పదికిపైగా రీమేక్‌ సినిమాలపై స్పెషల్‌ స్టోరీ

2 Apr, 2019 00:04 IST|Sakshi

మేకింగ్‌ బాగుంటే మళ్లీ టేకరా?
టేకకుండా ఉండగలరా?
కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అంటారు.
అదే.. మేకింగు.. టేకింగు.
పదికి పైగా రీమేక్‌ సినిమాలపై స్పెషల్‌ స్టోరీ

గతంలో తమిళం నుంచి తెలుక్కు తీసే దర్శకులు విడిగా ఉండేవారు. రవిరాజా పినిశెట్టికి రీమేక్‌ కింగ్‌ అని పేరు. ఆయన తమిళంలో హిట్‌ అయిన సినిమాలను తెలుగులో  రీమేక్‌ చేసి బాగా హిట్‌ చేశారు. దర్శకుడు రాజా చంద్ర, కోడి రామకృష్ణ వంటి దర్శకులు రీమేక్‌లను సక్సెస్‌ చేశారు. ఈ మధ్యకాలంలో భీమినేని శ్రీనివాసరావుకు కూడా రీమేక్‌ డైరెక్టర్‌గా మంచి పేరు ఉంది. కాని అన్నిసార్లు అన్ని రీమేకులు హిట్‌ కావు. పరభాషలో భారీ హిట్టయ్యి ఇక్కడ ఫట్టుమన్నవి ఉన్నాయి. అలాగే అక్కడకన్నా కూడా ఇక్కడ ఇంకా హిట్‌ అయిన దాఖలాలు ఉన్నాయి. గతంలో తమిళంలో 200 రోజుల ఆడిన భారతీ రాజా సినిమా ‘కడలోర కవిదైగళ్‌’ తెలుగులో చిరంజీవితో ‘ఆరాధన’గా తీస్తే ప్రేక్షకులు నిరాకరించారు. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన ‘ఆటోగ్రాఫ్‌’ను తెలుగులో రవితేజతో ‘ఆటోగ్రాఫ్‌ స్వీట్‌మెమొరీస్‌’గా తీస్తే కమర్షియల్‌ సక్సెస్‌ రాలేదు. కన్నడలో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన ‘యోగి’ తెలుగులో ప్రభాస్‌తో ‘యోగి’గా తీస్తే కలెక్షన్లు వీగిపోయాయి. తమిళంలో చాలా మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ‘మంజపై’ తెలుగులో దాసరి ‘ఎర్రబస్సు’గా తీస్తే అంత మంచి రెస్పాన్స్‌ రాలేదు. కాని రీమేక్‌లు చేసినప్పుడల్లా ఘన విజయం సాధించిన కొన్ని సినిమాలు రీమేక్‌లను సజీవంగానే నిలబెడుతుంటాయి. ఈ ఏడాది కూడా కొన్ని రీమేక్స్‌ తయారవుతున్నాయి.

వారిద్దరి తమిళ మేజిక్‌
తమిళంలో ఘనవిజయం సాధించిన సినిమా ‘96’. విజయ్‌ సేతుపతి, త్రిష నటించిన ఆ సినిమా క్లాస్‌ మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇది రీమేక్‌కు లొంగదని చాలామంది అన్నారు కాని మంచి కథ తప్పకుండా నచ్చుతుంది అని నిర్మాత ‘దిల్‌’ రాజు రంగంలోకి దిగారు. తమిళంలో దర్శకత్వం వహించిన దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్‌ తెలుగులో కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు. శర్వానంద్, సమంత జంట. పాఠశాలలో విడిపోయిన ప్రేమికులు జీవితంలో కొంతదూరం ప్రయాణించిన తర్వాత మళ్లీ కలిసినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మంచి ఫీల్‌గుడ్‌ మూవీగా తమిళ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది ‘96’. ఈ కథను రీమేక్‌ చేస్తే రిస్కేమో అనుకోకుండా మంచి కథను తెలుగువారికి చూపించాలని శర్వానంద్‌ ఈ సినిమా ఒప్పుకున్నారు. శర్వా చేయబోతున్న తొలి రీమేక్‌ మూవీ ఇదే. కాగా, సమంత ఇప్పటికే ‘యుటర్న్‌’ రీమేక్‌లో నటించారు. అలాగే కొరియన్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’ ఆధారంగా రీమేక్‌ అయిన ‘ఓ బేబి: ఎంత సక్కగున్నావే’ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆ వెంటనే ‘96’ రీమేక్‌ షూట్‌తో బిజీ అవుతారు సమంత. రిస్క్‌ చేయడానికి వెనకాడని సమంత ‘96’ని ఇçష్టంగా ఒప్పుకున్నారు.  

అట్లీ ఎఫెక్ట్‌
తమిళంలో అట్లీ చాలా పేరున్న దర్శకుడు. ఇతని సినిమాలు తెలుగులో డబ్‌ అవుతూ ఉంటాయి. నయనతార, ఆర్య నటించిన ‘రాజా రాణి’ తెలుగులో కూడా మార్కులు కొట్టేసింది. ఇతని ‘మెర్సల్‌’ తెలుగులో ‘అదిరింది’గా విడుదలైంది. ఇది తమిళనాడులో ‘జిఎస్‌టి’ని విమర్శించిన సినిమాగా వార్తలకెక్కింది. విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన మరో సినిమా ‘తేరి’. ఇది తెలుగులో ‘పోలీసోడు’ గా విడుదలైంది కాని టైటిల్‌ కాంట్రవర్సీ కారణంగా ఎవరి దృష్టీ పడలేదు. కాని ఇది మంచి కథ కనుక తెలుగు రీమేక్‌ జరుగుతోంది. రవితేజ హీరో. ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కనక దుర్గ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది. విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందట.  

కొత్త వాల్మీకి
తమిళంలో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన హిట్‌ సినిమా ‘జిగర్తండా’ (2014). సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీమీనన్‌ ముఖ్య తారలుగా నటించారు.  ‘ఎఫ్‌ 2: ’ సక్సెస్‌తో హుషారుగా ఉన్న వరుణ్‌ తేజ్‌ దీని రీమేక్‌ అయిన ‘వాల్మీకి’లో నటించడానికి రెడీ అయ్యారు. హారీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తారు. అక్కడ బాబీ సింహా పోషించిన పాత్రను ఇక్కడ వరుణ్‌ తేజ్‌ చేయనున్నారు. సిద్ధార్థ్‌ పాత్రలో నటించడానికి తమిళ నటుడు అథర్వ, నాగశౌర్య, శ్రీ విష్ణు పేర్లు ఇప్పటివరకు తెరపైకి వచ్చాయి. కథ ప్రకారం వరుణ్‌ తేజ్‌ నెగటివ్‌ షెడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తారు. డబ్‌ స్మాష్‌ సంచలనం మృణాళిని కథానాయికగా నటించనున్నారట.

సైకో వర్సెస్‌ పోలీస్‌
తమిళ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘రాక్షసన్‌’. రామ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణువిశాల్, అమలాపాల్‌  నటించారు. ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌. చైల్డ్‌ కిడ్నాపింగ్, సైకో సీరియల్‌ హత్యల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇంతకుముందు 2012లో వచ్చిన తమిళ చిత్రం ‘సుందర పాండియన్‌’ రీమేక్‌ ‘స్పీడున్నోడు’(2016) చిత్రంలో సాయిశ్రీనివాస్‌ హీరోగా నటించారు.

క్రికెటర్‌ కౌసల్య
దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు కెరీర్‌లో ఒకటి రెండు చిత్రాలు మినహా దాదాపు అన్నీ రీమేక్‌ చిత్రాలే. గత ఏడాది తమిళ చిత్రం ‘వేలయిన్ను వందుట్టా వెళ్లక్కారన్‌’ చిత్రాన్ని తెలుగులో ‘సిల్లీఫెలోస్‌’గా రీమేక్‌ చేశారు. తాజాగా తమిళ చిత్రం ‘కనా’ను తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి.. క్రికెటర్‌’గా తెరకెక్కిస్తున్నారు. తమిళంలో లీడ్‌ రోల్‌ చేసిన ఐశ్వర్యా రాజేషే తెలుగులోనూ నటిస్తున్నారు. ఓ గ్రామీణ యువతి జాతీయస్థాయి క్రికెట్‌ క్రీడాకారిణిగా ఎలా ఎదిగారు? అనే అంశం ఆధారంగా ఈ సినిమా ఉంటుంది.

ఫస్ట్‌ ర్యాంకర్‌ రాజు
మూడేళ్లక్రితం కన్నడలో రూపొందిన చిన్న చిత్రం ‘ఫస్ట్‌ ర్యాంకర్‌ రాజు’. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో ‘ఫస్ట్‌ ర్యాంకు రాజు.. విద్య 100 శాతం.. బుద్ధి 0’ పేరుతో రీమేక్‌ అవుతుంది. మార్కులు ఒక్కటే కొలమానం కాదని తల్లిదండ్రులకు సందేశం ఇచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దాదాపు వందకోట్లను కొల్లగొట్టింది. మాతృకకు దర్శకత్వం వహించిన నరేష్‌ కుమారే తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్‌ మద్దినేని హీరోగా నటిస్తున్నారు.  ఇవి కాకుండా ఈ ఏడాది మరికొన్ని రీమేక్‌ చిత్రాలు పట్టాలెక్కే చాన్స్‌ కనిపిస్తోంది. వాటిలో ప్రముఖంగా బదాయి హో’ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని నాలుగు దక్షిణాది భాషల్లో రీమేక్‌ చేస్తానని నిర్మాత బోనీ కపూర్‌ ఇటీవల ప్రకటించారు.

నిజమేనా?
తమిళంలో అరుణ్‌ విజయ్‌ హీరోగా నటించిన ‘తడమ్‌’ చిత్రం రీమేక్‌ రైట్స్‌ను నిర్మాతలు ‘స్రవంతి’ రవి కిశోర్, ‘ఠాగూర్‌’ మధు సొంతం చేసుకున్నారని తెలిసింది. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో హీరో రామ్‌ నటించబోతున్నట్లు సమాచారం.  గోపీచంద్‌ హీరోగా తిరు ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో విజయం సాధించిన  ‘టైగర్‌ జిందా హై’ చిత్రానికి  రీమేక్‌ అనే మాటలు వినిపిస్తున్నాయి. రణ్‌వీర్‌సింగ్‌ ‘గల్లీబోయ్‌’ రీమేక్‌ హక్కులను అల్లు అరవింద్‌ సొంతం చేసుకున్నారని, సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘అం«థా« దూన్‌’ రీమేక్‌లో సిద్ధార్థ్‌ నటించబోతున్నారని, తాప్సీ  నటించిన హిందీ చిత్రం ‘బద్లా’ తెలుగు రీమేక్‌లో త్రిష నటించనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జాబితాలో హిందీ చిత్రాలు ‘సోనూ కీ టిట్టు కీ స్వీటీ’, ‘స్త్రీ’ కన్నడ చిత్రం ‘కాలేజ్‌ కుమార్‌’ చిత్రాలు కూడా ఉన్నాయి. 

2018లో స్టార్ట్‌  2019లో రిలీజ్‌
ఇక సెట్స్‌పై ఉన్న రీమేక్‌ల గురించి తెలుసుకుందాం. హిందీ హిట్‌ ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మీ’గా తయారైంది. తమన్నా లీడ్‌ రోల్‌. తమిళంలో హిట్‌ సాధించిన ‘కణిదన్‌’ నిఖిల్‌ హీరోగా తెలుగులో ‘అర్జున్‌ సురవరం’గా రాబోతోంది. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన టీఎన్‌. సంతోష్‌నే దర్శకుడు. మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘ఏబీసీడీ’ (అమెరికన్‌ బోర్న్‌ కన్‌ప్యూజ్డ్‌ దేశి) తెలుగు రీమేక్‌లో అల్లు శిరీష్‌ నటిస్తున్నారు. వేసవిలో విడుదల కానుంది. ఇంకా హిందీలో మంచి విజయం సాధించిన ‘2 స్టేట్స్‌’ చిత్రం తెలుగు రీమేక్‌లో అడవి శేష్‌ హీరోగా నటిస్తున్నారు. ఇందులో రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని రీమేక్‌ చిత్రాలు సెట్స్‌ మీద ఉన్నాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా