స్వరకాయ ప్రవేశం

18 Jul, 2018 10:41 IST|Sakshi

కృష్ణానగర్‌ కేంద్రంగా డబ్బింగ్‌ స్టూడియోలు  

ఎంతోమంది  ఆర్టిస్టులు 

ఇక్కడే అన్ని సినిమాలకు డబ్బింగ్‌   

బంజారాహిల్స్‌: తెరపై పాత్ర హావభావాలు మనల్ని కట్టిపడేస్తాయి. అయితే తెరవెనుక ఆ భావాలు పలికించేది మరో పాత్ర. సినిమాలోని పాత్రలకు ప్రాణం పోసేది డబ్బింగ్‌. సినీ ఇండస్ట్రీలో మాటల మాంత్రికులకు ఇప్పుడు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. చాలామంది నటీనటుల పాత్రలకు తమ గొంతుతో డబ్బింగ్‌ కళాకారులు ప్రాణం పోస్తున్నారు. తెరవెనుక రారాజులుగా నిలుస్తున్నారు. కదిలే బొమ్మలకు స్వరదాతలుగా నిలుస్తూ తెరమీద ఆటను రక్తికట్టిస్తున్నారు. నవరసాలను పలికిస్తూ అద్భుత: అనిపిస్తున్నారు.

సినిమా తీయడం ఎంత కష్టమో, పాత్రలకు తగిన విధంగా డబ్బింగ్‌ చెప్పడం అంతే కష్టం. పాత్రలకు అనుగుణంగా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌లు డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. తెరపై మనకు కనిపించే ఇలియానా, త్రిష, సమంత, అనుష్క, రకుల్‌ప్రీత్‌సింగ్, కాజల్, ప్రభుదేవా, మమ్ముటి, కమల్‌హాసన్, రజనీకాంత్, మోహన్‌లాల్‌... ఇలా చాలామందికి డబ్బింగ్‌ చెప్పే ఆర్టిస్టులు కృష్ణానగర్, ఇక్కడి పరిసర ప్రాంతాల వారే. కేవలం డబ్బింగ్‌ ఆర్టిస్టులే కాదు.. సౌండ్‌ ఇంజినీర్లు, ఎడిటŠూర్ల ఇక్కడున్నారు. ఇక డబ్బింగ్‌ స్టూడియోలకు కృష్ణానగర్‌ కేంద్రమని చెప్పొచ్చు. సినిమా, సీరియల్‌ ఏదైనా సరే... డబ్బింగ్‌ ఇక్కడే.  

ఇదొక కళ...  
డబ్బింగ్‌ ఒక కళ. కేవలం మాటలు వస్తే సరిపోదు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. డబ్బింగ్‌ ఆర్టిస్టుకు  ముందుగా సీన్లపై పట్టుండాలి. భాషా స్పష్టంగా ఉండాలి. డైలాగులు అనర్గళంగా చెప్పాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, నవరసాలు పండించాలి. ఒక విధంగా చెప్పాలంటే తెర వెనుక వీరంతా నటించాల్సి ఉంటుంది. అప్పుడే వారు చెప్పే డైలాగులలో భావం ఉట్టిపడుతుంది.

ఒక్కొక్కరికి ఒక్కో విధంగా...  
కొత్త బంగారు లోకంలో ‘ఎకాడా...’ అంటూ శ్వేతబసుప్రసాద్‌ చెప్పిన, శ్రీమంతుడులో ‘ఊరికి ఎంతో కొంత ఇవ్వాలి. లేదంటే లావైపోతాము’ అంటూ శ్రుతిహాసన్‌ పలికించిన భావాలు అస్సలు మరిచిపోలేం. ఈ ఇద్దరికీ గాత్రదానం చేసింది డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ హరిత. ఇలియానా, తమన్నా, శ్రుతిహాసన్, నివేదాథామస్, రకుల్‌ప్రీత్‌సింగ్‌... ఇలా చాలామంది తారలకు ఆమె గాత్రదానం చేశారు. ఒక్కో నటితో దాదాపు రెండు, మూడు సినిమాలు చేసింది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా, సినిమా పాత్రలకు అనుగుణంగా గొంతును సవరించుకోవాల్సి ఉంటుందని చెప్పారు హరిత.

వర్షాకాలంలో ఇబ్బంది...  
నేను చాలామంది విలన్లకు డబ్బింగ్‌ చెప్పాను. టీవీ షోల్లోనూ నా గొంతు వినిపిస్తుంటుంది. డబ్బింగ్‌ ఆర్టిస్టులు గొంతును జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో జలుబు తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కో పాత్ర మాకు చాలెంజింగ్‌గా ఉంటుంది.  – డాక్టర్‌ రాధాకృష్ణారెడ్డి,డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌

సాంకేతిక దన్ను...  
డబ్బింగ్‌ స్టూడియోలన్నీ దాదాపు కృష్ణానగర్‌ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. ఒకప్పుడు డబ్బింగ్‌ చెప్పడం కష్టంగా ఉండేది. మూడు లైన్ల స్క్రిప్ట్‌ను ఒకే టేక్‌లో చెప్పాల్సి వచ్చేది. అప్పుడు వీడియో క్యాసెట్లు ఉండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ముక్కలు ముక్కలుగా చేసి, మాటలను అతికించేసి కనికట్టు చేస్తున్నారు. అంతటి సాంకేతికత ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. రికార్డింగ్, సింకింగ్, మిక్సింగ్‌.. ఇలా అన్నింటినీ ఇప్పుడు తేలికగా చేసే వీలుందని చెప్పారు సౌండ్‌ ఇంజినీర్‌ రాంరెడ్డి. ఇక డబ్బింగ్‌ కళాకారులకు ఇప్పుడు మంచి ఉపాధి లభిస్తోంది. సీన్ల వారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు మొదలు వివిధ రంగాల్లోని వారు డబ్బింగ్‌ చెప్పేందుకు ఆసక్తి చూపుతున్నారు.  

సులువేం కాదు..  
డబ్బింగ్‌ చెప్పడం సులువేం కాదు. సినిమాలోని పాత్రలు, అందులోని సందర్భం, డైరెక్టర్‌ ఆలోచనలకు అనుగుణంగా డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. ఒకే నటికి ఎక్కువసార్లు గాత్రదానం చేసినప్పుడు, ఆయా సినిమాల్లోని పాత్రలకు అనుగుణంగా చెప్పాల్సి వస్తుంది. డైలాగ్‌ చెప్పే రీతిని బట్టే, అది హిట్టవుతుంది.      – హరిత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌  

ఇప్పుడు ఈజీ...  
గతంతో పోలిస్తే డబ్బింగ్‌ రికార్డింగ్‌ ఇప్పుడు చాలా సులువైంది. గతంలో రికార్డింగ్‌ చేయాలంటే క్యాసెట్లతో చేయాల్సి వచ్చేది. అందులోనూ పెద్దపెద్ద డైలాగులు చెప్పాలంటే డబ్బింగ్‌ కళాకారులకు ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో ఈ సమస్య తీరింది.  – శేఖర్, సౌండ్‌ ఇంజినీర్‌

మరిన్ని వార్తలు