తార..త‌ళుకుతార‌...న‌య‌న‌తార‌

3 Mar, 2019 00:03 IST|Sakshi

ఎంత తేడా! ‘చంద్రముఖి’లో ‘నా పేరు దర్గా కాదు దుర్గ’ అని అమాయకంగా పలికిన అమ్మాయే...‘అనామిక’లో ఆవేశం మూర్తీభవించిన దుర్గావతారం ఎత్తింది. ఒకప్పుడు ‘తార తళుకు తార’ గ్లామర్‌ పాత్రల్లో మెరిసిన నయనతార...ఇప్పుడు తనదైన దారిలో పయనిస్తోంది.  ‘లేడీ సూపర్‌స్టార్‌’ ఇమేజ్‌ దిశగా దూసుకెళ్తుంది.  తాజాగా ‘అంజలి సి.బి.ఐ’గా అలరించిన నయన్‌ గురించి కొన్ని ముచ్చట్లు...

మరింత స్పీడ్‌తో
‘ఇక సెలవా మరి’ అంటూ ఒక దశలో స్వల్ప విరామం తీసుకుంది నయన్‌. ఆ తరువాత సన్నిహితుల సలహాతో మళ్లీ నటించడం మొదలుపెట్టింది. ‘రెండోసారి ఆదరిస్తారా?’ అనే ప్రశ్న ఉదయించకముందే మరోసారి తన సత్తా చాటుకుంటుంది. ‘‘నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని రెట్టించిన ఉత్సాహంతో.

బ్రాండ్‌ ఇమేజ్‌
ఫిల్మ్, ప్రైవేట్‌ ఫంక్షన్‌లకు నయనతార హాజరు కాదనే పేరు ఉంది. తన ‘బ్రాండ్‌ ఇమేజ్‌’ను మెల్లమెల్లగా పెంచుకోవడంలో భాగంగానే అలాంటి నిర్ణయం తీసుకుంది అంటారు సినీ విశ్లేషకులు. ఇక్కడ రెండు సినిమాలు చేయగానే బాలీవుడ్‌ బాట పట్టి అక్కడ ఫ్లాప్‌ ఎదురుకాగానే ‘ఏది ఏమైనా టాలీవుడే బెటర్‌’ అనే కథానాయికలను చూస్తుంటాం. అయితే నయన్‌ మాత్రం మొదటి నుంచి ‘సౌత్‌’నే నమ్ముకుంది. బాలీవుడ్‌ ప్రస్తావన వచ్చినప్పుడు... ‘‘ఇక్కడ పనిచేయడమంటే సొంత ఇంట్లో పనిచేస్తున్నంత సౌఖ్యంగా ఉంటుంది’’ అని సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ గురించి చెబుతుంటుంది నయన్‌.

ఒక్క హిట్టు చాలు!
ఎప్పుడూ టాప్‌లో ఉండటం సాధ్యమేనా? సాధ్యమా అసాధ్యమా అనేది వేరే విషయంగానీ... గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటుంది నయన్‌.‘‘రెండు మూడు ఫ్లాప్‌లు వచ్చినా...ఒక హిట్‌ వస్తే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు’’ అంటోంది. 

ఆరోజుల్లోనే!
పెర్ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ క్యారెక్టర్లు ఎంచుకోవాలనే నిర్ణయం నిన్నా మొన్నటిది కాదు...చాలా సంవత్సరాల క్రితమే ఒక ఇంటర్వ్యూలో ‘‘తెర మీద అందంగా కనిపించాలనుకోవడం తప్పేమీ కాదు. అయితే నాలోని నటనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను’’ అని చెప్పింది నయన్‌. ‘‘నయనతార క్రేజ్‌ యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌పై ఎక్కువగా ఉండటం వల్ల ఓపెనింగ్స్‌ పెద్ద ఎత్తున రావడానికి ఉపయోగపడుతుంది’’ అనేది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మాట. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా