ట్రెండు మారినా.. ప్లేసు మారలే!

13 Jun, 2018 10:16 IST|Sakshi

ఆర్టిస్ట్‌లకు వెలుగుదారులు పరుస్తోన్న కృష్ణానగర్‌

త్రివిక్రమ్, రవితేజ, బ్రహ్మాజీ, సునీల్‌  తదితరుల ప్రస్థానం ఇక్కడినుంచే..  

 ఔత్సాహిక సినీ కళాకారులకు అడ్డాలుగా మంగ టిఫిన్‌ సెంటర్, గణపతి కాంప్లెక్స్‌    

పాతికేళ్లుగా ఎంతో మందికి సినిమా అవకాశాలు

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క చాన్స్‌.. వెండితెరపై తన బొమ్మ పడాలని కోరుకునేవారు కోకొల్లలు.తెలుగు రాష్ట్రాల్లో ఒక్క అవకాశం కోసం కలలు కనేవారికి ఆశల ద్వారం ‘కృష్ణానగర్‌’ ఒక్కటే. తాము కోరుకున్న కలల తీరం చేరాలంటే అక్కడ అడుగు పెట్టాల్సిందే. దశాబ్దాల సినీ ప్రస్థానంలో తారలు మారుతున్నారు.. సాంకేతిక పరిజ్ఞానం మారుతోంది.. మొత్తం మహానగరమే మారింది.. కానీకృష్ణానగర్‌కు వచ్చేవారి ఆలోచనల్లో ఏ మాత్రం మార్పులేదు. అదే కల.. ఒక్క ఛాన్స్‌.. ఆ అవకాశంవస్తే ‘చిన్న క్లోజ్‌’.. అంతే. కునుకు పడితే ఎక్కడ తమకు వచ్చే అవకాశం చేజారిపోతుందోనని కళ్లల్లో ఆర్క్‌లైట్లు వెలిగించుకుని ఎదురు చూస్తుంటారు. కడుపులో ఆకలి రొద చేస్తున్నా.. బతుకు రంగువెలుస్తున్నా సరే మొహానికి మేకప్‌ వేసుకునే అవకాశం ఎవరిస్తారా అని ఆశగా ఎదురు చూస్తుంటారు.

ఓ గణపతి కాంప్లెక్స్, మంగ టిఫిన్‌ సెంటర్, పూర్ణ టిఫిన్‌ సెంటర్, ప్రసాద్‌ ల్యాబ్స్, ఇందిరానగర్, జూనియర్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ కార్యాలయం.. ఆ చుట్టుపక్కల వీధులే.. భవనాల మెట్లే అడ్డాలుగా చేసుకొని ఒక్కో మెట్టూ ఎక్కించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఓ రవితేజ, త్రివిక్రమ్, సునీల్, బ్రహ్మాజీ.. సంపూర్ణేష్‌బాబు.. ఇలా ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ముద్దాడినవారే. ఇలాంటి వారే ఆదర్శం.. ఔత్సాహిక కళాకారులకు ఆశల స్వర్గంగా మారింది. అంతేనా.. అలనాటి ‘వేటగాడు’ చిత్రం నుంచి నేటి ‘సైరా’ సినిమా వరకూ కాల గమనంలో సాంకేతికంగా ఎన్నో మార్పులొచ్చాయి. నాటికి నేటికీ అవకాశాల్లోనూ, అందుకోసం వెదికే విధానంలోనూ భారీ మార్పులే చోటుచేసుకున్నాయి.సినీ రంగానికి సంబంధించి 24 క్రాఫ్ట్‌లే కాకుండా అదనంగా వచ్చిన విభాగాల్లోనూ భారీ మార్పులే వచ్చాయి.

బంజారాహిల్స్‌: సంపూర్ణేష్‌ బాబు.. సినిమా అవకాశాల కోసం ఎక్కడా చక్కర్లు కొట్టలేదు.. ఏ అడ్డాకు వెళ్లలేదు.. సోషల్‌ మీడియా విప్లవం ద్వారా రాత్రికి రాత్రే అభిమానులను సొంతం చేసుకున్నారు.. లక్షలాది మంది ఫాలోవర్లను తన ఫేస్‌బుక్‌లో లైక్‌ కొట్టేలా చేసుకున్నారు.. అదే అతడిని సినీ పరిశ్రమ వైపు నడిపించింది.. నవ్వుల స్టార్‌గా మార్చింది.. సంపూర్ణేష్‌బాబు ఒక్కడి విషయంలోనే కాదు.. దర్శకుడు భాస్కర్, నవ్వుల కార్యక్రమాలు వేదికగా అనేక మంది యువకులు ఇప్పుడు ప్రతీ ఒక్కరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీళ్లే కాదు మరెందరికో వేదికగా నిలిచి.. ఆర్టిస్ట్‌లకు వెలుగుదారులు పరుస్తోంది కృష్ణానగర్‌. ఒకప్పటి కృష్ణానగర్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయి. అవేంటో ఒకసారి తరచి చూస్తే..

గణపతి కాంప్లెక్స్‌..
ఉదయం 6 గంటల ప్రాంతం.. అక్కడున్న ఓ కాంప్లెక్స్‌ వద్దకు ఒక్కొక్కరు వచ్చి చేరుతున్నారు.. చూస్తుండగానే చాలా మంది అక్కడికి వచ్చి చేరారు.. అంతా కబుర్లలో మునిగిపోయారు.. కాస్త చెవులు అటు వైపుగా వేస్తే వినిపించేవి సినీ అవకాశాల కోసం తాము పడే పాట్లు.. సినిమాల్లో వచ్చిన అవకాశాలు.. తాను నటించిన సన్నివేశాలు.. తమకు దక్కిన ఛాన్సులు..  ఇలా ఉదయమే కాదు.. సాయంత్రం 6 గంటలకు అక్కడంతా ఇదే పరిస్థితి.. పాతికేళ్లుగా చాలా మంది సినీ వినీలాకాశంలో అవకాశం పొందడానికి, పొందినవారు ఇక్కడికి వస్తూనే ఉంటారు.. అవకాశాలు వచ్చిన వారు ప్లేస్‌ మార్చవచ్చు.. కానీ నేటి తరం ఔత్సాహిక సినీ కళాకారులకు అదే అడ్డా.. అదే గణపతి కాంప్లెక్స్‌.. అడ్డా నుంచి ఆడిషన్‌ లెవల్‌కు వెళ్లిన నాటి అవకాశాలు ప్రస్తుతం సోషల్‌ వైపు నడుస్తున్నాయి.

మంగ టిఫిన్‌ సెంటర్‌..
కాస్త అటుఇటుగా అర కిలోమీటర్‌ ముందుకు సాగితే మంగ టిఫిన్‌ సెంటర్‌. జూనియర్‌ ఆర్టిస్టులందరికీ అదొక హాట్‌స్పాట్‌.. ఈ అడ్డా మీదుగా చాలా మంది సినీపరి«శ్రమలో తమ అడుగులను వేసిన వారు ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ఆ అడ్డా అలాగే కళాకారుల కలయిక ప్రాంతంగా నిలుస్తోంది. అందరినీ ఆదరిస్తోంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. సినీ అవకాశాల కోసం పల్లెల నుంచి టౌన్‌ల నుంచి వచ్చే వారికి ఇలాంటి ప్రాంతాలు సినీ అవకాశాల వారధులుగా నిలుస్తున్నాయి.

చెరిగిపోని గుర్తులు..  
సారథి స్టూడియో, అన్నపూర్ణ, రామానాయుడు.. ఇలా పలు సినీ స్టూడియోలు అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లోకి రావడంతో సినీ అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఔత్సాహిక సినీ కార్మికులకు స్టూడియోల చుట్టుపక్కల ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. ఇలా దాదాపు పాతికేళ్లుగా ఇవి ఇప్పటికీ అవకాశాలను కల్పిస్తూనే ఉన్నాయి. దీంతో చాలా మంది గణపతి కాంప్లెక్స్, మంగ టిఫిన్‌ సెంటర్, పూర్ణ టిఫిన్‌ సెంటర్, ప్రసాద్‌ ల్యాబ్స్, ఇందిరానగర్, జూనియర్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ కార్యాలయం తదితర ప్రాంతాలను తమ అడ్డాలుగా మలుచుకున్నారు. ఇవి ఇప్పటికీ వీరిని ఆదరిస్తూనే ఉన్నాయి.

                                 ప్రసాద్‌ ఫిలిం ల్యాబ్‌
అటూ ఇటూగా మారింది..

సినీ అవకాశాల కోసం వచ్చే చాలా మంది తమ ఆవాసాలను కృష్ణానగర్, ఇందిరానగర్‌ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఒకవైపు స్టూడియోలు, ఆర్టిస్ట్‌ యూనియన్‌ కార్యాలయాలు, అవకాశాలు కల్పించే అడ్డాలు ఇలా అన్నీ చుట్టుపక్కల ఉండటంతో వారంతా వచ్చి ఇక్కడే నివసించేవారు. గతంలో త్రివ్రిక్రమ్, రవితేజ, బ్రహ్మాజీ, సునీల్‌ ఇలా చాలా మంది తమ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇరుకు గదుల్లో అవకాశాల కోసం ఇక్కడున్నవారే. ఇప్పుడు అడ్డాల వద్దకు వచ్చే వారి సంఖ్య తగ్గినా ఒకప్పటిలాగే ఇప్పటికీ వస్తున్న వారూ ఉన్నారు.

అంతా ‘సోషల్‌’యిజం
సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఒకప్పుడు ఆ డిషన్లు జరిగేవి. ఇందుకోసం పలు సినిమా కార్యా లయాలు ఔత్సాహిక సినీ కార్మికుల కోసం తలుపులు తెరుచుకునేవి. తనకు ఇలాగే దిల్‌ రాజు కార్యాలయంలో జరిగిన ఆడిషన్‌ ద్వారా సినిమా ల్లో అవకాశం వచ్చిందని చెబుతున్నారు వెంకటగిరికి చెందిన జూనియర్‌ ఆర్టిస్ట్‌ జమాల్‌. కానీ ప్రస్తు తం ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఆడిషన్స్‌ ద్వారా జరిగిన ఎంపిక ఇప్పుడు మారుతున్న కాలానికి, ట్రెండ్‌కు అనుగుణంగా మారిపోయింది. ఇందులో భాగంగానే ఎవరైనా అవకాశాల కోసం వెళ్తే యూట్యూబ్‌లో ఏమైనా సినిమాలున్నాయా.., షార్ట్‌ ఫిలిమ్స్‌ ఏమైనా చేశారా.. ఉంటే ఆయా వెబ్‌సైట్‌ లింక్‌ను పంపండి చూస్తామంటూ చెబుతున్నారు. మరోవైపు చాలా మంది ఇలానే సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇలానే సంపూర్ణేష్‌ బాబు సోషల్‌ మీడియా ద్వారా హీరో అయ్యారు. భాస్కర్‌ దర్శకుడయ్యారు. ఇలా ఇప్పుడంతా సోషల్‌గానే చాలా మంది అవకాశాలు దక్కించుకుంటున్నారు.

ఆ అడ్డాలో కలిస్తే ఆనందం..
సినిమా అవకాశాల కోసం ఇక్కడికి వచ్చే వారు చాలా మంది ఉంటారు. ముందుగా సినిమా అవకాశా>ల కోసం ప్రయత్నించే వారి అడ్డా ఎక్కడా అని చూస్తే గణపతి కాంప్లెక్స్‌ కనిపిస్తుంది. అక్కడికి రావడం వల్ల పలానా సినిమా ప్రారంభమవుతుందని, అవకాశాలున్నాయని తెలుస్తుంది. దీనివల్ల సినిమా అవకాశాలు దక్కించుకోవచ్చు. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమవుతుందని ఈ అడ్డాలు చెబుతుంటాయి. ఇక్కడి నుంచి సినీ పరిశ్రమలో చాలా మందికి అవకాశాలు వచ్చాయి. దాదాపు పదిహేనేళ్లుగా గణపతి కాంప్లెక్స్‌ ప్రాంతంతో నాకు అనుబంధం ఉంది.     – కాదంబరి కిరణ్, సినీనటుడు

అవకాశాలను సృష్టించుకోవాలి..
సినిమా అవకాశాల కోసం నేను చాలా కాలం ప్రయత్నించాను. ఒకప్పుడు సినిమా కార్యాలయాల చుట్టూ తిరిగేవాడిని. ఆడిషన్స్‌ జరిగితే అవకాశం, అదృష్టం పరీక్షించుకొనేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆడిషన్స్‌ జరగడం లేదు. చిన్నచిన్న యూట్యూబ్‌ వేదికగా చేసేటువంటి ఫిలింలు, షార్ట్‌ఫిల్మ్‌లు మన అవకాశాలను మారుస్తున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా మనల్ని మనం ఇప్పుడు హీరోలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు అవకాశాలు కూడా అలానే వస్తున్నాయి. – జమాల్, సినీ ఆర్టిస్ట్‌

మరిన్ని వార్తలు