కంగ‌నక‌ర్ణిక

2 Jan, 2019 00:01 IST|Sakshi

జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఒక రోజు ముందు కంగనతంత్ర దినోత్సవం. కంగన డైరెక్ట్‌ చేసిన, కంగన హీరోయిన్‌గా నటించిన బయోపిక్‌.. ‘మణికర్ణిక : ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ జనవరి 25న రిలీజ్‌ అవుతోంది.  మణికర్ణిక.. కంగనకర్ణిక అనుకునే స్థాయిలో ఉంటే కనుక  నటిగా కన్నా, డైరెక్టర్‌గా ఇది ఆమెకు పెద్ద విజయం. 

పైన బ్రిటిష్‌ డేగల కళ్లు. కింద కోడిపిల్ల.. ఝాన్సీ.ఏ క్షణమైనా తన్నుకుపోవచ్చు. తక్షణం ఝాన్సీకి వారసుడు కావాలి. ఆ వారసుడి చేతిలో పదునైన ఖడ్గం ఉండాలి. ముక్కుకు కరచుకుపోవడానికి కిందికి వాలబోతున్న డేగల కంఠాల్ని సర్రున తెగ్గొట్టేయాలి. అప్పుడే ఝాన్సీకి బతుకు. ఝాన్సీ ప్రజలకు మెతుకు. వారసుడు లేడు. మణికర్ణిక వచ్చింది. మ..ణి..క..ర్ణి..క! ఆమెలా ఎవరూ ఉండరు. ఆమెలా ఎవరూ నృత్యం చెయ్యలేరు. ఆమెలా ఎవరూ అశ్వాన్ని పరుగులు తీయించలేరు. ఆమెలా ఎవ్వరూ ఖడ్గాన్ని తిప్పలేరు. ఆమేనా వారసురాలు? ఝాన్సీని రక్షించేందుకులేచి నిలబడింది కదా. లేచి నడుము బిగించింది కదా. ఒరలోకి కత్తిని దోపుకుంది కదా. జవనాశ్వాన్ని ఎక్కింది కదా. ఖడ్గాన్ని తీసి.. గగనంలో నెత్తురు కక్కుతున్న సామ్రాజ్యవాదనేత్రాలకుచూపింది కదా. అయితే వారసురాలే. మణికర్ణిక.. ఝాన్సీ పౌరురాలు కాదు. అయినా వారసురాలే.ఝాన్సీకి ఆమె కోడలు. ఝాన్సీ ఇక కోడి పిల్ల కాదు. కోడలు పిల్ల. 

మెట్టినింటికి వచ్చాక మణికర్ణిక పేరు మారింది. లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి. భర్త వీరమరణం పొందాక.. ఝాన్సీ కి రాణి.‘లక్ష్మీబాయి అనే నేను.. ’.. చివరి రక్తపు బొట్టు చిందేవరకు, ఝాన్సీకి అత్యంత విధేయురాలినై, ఝాన్సీ ప్రజల సేవకు, ఝాన్సీ సంస్థాన రక్షణకు, సంరక్షణకు.. లక్ష్మీబాయి ప్రమాణ స్వీకారం. డేగలు కళ్లెర్ర చేశాయి. ఝాన్సీ నుంచి వెళ్లిపొమ్మని వర్తమానం పంపాయి.  వెళ్లిపోతే దేశద్రోహం.మిన్నకుండిపోతే శత్రు శేషం. శత్రువును మిగిల్చదలచుకో లేదు లక్ష్మీబాయి. బ్రిటిష్‌ ఫిరంగులు ఝాన్సీలో చొరబడ్డాయి. ఝాన్సీని మరుభూమిగా మార్చివేశాయి. లక్ష్మీ బాయి, ఆమె అశ్వం, ఆమె చేతిలోని ఖడ్గం.. పోరాటం ఆపలేదు. ‘‘దేశంపై ప్రేమ.. ఓటమిని అంగీకరించనివ్వదు. దేశాన్ని శత్రువుకు వదిలి పారిపోనివ్వదు’’ భర్త మాటలు గుర్తుకొచ్చాయి లక్ష్మీబాయికి ‘‘నిన్ను ప్రేమించడానికన్నా ముందు నేను నా దేశాన్ని ప్రేమించాను లక్ష్మీ’’. భర్త చివరి మాటలు గుర్తుకున్నాయి లక్ష్మీబాయికి. ‘‘నేనున్నా పోయినా, నా దేశం మిగలాలి లక్ష్మీ.. నా దేశం మిగలాలి లక్ష్మీ.. నా దేశం మిగలాలి  లక్ష్మీ’’.పదిహేడవ శతాబ్దపు నాటి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కల కూడా అదే. స్వరాజ్యం. ఆయన కలను కూడా ఒక కత్తిలా చేతికి తీసుకుంది లక్ష్మీబాయి. హరహర మహాదేవ్‌. హరహర మహాదేవ్‌. శత్రుమూకల శిరస్సులు తెగి, లక్ష్మీబాయి ముఖం మీద రక్తం చింది పడుతోంది. నుదుటిపై సింధూరంలా రక్తం. కంఠంపై ఆభరణంలా రక్తం. పెదవులపై విజయహాసంలా రక్తం. లక్ష్మీబాయి గెలిచింది. కాదు.. ఝాన్సీ గెలిచింది. కాదు. ఝాన్సీ లక్ష్మీబాయి గెలిచింది. కాదు కాదు.. కంగనా రనౌత్‌ గెలిచింది. ‘‘నీకు ఝాన్సీ కావాలి. నాకూ ఝాన్సీ కావాలి. ఒకటే తేడా. నీకు పాలన కావాలి. నాకు ప్రజలు కావాలి’’.. శత్రువుతో లక్ష్మీబాయి.‘‘నీకు నా శిరస్సు కావాలి, నాకూ నీ శిరస్సు కావాలి. ఒకటే తేడా. ఝాన్సీ కోట గుమ్మం ముందు వేలాడగట్టేందుకు నీకు నా శిరస్సు కావాలి. ఎవరికీ తలొంచే పని లేదని నా ప్రజలకు నేను చెప్పేందుకు నీ శిరస్సు నాకు కావాలి’’.. శత్రువుతో లక్ష్మీబాయి. 

‘మణికర్ణిక’ జనవరి 25న వస్తోంది. 1857 నాటి తిరుగుబాటు యోధురాలు ఝాన్సీలక్ష్మీబాయి కథ ఇది. లక్ష్మీబాయిగా కంగనా రనౌత్‌ది కీ రోల్‌. ఇద్దరు డైరెక్టర్లు. ఆ ఇద్దరిలో కంగన కూడా ఒకరు. రెండో వ్యక్తి రాధాకృష్ణ జాగర్ల మూడి. మన క్రిష్‌. ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ క్రిష్‌. కంగనతో పడక ‘మణికర్ణిక’ డైరెక్షన్‌ని మధ్యలోనే వదిలి హైదరాబాద్‌ వచ్చేశారు క్రిష్‌. కంగన ఇగోతో అతడికి ఏవో ప్రాబ్లెమ్స్‌. ఇగో మంచిదే.రెండు ఇగోల ఘర్షణలో క్రియేటివిటీ క్రీమీ లేయర్‌లా పైకి తేలుతుంది. 2017 మే లో షూటింగ్‌ ప్రారంభమైంది. కంగన ‘మణికర్ణిక’గానే కాదు, డైరెక్టర్‌గా కూడా డే వన్‌ నుంచి టీమ్‌లో కత్తి తిప్పుతూనే ఉన్నారు.‘అది అలా వద్దు. ఇది ఉండాలి’ అన్నప్పుడు సమఉజ్జీలతో, సమఉజ్జీలం అనుకునే వారితో తప్పని పోరే ఇది. ఆ పోరులో లక్ష్మీబాయిలా నిలిచి గెలిచారు కంగన. రీషూట్‌లు, మధ్యలోనే మానేసి వెళ్లిన నటులు,స్క్రిప్టులో మార్పులకు అంగీకరించని వారు, అడ్డుపుల్లలేసేవారు, కాళ్లడ్డు పెట్టేవాళ్లు, ఆరోపణలు చేసేవారు, అలిగి కూర్చునేవాళ్లు, ఇంతేనా పారితోషికం అని కంగనతో అన్నవాళ్లు, అంత పారితోషికమా అని కంగనతో అన్నవాళ్లు.. అసలు సినిమానే తీయనీయకుండా అడుగడుగున ప్లకార్డ్‌లు పట్టుకుని వచ్చినవాళ్లు.. వీళ్లందర్నీ కలుపుకుని వస్తూ, సినిమాను నిలుపుకున్నారు కంగన. టీజర్‌లు, ట్రైలర్‌లు చూస్తుంటే ఒకటనిపిస్తోంది. సినిమాతో పాటు, కంగన కూడా హిట్‌ అవుతారని. ఈసారి గణతంత్రానికి ముందు మనమొక కంగన తంత్రాన్ని సెలబ్రెట్‌ చేసుకోబోతున్నాం. 

వివాదాల రాణి
కంగనా రనౌత్‌ కాంట్రవర్సీల క్వీన్‌. బాలీవుడ్‌లో ఏకైక బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ ఉమన్‌. ఎవర్నీ లెక్క చెయ్యరు. అలాగని అహంకారం కాదు. ఆత్మాభిమానం. మనసులో ఉన్నదేమిటో అదే మాట్లాడేస్తారు.చాన్స్‌లు పోతాయని భయపడరు. విమర్శించిన వారిని ఊరికే వదిలిపెట్టరు. ఉరి తీసినంత పని చేస్తాను. వివాదాల రాణి అని ఆమెపై ఉన్న ముద్ర ‘మణికర్ణిక’ సినిమాతో మరింత బలపడింది. మొదటి చికాకు కో–యాక్టర్‌ సోనూ సూద్‌తో వచ్చిందామెకు. డైరెక్టర్‌ ఆమె. ఆమె చెప్పినట్లు చెయ్యాలి. ‘చెయ్యలేను. ఆమెకు అంత సీన్‌ లేదు’ అని తప్పుకున్నాడు. కంగన కలవరపడలేదు. ఉండమని అడగనూ లేదు.సోనూ చేసిన సీన్స్‌ అన్నిటినీ తక్కువ టైమ్‌లో మళ్లీ షూట్‌ చేశారు! బలమైన సీన్‌లు, బలమైన సినిమా. సోనూ సూదే నష్టపోయాడు. అంతకు ముందే కో–డైరెక్టర్‌తో పడింది కంగనకు. క్రియేషన్‌లో విభేదాలు.ఎందుకొచ్చిందీ అనుకున్నాడు క్రిష్‌. పక్కకు వచ్చేశాడు. లోపలి వాళ్లతో ఒక రకం తలనొప్పి. బయటివాళ్లతో ఒక రకం తలనొప్పి. రాజస్తాన్‌లో షూటింగ్‌ జరుపుతున్నప్పుడు ‘సర్వ బ్రాహ్మణ మహాసభ’ నాయకులు.. ‘ఆపండి’ అంటూ వచ్చారు. ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఏజెంటుతో రాణీ లక్ష్మీబాయి ప్రేమలో పడినట్లు చూపిస్తుంటే చూస్తూ ఊరుకోం’ అన్నారు. కంగన తల కొట్టుకున్నారు. ‘నీచ్‌ బాత్‌’ అని అందర్నీ తరిమికొట్టేశారు. యుద్ధం చేస్తున్నప్పుడు ఏ మారణాయుధం ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేం. సినిమా తియ్యడం కూడా యుద్ధమే. ఆ యుద్ధంలో కంగన గెలిచారు. ఇక మిగిలింది బాక్సాఫీస్‌ విజయం. 

మరిన్ని వార్తలు