‘నేను చేసిన ఒకే ఒక తప్పు... అతణ్ణి నమ్మడం’...

15 Feb, 2019 00:01 IST|Sakshi

మరో పిక్‌

మన దగ్గర కౌంటర్‌ స్టేట్‌మెంట్లు, కథనాలు ఉంటాయి గానీ సినిమాలు ఉండటం తక్కువ. ఒక సినిమాకు పోటీగా మరో సినిమా రావచ్చుగానీ ఒక సినిమాకు కౌంటర్‌గా మరో సినిమా రావడం ‘లక్ష్మీస్‌ ఎన్‌.టి.ఆర్‌’తో చూడనున్నాం. ఎన్‌.టి.ఆర్‌ బయోపిక్‌గా ‘కథా నాయకుడు’, ‘మహా నాయకుడు’ పేర్లతో రెండు సినిమాలు సిద్ధమయ్యాయి. వీటిలో ఒకటి రిలీజైంది. మరొకటి కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాలో ‘సత్యం మరుగున పడింది’ అని ‘లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌’ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అభిప్రాయం. తెలుగుదేశం పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రి అయ్యి, రాష్ట్రాన్ని తెలుగు భాషను వెలిగించిన నాయకుడు తన పదవిని, పార్టీని ఎందుకు కోల్పోయాడు? ఆ నెపం ఆయన రెండో భార్య అయిన లక్ష్మీపార్వతి మీద వేసి ఎవరెవరు లబ్ధి పొందారు... ఈ వివరాలు ఎన్‌.టి.ఆర్‌ రెండు భాగాల బయోపిక్‌లో లేదని రామ్‌గోపాల్‌ వర్మ భావించాడు. అందుకే అసలు లక్ష్మీపార్వతి దృష్టికోణం నుంచి ప్రపంచానికి తెలియాల్సిన కథను చెప్పాలని ఈ సినిమా తీసినట్టుగా ఎన్‌టీఆర్‌ అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా వల్ల మొదటి వరుసలో నిలువబోయే పాత్ర నారా చంద్రబాబు నాయుడిది కావడం సహజం. ‘పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడని’ ఆయన విమర్శను ఎదుర్కొని ఉన్నాడు. ఎన్‌టీఆర్‌ ఆయన వల్ల చాలా అవమానాలు, బాధలు పడ్డాడని లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకాల వల్ల, ఇంటర్వ్యూల వల్ల తెలుస్తున్నది.

ఇవన్నీ సగటు ప్రేక్షకుడికి సినిమా మీడియా ద్వారా శక్తిమంతంగా తెలిసే అవకాశం ఈ సినిమాతో రానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ యూట్యూబ్‌లో గురువారం విడుదల అయితే సాయంత్రానికి హిట్లు దాదాపు పాతిక లక్షలకు చేరుకున్నాయి. దీనిని బట్టి జనం సత్యం తెలుసుకోవడానికి ఏ స్థాయి కుతూహలంతో ఉన్నారో అర్థమవుతున్నది. 1989లో ఎన్‌టీఆర్‌ ఎన్నికలలో ఓడిపోయాక ఆయన అనుభవించిన ఒంటరి తనం, ఆ సమయంలోనే లక్ష్మీపార్వతి ఆయన ఆత్మకథ రాయడానికి ఆయన సమక్షానికి చేరడం, ఆయన భాగస్వామి కావడం, ఫలితంగా మీడియాలో ఎన్‌టిఆర్‌కు వ్యతిరేకంగా ‘విష ప్రచారాన్ని’ నడిపించడం ఇవన్నీ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. పాత్రలు నిజ పాత్రలను పోలి ఉండటం, గొంతులను కూడా అనుకరించడం వల్ల నిజమైన కథను చూస్తున్న భ్రాంతిని కలిగించాడు దర్శకుడు. ‘నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు అతణ్ణి నమ్మడం’ అని చంద్రబాబును సూచిస్తూ ఎన్‌టీఆర్‌ చెప్పే డైలాగుతో ట్రైలర్‌ ముగిసింది. కనుక ఇది చంద్రబాబు వాస్తవ రూపంపై దృష్టి పెట్టవచ్చని ఈ ట్రైలర్‌కు ప్రతిస్పందనగా కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రధారిగా పి. విజయ్‌ కుమార్, లక్ష్మీపార్వతి పాత్రధారిగా యజ్ఞాశెట్టి, చంద్రబాబునాయుడు పాత్రధారిగా శ్రీతేజ కనిపిస్తారు. ఎన్టీఆర్‌ పాత్రకు మ్యూజిక్‌ డైరెక్టర్, రైటర్, సింగర్‌ విశ్వ డబ్బింగ్‌ చెప్పారు. ఇంకా మనకు తెలిసిన చాలా పాత్రలు కథలో ఉన్నాయి. మొత్తం మీద సంచలనం మొదలైంది. సినిమా రిలీజయ్యేంత వరకూ ఈ సంచలనం ముగియదు.

ప్రజలు అమాయకులు కాదు: లక్ష్మీపార్వతి
ప్రపంచం ఎప్పుడూ నిజాన్ని గౌరవిస్తుంటుంది అనడానికి నిన్న కాక మొన్న విడుదలైన ‘యాత్ర’ ఒక నిదర్శనం. నిజమైన నాయకునికి ఎప్పటికీ మరణం ఉండదని ఆ సినిమా నిరూపించింది. అలాగే ఈ రోజు విడుదలైన ‘లక్ష్మీస్‌ యన్‌.టీ.ఆర్‌’ ట్రైలర్‌కు వచ్చిన స్పందన కూడా నిజం పట్ల జనం చూపిస్తున్న గౌరవమే అని అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో ఫోన్‌లు వస్తున్నాయి. విడుదలైన మొదటి గంటలోనే పదిలక్షల మంది చూశారట. సాయంత్రానికల్లా 25 లక్షల మంది వరకు చూశారంటున్నారు. ఎన్‌.టి.ఆర్‌ చనిపోయి 23 ఏళ్లయినా ఆ మహానాయకుని నిజమైన చరిత్ర గురించి ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రజలు అమాయకులు కాదు, లేటయినా నిజాన్ని ఎప్పుడూ ఆదరిస్తారు అని చెప్పటానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందంగా ఉంది. టీజర్‌లో నా పాత్ర చేసిన అమ్మాయి నటన బాగుంది. 

మరిన్ని వార్తలు