శ్రీశ్రీశ్రీ లేడీ ప్రొడ్యూసర్స్‌

8 Apr, 2019 23:06 IST|Sakshi

కుందనపు బొమ్మలే కాదు..ఇప్పుడు బొమ్మా బొరుసూ కూడా.బొమ్మ తయారవ్వడానికి కావాల్సి నంత లక్ష్మిని కటాక్షిస్తున్నారు.ఇదిగో వచ్చారు.. శ్రీశ్రీశ్రీ లేడీ ప్రొడ్యూసర్స్‌.

పారితోషికం తీసుకోవడమే కాదు.. ఇస్తాం కూడా అంటున్నారు అందాల నాయికలు. నటన మీద ఆసక్తితో సిల్వర్‌ స్క్రీన్‌ కనపించడంతో పాటు మేకింగ్‌ మీద ఇంట్రస్ట్‌తో నిర్మాతలుగా మారుతున్నారు. కథానాయికలు నిర్మాతలుగా మారడం కొత్త విషయం ఏం కాదు. కొత్తగా ఈ తరంలో  కొందరు కథానాయికలు తమ పేర్లను రిజిష్టర్‌ చేయించుకున్నారు. అలా నిర్మాతలుగా అడ్వాన్సులు ఇవ్వడానికి సిద్ధపడిన ప్రొడ్యూసరమ్మల గురించి తెలుసుకుందాం.

సినిమాలు లేక కాదు
సౌత్‌లో కథానాయికగా కాజల్‌ సూపర్‌ సక్సెస్‌. ‘మగధీర, బృందావనం, డార్లింగ్, మిస్టర్‌ ఫర్‌పెక్ట్, బిజినెస్‌మేన్, తుపాకీ’ ఇలా... చెప్పుకుంటూ పోతే కాజల్‌ కథానాయికగా నటించిన హిట్టు సినిమాల లిస్ట్‌ పెద్దదే. రెండేళ్ల క్రితం ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో నాయికగా 50వ చిత్రం మైలురాయిని కూడా చేరుకున్నారు. ఇండస్ట్రీలో ఇంత సాధించిన కాజల్‌ ఇక ప్రొడ్యూసర్‌గా సత్తా చాటాలనుకుంటున్నారు. అందుకే ప్రొడక్షన్‌ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. గతేడాది ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ సినిమాకు కాజల్‌ నిర్మాతగా మారనున్నారని సమాచారం. 50 సినిమాలు చేసింది కదా.. ఇక హీరోయిన్‌గా అవకాశాలు లేక నిర్మాతగా మారుతుందేమో అనుకుంటున్నారా? అంటే అలాంటిదేం లేదండీ బాబు. కాజల్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. నటిగా ప్రస్తుతం ఆరేడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. 

మనసు గెలవాలని..
ఇండస్ట్రీలో తాను సంపాదించిన సొమ్మును ఇండస్ట్రీలోనే పెడుతున్నందుకు రొంబ (చాలా) హ్యాపీ అని అమలాపాల్‌ అంటున్నారు. అవును... ఆమె నిర్మాతగా మారారు. అనూప్‌ ఫణిక్కర్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తమిళంలో ‘కడవేర్‌’ అనే ఇన్విస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ చిత్రం రూపొందుతోంది. ఈ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తూనే నిర్మాతగాను వ్యహరించేందుకు రెడీ అయ్యారు అమలాపాల్‌. కేరళ పోలీస్‌ శాఖకు చెందిన ఫోరెన్సిక్‌ సర్జన్‌ బి. ఉమాదతాన్‌ జీవితంలో జరిగిన ఓ కేసు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఫోరెన్సిక్‌ పాథాలజిస్ట్‌గా నటిస్తున్నారు అమలాపాల్‌. ఆడియన్స్‌ మనసు గెలుచుకునే స్క్రిప్ట్‌ కాబట్టి ఈ చిత్రం ద్వారా నిర్మాతగా కూడా వారి మనసు గెలవాలనుకుంటున్నాని అమలా పాల్‌ పేర్కొన్నారు. ఇటు హీరోయిన్‌గానూ ఆమె కెరీర్‌ ఫుల్‌ రైజింగ్‌లోనే ఉంది.

తండ్రి బాటలో...
కమల్‌హాసన్‌ కూతురిగా శ్రుతీహాసన్‌ ఇండస్ట్రీకి పరచయం అయ్యారు కానీ తక్కువ కాలంలోనే తానేంటో ప్రూవ్‌ చేసుకుని సొంత ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు శ్రుతీహాసన్‌. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాదు వీలైనప్పుడు సంగీతంలోనూ తన ప్రావీణ్యతను చాటుతున్నారు శ్రుతి. కొత్త కథలను, కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించడానికి ఆమె నిర్మాతగా మారారు. 2017లో తమిళంలో ‘లెన్స్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి ప్రశంసలు అందుకున్నారు జయప్రకాష్‌ రా«ధాకృష్ణన్‌. ఆ తర్వాత  ‘ది మస్కిటో ఫిలాసఫీ’ అనే సినిమా తీశారు. ఈ సినిమా చూపి ఇంప్రెస్‌ అయిన శ్రుతీహాసన్‌ రిలీజ్‌ చేయడానికి రెడీ అయ్యారు. ఇలా నిర్మాతగా మారారు. ఇదిలా ఉంటే.. కమల్‌హాస రాజ్‌ కమల్‌ఫిల్మ్స్‌ ఇంటర్‌నేషనల్‌ బేనర్‌పై సినిమాలు నిర్మిస్తుంటారని తెలిసిందే. చిన్నప్పటి నుంచి తండ్రిని చూశారు కదా. అలా యాక్టింగ్, ప్రొడక్షన్‌ను రెంటినీ  బ్యాలెన్స్‌ చేస్తూ శ్రుతీ తండ్రి బాటలో నడుస్తున్నట్లున్నారు.

డైరెక్షన్‌ మారింది
డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అందుకే టాలీవుడ్, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా టాప్‌ యాక్టర్స్‌ అందరూ ఎంటర్‌టైనింగ్‌ డిజిటల్‌ సెక్టార్‌ వైపు కన్నేశారు. ఈ జాబితాలో రజనీకాంత్‌ కుమార్తె సౌందర్యా రజనీకాంత్‌ కూడా ఉన్నారు. కానీ యాక్టింగ్‌ పరంగా కాదు. నిర్మాతగా. 2010లోనే ‘గోవా’ అనే సినిమాను నిర్మించిన సౌందర్యా రజనీకాంత్‌ తాజాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే ప్రముఖ తమిళ నవల ఆధారంగా ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ‘కొచ్చాడియన్‌’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసిన సూర్యప్రతాప్‌ దర్శకుడు. అన్నట్లు ‘కొచ్చాడియన్‌’ సినిమాకు సౌందర్యా రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బావ ధనుష్‌ హీరోగా ‘వీఐపీ 2’ చిత్రానికి దర్శకత్వం వహించారు సౌందర్య. అయితే దర్శకురాలిగా రెండు వైఫల్యాలను చవిచూడటంతో నిర్మాణం వైపు డైరెక్షన్‌ మార్చారేమో!

హిందీ హిట్‌ ‘క్వీన్‌’ చిత్రం సౌత్‌లో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు పరుల్‌ ఒక నిర్మాతగా ఉన్నారు. కన్నడ రీమేక్‌ ‘బటర్‌ఫ్లై’లో పరుల్‌ యాదవ్‌ కథానాయికగా నటించారు. విశేషం ఏంటంటే.. ‘క్వీన్‌’ సౌత్‌ రీమేక్‌లన్నింటికి సహ–నిర్మాతల లిస్ట్‌లో కన్నడ బ్యూటీ పరుల్‌ యాదవ్‌ పేరు ఉంది. సో... పరుల్‌ కూడా ప్రొడక్షన్‌లోకి వచ్చినట్లే. టాలీవుడ్‌లో సమంత ఎంత పెద్ద స్టార్‌ హీరోయిన్‌నో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే... డైరెక్షన్‌ పట్ల తనకు పెద్దగా ఆసక్తి లేదని భవిష్యత్‌లో నిర్మాణ రంగంవైపు దృష్టి పెట్టాలనే ఆలోచన మాత్రం ఉందని ఓ సందర్భంలో సమంత చెప్పుకొచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోయిన్‌ నిహారిక కొణిదెల కూడా ప్రొడక్షన్‌వైపు తనకు ఆసక్తి ఉందన్నారు. ఆల్రెడీ వెబ్‌ సిరీస్‌లను ప్రొడ్యూస్‌ చేస్తున్నానని, భవిష్యత్‌లో సినిమాలను కూడా ప్రొడ్యూస్‌ చేసే ఆలోచన ఉందని ఇటీవల చెప్పారు.

చార్మింగ్‌ ప్రొడ్యూసర్‌
తెలుగుతెరపై కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్నారు నటి చార్మీ. ‘మాస్, అనుకోకుండా ఒకరోజు, మంత్ర’ వంటి హిట్‌ చిత్రాలు కథానాయికగా ఆమె లిస్ట్‌లో ఉన్నాయి. ఆ తర్వాత హీరోయిన్‌గా కెరీర్‌లో కాస్త స్లో అయ్యారు. కానీ నిర్మాతగా జోరు పెంచారు చార్మీ. ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాల (రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ఆకాశ్‌ పూరి ‘రొమాంటిక్‌’) నిర్మాణాన్ని చూసుకుంటూ ‘చార్మింగ్‌ ప్రొడ్యూసర్‌’ అనిపించుకుంటున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పూరీ కనెక్ట్స్‌తో కలిసి ఆమె ఈ సినిమాలను నిర్మిస్తున్నారు. 2017లో వచ్చిన ‘రోగ్‌’ సినిమాకు తొలిసారి కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ‘పైసా వసూల్, మెహబూబా’ సినిమాలకు కూడా ఆమె నిర్మాణ బాధ్యతలను నిర్వహించారు. ఆ అనుభవంతో ఒకేసారి ‘ఇస్మార్ట్‌ శంకర్, రొమాంటిక్‌’ చిత్రాల నిర్మాణాన్ని చాకచక్యంగా చూసుకుంటున్నారని చెప్పొచ్చు.

బాలీవుడ్‌లో అగ్రకథానాయికలుగా ఎదిగిన ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ ఆల్రెడీ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్టార్ట్‌ చేసి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ‘వెంటిలేటర్‌’ అనే చిత్రానికి ప్రియాంకా చోప్రా అయితే నిర్మాతగా జాతీయ అవార్డును కూడా తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ నిర్మాతగా మారారు. ఢిల్లీకి చెందిన యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా ‘రాజీ’ ఫేమ్‌ మేఘన్‌ గుల్జార్‌ దర్శకత్వంలో ‘చప్పాక్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లక్ష్మి పాత్రలో దీపికా పదుకోన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే నిర్మాతగా మారారు దీపికా పదుకోన్‌. ఇక ఇప్పుడిప్పుడే నటిగా పైకొస్తున్న స్వరా భాస్కర్‌ కూడా నిర్మాతగా మారారు. ‘‘తను వెడ్స్‌ మను, తను వెడ్స్‌ మను రిటర్న్స్, ఎక్స్‌: పాస్ట్‌ అండ్‌ ప్రజెంట్, వీరే ది వెడ్డింగ్‌’’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు స్వర. ఆమె తన తమ్ముడు ఇషాన్‌ భాస్కర్‌తో కలిసి ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్టార్ట్‌ చేశారు. కొత్త కథలను, కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికే నిర్మాతగా మారాను అని స్పష్టం చేశారు స్వరాభాస్కర్‌. మరో యువనటి రీచా చద్దా కూడా నిర్మాతల జాబితాలో చేరారు. ఫుక్రే, మసాన్‌ వంటి సినిమాల్లో నటించిన రీచా చద్దా ఇటీవల షకీలా బయోపిక్‌లో నటించారు. ‘‘హీరోయిన్లు కెమెరా ముందు నటించడానికి మాత్రమే కాదు. డైరెక్షన్, రైటింగ్, ప్రొడక్షన్‌ ఇలా అన్ని క్రాఫ్ట్స్‌లో సత్తా చాటగలరు’’ అని రీచా పేర్కొన్నారు. ఇక బాలీవుడ్‌ బ్యూటీ కంగానా రనౌత్‌ కూడా ప్రొడక్షన్‌ ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ కథానాయికగా ఉన్న కంగనా ఇటీవల ‘మణికర్ణిక:ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రంలో కొన్ని సన్నివేశాల కోసం మెగాఫోన్‌ పట్టిన సంగతి తెలిసిందే. అలాగే కన్ఫార్డ్మ్‌గా చెప్పలేదు కానీ సోనమ్‌ కపూర్, ఆలియా భట్‌ కూడా భవిష్యత్‌లో ప్రొడక్షన్‌ వైపు అడుగులు వేసే ప్లాన్‌లో ఉన్నట్లు మాత్రం చెబుతున్నారు. 
– ముసిమి శివాంజనేయులు

మరిన్ని వార్తలు