బాలీవుడ్‌ లేడీస్‌

26 Nov, 2019 03:23 IST|Sakshi
కియారా అద్వానీ, పరిణీతీ చోప్రా, జాన్వీ కపూర్‌

టైటిల్‌ కార్డ్స్‌లో ఫస్ట్‌ హీరో పేరే పడుతుంది. ఆ తర్వాతే హీరోయిన్‌ది. కథ హీరో చుట్టూ తిరుగుతుంది. హీరోయినేమో హీరో చుట్టూ తిరుగుతుంది. హీరో విలన్‌తో ఫైట్‌ చేస్తే, హీరోతో హీరోయిన్‌ డ్యూయెట్‌ పాడుతుంది. ఒకప్పుడు కథని లాగాలంటే హీరోనే కావాలి అన్నట్టుండేది పరిస్థితి. కానీ ప్రతీ జనరేషన్‌లో కొందరు హీరోయిన్లు ఆ విధానాన్ని బ్రేక్‌ చేయడానికి ప్రయత్నించారు. స్టీరింగ్‌ తమ చేతుల్లోకి తీసుకొని సోలో సినిమాలు చేశారు. ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించారు.

లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసే ముందు తమకో మార్కెట్‌ను సృష్టించుకున్నారు. ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలు చేశారు.  కానీ ప్రస్తుతం బాలీవుడ్‌ యంగ్‌ జనరేషన్‌లో ఓ నలుగురు హీరోయిన్లు నాలుగు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను సెట్స్‌ మీదకు తీసుకెళ్లారు. ఆ నలుగురిలో ఒక్క పరిణీతీ చోప్రా మినహా మిగతా ముగ్గురు కెరీర్‌లో ఇంకా బుడిబుడి అడుగులే వేస్తున్నారు. అయినా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయడానికి సిద్ధపడ్డారు. సగం రిస్క్‌ అనుకుంటే మిగతా సగం మారుతున్న ఆడియన్స్‌ టేస్ట్‌ అనుకోవచ్చు. బాలీవుడ్‌లో లీడ్‌ క్యారెక్టర్స్‌కి సై చెప్పి, లీడింగ్‌ లేడీస్‌ అయిన తారల విశేషాలు...

సక్సెస్‌ సక్సేనా...
తొలి మహిళా పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గాళ్‌’. ‘ధడక్‌’తో కథానాయికగా పరిచయమై, రెండో సినిమాకే లేడీ ఓరియంటెడ్‌ సినిమా ఒప్పుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు జాన్వీ కపూర్‌. గుంజన్‌ సక్సేనాకు, జాన్వీకు ఓ పోలిక పెట్టొచ్చు. గుంజన్‌ సక్సేనా పైలెట్‌ అవ్వాలి, గాల్లో విహరించాలి అని కలలు కన్నారు. అవన్నీ ఉత్తి గాలి మాటలు అనుకున్నారు. ‘అమ్మాయిలు పైలెట్‌ కాలేరు’ అని ఆమెను తేలికగా తీసుకున్నారు.  కానీ గుంజన్‌ తన కలను సీరియస్‌గా తీసుకున్నారు. పట్టుదలతో పైలెట్‌గా మారారు. యుద్ధ విమానాన్ని నడిపిన తొలి పైలెట్‌గా చరిత్రలో నిలిచిపోయారు.

తను విహరించిన ఫ్లైట్‌ నుంచి చూస్తే తనని హేళన చేసిన వాళ్లు కనిపించి కూడా ఉండరు. ఇది ఆమె సక్సెస్‌.  జాన్వీకి నటిగా ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది. ఈ సినిమా ఎంచుకున్నప్పుడు ‘సేఫ్‌ గేమ్‌ ఆడుకోవచ్చుగా. అప్పుడే సోలో సినిమానా!’ అనే సెటైర్లూ వినిపించాయి. జాన్వీ తన రోల్‌ని సీరియస్‌గా తీసుకున్నారు. పైలెట్‌గా ట్రైనింగ్‌ తీసుకున్నారు. తన నిర్ణయం కరెక్టో కాదో వచ్చే ఏడాది మార్చి 13న తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన లుక్‌కి మాత్రం మంచి స్పందన వచ్చింది. ఆ విధంగా ప్రస్తుతానికి జాన్వీ సక్సెస్‌ అయ్యారు. శరణ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు.

టీనా.. కెటీనా అయింది
కొందరికి చేతి నిండా ఉంగరాలుంటాయి. ఏంటీ అంటే మా జ్యోతిష్కుడు చెప్పాడంటారు. పేరులో ఒక అక్షరం పెరుగుతుంది. ఎందుకు? అంటే మళ్లీ అదే కారణం.  మూఢ నమ్మకాల మీద సెటైరికల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కెటీనా’. మూఢ నమ్మకాల్ని నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారు.

అందుకే ఈ కథ అంటున్నారు దిశా పటానీ. ఏక్తా కపూర్‌ నిర్మాణంలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆషిమా చిబ్బర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మూఢ నమ్మకలను పాటించే టీనా అనే టీనేజ్‌ అమ్మాయిగా దిశా కనిపిస్తారు. వాస్తవానికి తన పేరు టీనా. పేరుకి ముందు కె కలిపితే కలిసొస్తుందని జోత్యిష్కుడు చెబుతాడు. దాంతో టీనా కాస్తా కెటీనా అవుతుంది. హాట్‌ క్యారెక్టర్స్‌లో కనిపించే దిశా పటానీ ఇందులో ఓ మధ్య తరగతి అమ్మా యిలా కనిపిస్తారట.  

డబుల్‌ ధమాకా
పరిణీతీ చోప్రా హీరోయిన్‌గా మారి ఎనిమిదేళ్లు కావస్తోంది. డజన్‌ సినిమాల వరకూ చేశారు. కెరీర్‌లో తొలిసారి లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేస్తున్నారు. ఒకటి కాదు ఏకంగా రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో బిజీగా ఉన్నారామె. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా’. ఇందులో సైనా పాత్ర చేస్తున్నారు పరిణీతి. సైనాగా మారడానికి శిక్షణలో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే బ్యాడ్మింటన్‌ ఆడుతూ గాయపడ్డారు కూడా.

వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్‌ కానుంది. అలాగే ‘ది గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌’ అనే సినిమా చేస్తున్నారు. అదే టైటిల్‌తో వచ్చిన ఇంగ్లీష్‌ సినిమాకి ఇది హిందీ రీమేక్‌. ఈ సినిమాలోనూ పరిణీతీ చోప్రానే లీడింగ్‌ లేడీ. రిబ్బు దాస్‌ గుప్తా దర్శకుడు. ఇందులో పరిణీతితో పాటు అదితీ రావ్‌ హైదరీ, కృతీ కుల్హరీ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇలా ఒకేసారి రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్నారు పరిణీతీ చోప్రా.

నెట్‌లో పడతాడా?
‘పదహారూ ప్రాయంలో నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి. నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి...’  అని పాడుతున్నారు ఇందూ. తనకి తగినవాడు, తన బాయ్‌ఫ్రెండ్‌ దొరికే వరకూ డేటింగ్‌ యాప్స్‌ అన్నీ తెగ వెతికేస్తున్నారు. ఇంటర్‌నెట్‌ను వడకడుతున్నారు. మరి డేటింగ్‌ యాప్స్‌లో ఆమె వేసిన నెట్‌లో ఎవరు పడతారు? ఎలా పడతారు? అనేది సినిమా కీలకాంశం. డేటింగ్‌ యాప్స్‌ వల్ల ఇబ్బందులు పడే ఇందూగా కియారా అద్వానీ ఓ సినిమా చేస్తున్నారు. ‘ఇందూ కీ జవానీ’ టైటిల్‌. ఆల్రెడీ షూటింగ్‌ కూడా కంప్లీట్‌ అయింది. వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి అబిర్‌సేన్‌ గుప్త దర్శకుడు.

లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ హిట్‌ అయితే మరికొన్ని సినిమాలు వస్తాయి. ఆ హిట్‌ సినిమాలో ఉన్న హీరోయిన్‌ తన భూజాల మీద సినిమాని మోయగలదని నిరూపించుకుంటుంది. మరి.. బలనిరూపణలో ఈ నలుగురు తారలు ఎంత స్కోర్‌ చేస్తారనేది తెలియడానికి కాస్త టైమ్‌ ఉంది. ఏది ఏమైనా ధైర్యంగా ఒప్పుకున్నారు కాబట్టి.. కమర్షియల్‌ సినిమాలకు ప్యారలల్‌గా లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ కూడా వచ్చేంత మార్కెట్‌ వారికి ఏర్పడాలని ఆశిద్దాం.
– గౌతమ్‌ మల్లాది

∙దిశా పటానీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా