన్‌ కీలక పాత్రలు చేశారు. ఇందులో మలబార్‌ తీరంలో కొన్ని అతీతమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్న వ్యక్తి పాత్రలో మోహన్‌లాల్‌ కనిపిస్తారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన మోహన్‌లాల్‌ లుక్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ డిఫరెంట్‌ గెటప్స్‌ను బట్టి ఆయన క్యారెక్టర్‌లో షేడ్స్‌ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏడాదిన్నరపాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

డబుల్‌ మాస్‌
పట్నంలో ఒకరు. పల్లెటూర్లో మరొకరు. సిటీ కుర్రాడు సీటీ మార్‌ అంటూ జోరుగా ఉంటే.. పల్లెటూరి పోరడు పందెం కోడిలా హుషారుగా ఉంటాడు. హ్యాండ్సమ్‌ హీరో అజిత్‌ ఈ రెండు షేడ్స్‌ ఉన్న పక్కా మాస్‌ క్యారెక్టర్స్‌లో కనిపించనున్న చిత్రం ‘విశ్వాసం’. ‘వీరమ్‌’, ‘వేదాలం’, ’వివేగమ్‌’ సినిమాల తర్వాత హీరో అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘విశ్వాసం’ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. హాస్యనటుడు యోగిబాబుకు ఇది వందో చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోందని సమాచారం. డి. ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

తెలుపు.. నలుపు
నయనతార లేడీ ఒరియెంటెడ్‌ సినిమాలతోనూ రాణిస్తున్నారు. ఆమె తాజాగా నటిస్తున్న సినిమా ‘ఐరా’లో డ్యూయల్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు.  తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఇటీవల రిలీజ్‌ చేశారు. ఒక లుక్‌లో నయనతార తెల్లగా ఉంటే మరో లుక్‌లో నల్లగా కనిపిస్తున్నారు.  హారర్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టాక్‌. ‘ఐరా’ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

ఆన్‌ ది వే
బయోపిక్స్‌లో డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించక తప్పదు. ఈ నేపథ్యంలో ‘ఎన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌లో బాలకృష్ణ డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించనున్నారు. అలాగే నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘మజిలీ’ టైటిల్‌ అనుకుంటున్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్‌ పరంగా నాగచైతన్య డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారని టాక్‌. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో శర్వానంద్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న ‘జెర్సీ’ సినిమాలో నలభై ఏళ్ల క్రికెటర్‌ పాత్రలో కనిపిస్తారు. అలాగే 20 ఏళ్ల కుర్రాడిలానూ కనిపిస్తారట. 
– ఇన్‌పుట్స్‌: ముసిమి శివాంజనేయులు

మరిన్ని వార్తలు