ప్రేమ, సాహసం చిందించిన సింధూర పువ్వు

25 Apr, 2018 00:42 IST|Sakshi

డబ్బింగ్‌ క్లాసిక్స్‌–18

అప్పటికి తమిళంలో మణిరత్నం వచ్చేశాడు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ అని హీరోల మీద దృష్టి పెట్టి ఉన్న తెలుగు ప్రేక్షకులలో కొందరు ఇది గమనించి ‘కెమెరా’, ‘టేకింగ్‌’ వంటి మాటలు మొదలుపెట్టారు. కథను వేరే రకంగా చెప్పవచ్చు, సన్నివేశాన్ని వేరే రకంగా మొదలెట్టవచ్చు, కెమెరాను వేరే చోట ఉంచవచ్చు అని తెలుసుకుంటూ ఉన్నారు.అలాంటి సమయంలో సగటు తెలుగు ప్రేక్షకుడు ఈ టేకింగ్‌ చాలా కొత్తగా ఉంది అని మాట్లాడుకున్న సినిమా ఒకటి ఉంది – అది ‘సింధూర పువ్వు’.ఈ సినిమా తెలుగువాళ్లను చాలా కాలం వదల్లేదు.వదలించుకుందామనుకున్నా దూరదర్శన్‌లో దీని పాటలు పదే పదే వెంటాడటానికి వచ్చేవి.ఆ పచ్చని మైదానాలు... ఛాతీకి పుస్తకం అంటించుకుని వడివడిగా నడుస్తున్న నిరోషా... ఆమెను వెంబడిస్తూ తప్పెట పట్టుకుని పాడుతున్న రాంకీ... ఆ పాట...
సింధూర పువ్వా తేనె చిందించ రావా....

సూర్యకాంతం గయ్యాళే తప్ప విలన్‌ కాదు. ఆమెకు వేధించడం, పీడించడమే తెలుసు తప్ప మందిని పోగేసి ప్రాణాలు తోడేసేంత విలనిజం లేదు. ఈ సినిమాలో విజయలలిత లేడీ విలన్‌. జమిందారు భార్య. నిజంగానే భార్యేనా? కాదు. దివాణంలో పని మనిషిగా చేరింది. జమిందారును వలలో వేసుకుంది. భార్య అయి కూర్చుంది. ఇది గమనించిన జమిందారు తండ్రి ఆస్తి మొత్తం మనవరాలి పేరు మీద రాసి వెళ్లాడు. జమిందారు మొదటి భార్య పిల్లను కని చనిపోయింది. ఆ పిల్ల బాగు కోసం అతడు ఆ పని చేశాడు. కాని రెండో భార్య అయిన విజయలలిత కొడుకును కంది. ఆస్తిని అనుభవిస్తే తన కొడుకు అనుభవించాలి. ఈ సవతి కూతురు ఎవరు?నిరోషాకు పెళ్లి చేస్తే ఆ వచ్చినవాడు ఆస్తిని తన్నుకుపోతాడని ఊహ తెలియని వయసులో బాల్య వివాహం చేసింది. ఆ తర్వాత తాళిని కట్టిన బాలుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపించింది. నిరోషాను శాశ్వతంగా విధవరాలిగా చేసి మహల్‌లో కూచోబెట్టింది. ఎంత కష్టంలో కూడా కొద్దో గొప్పో గాలాడుతుంది. నిరోషాకు కాలేజీకి వెళ్లి చదువుకునే వీలు ఎలాగో దక్కింది. అంతే కాదు... విజయలలితకు పుట్టిన కుర్రాడు చాలా మంచివాడు. సోదరి పక్షం వహిస్తూ తల్లి ఆరళ్ల నుంచి ఆమెను కాపాడుకుంటూ ఉంటాడు. ఈ రెండు విషయాలే నిరోషాను ప్రాణాలతో ఉంచాయి.అయితే ఈడు ఊరికే ఉంచుతుందా?నిరోషా ఆ ఊరికి ఉద్యోగం కోసం వచ్చిన హార్టికల్చరిస్ట్‌ రాంకీని ప్రేమిస్తుంది.నిరోషా ప్రేమ విజయలలితకు ప్రమాదం. ఆమె ఆధిపత్యానికి ప్రమాదం. ఆస్తికి ప్రమాదం. విజయలలిత వాదనలు, పంచాయితీలు పెట్టే టైప్‌ కాదు. ఆమె దగ్గర కుత్తుకలు కోసే గుంపు చాలా ఉంది. ఆ గుంపుకు పని చెప్తే ఊరి శివార్లలో తాటిచెట్టుకు కావలసినవాళ్ల తలను వేళాడగడ్తారు.ఇప్పుడు విజయలలితకు రాంకీ తల కావాలి.అతణ్ణి కాపాడేవాడు ఆ ఊరిలో లేడు. రావాలి. అదిగో వచ్చాడు. విజయకాంత్‌

విజయకాంత్‌ పేరు కెప్టెన్‌ విజయకాంత్‌. మిలట్రీలో కెప్టెన్‌. సొంతూళ్లో చక్కటి అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళాడాడు. ఉద్యోగం కోసం మిలట్రీకి వెళ్లాడు. కాని దీనికి ముందు ఆ ఊళ్లోని ఒక దుర్మార్గుణ్ణి పోలీసులకు పట్టి ఇచ్చాడు. అంతే కాదు తల్లి వ్యవహారం నచ్చక ఇల్లు వదిలి వచ్చేసిన విజయలలిత కొడుకును తమ్ముడిలా ఆదరించాడు. భార్యతో, కొడుకుతో, దేవుడిచ్చిన తమ్ముడితో జీవితం ఆనందంగా ఉంది అనుకుంటూ ఉన్నప్పుడు జైలు నుంచి తిరిగి వచ్చిన దుర్మార్గుడు ఆ కుటుంబంపై దాడి చేశాడు. విజయకాంత్‌ భార్యను, చిన్నపిల్లాడైన కొడుకును చంపాడు. విజయకాంత్‌ మీద కూడా తుపాకీ పేల్చితే దానికి విజయలలిత కొడుకు అడ్డం పడి ప్రాణం కాపాడతాడు. చచ్చిపోయే ముందు అతడు కోరే ఒకే ఒక్క కోరిక– సోదరిని ఆ దివాణం నుంచి బయటపడేయమని. ఆమె కోరుకున్నవాడికి ఇచ్చి పెళ్లి చేయమని. మాట ఇచ్చిన విజయకాంత్‌.. విజయలలిత ఉన్న ఊరికి వస్తాడు.కాని అప్పటికే అతడు పేషెంట్‌.దుర్మార్గుడితో జరిగిన పెనుగులాటలో తలకు దారుణమైన గాయమయ్యి చావు బతుకుల మధ్య ఉన్నాడు. అతడికి వైద్యం చేసే డాక్టర్‌కి విజయకాంత్‌ గొప్పదనం తెలుసు. అతడి ప్రాణం విలువ తెలుసు. అందుకే తోడు అతడూ నిలుస్తాడు.ఒక పువ్వు.దాని చుట్టూ మారుతల్లి అనే ప్రాణాంతకమైన ముల్లు.
ఆ ముల్లును ఏరి వేయడానికి ముగ్గురు వీరులు.రాంకీ. విజయకాంత్‌. డాక్టర్‌ చంద్రశేఖర్‌. నిరోషాను మహల్‌ నుంచి బయట పడేయడానికి వీరు చేసిన సాహసమే ‘సింధూర పువ్వు’.

ఆ ఊరికి రోజుకు ఒక్కసారి ఒకే ఒక రైలు వస్తుంది. ఆ రైలు ఎక్కేసి పొలిమేర దాటేశారా.. ప్రమాదం తప్పినట్టే.  అడుగడుగున విజయలలిత మనుషులు కాపు కాచి ఉన్న ఆ స్థలంలో విజయకాంత్, డాక్టర్‌ కలిసి రాంకీని, నిరోషాని ఎలా ఆ రైలు ఎక్కించారనేది క్లయిమాక్స్‌.కొన్ని ప్రేమలు ప్రకృతిని కూడా సతమతం చేస్తాయి.ఏదో ఒక ప్రాణాన్ని బలిగోరితే తప్ప అది శాంతించదు.రాంకీ, నిరోషాల ప్రేమ విజయకాంత్‌ ప్రాణాన్ని బలి కోరుతుంది.తన ప్రాణాన్ని పణంగా పెట్టి అతను రాంకీ, నిరోషాలను ఒకటి చేస్తాడు.కథ ముగుస్తుంది.కాని ఇలా చెప్పిన కథ ఇలా ఉండదు.చూపు తిప్పుకోని విధంగా ఉంటుంది. రోమాంచితంగా ఉంటుంది. ఉద్వేగంగా ఉంటుంది. లీనమయ్యేలా ఉంటుంది.అందుకే తెలుగు ప్రేక్షకులు ఇది భిన్నంగా ఉంది అని భావించారు. సూపర్‌హిట్‌ చేశారు.ఇప్పటికీ వినిపించే పాటే ఈ ప్రేమ కథకు మరపురాని గుర్తు... సింధూర పువ్వా తేనె చిందించ రావా...

సింధూర పూవె
పి.ఆర్‌. దేవరాజ్‌ దర్శకత్వంలో 1988లో తమిళంలో ఘన విజయం సాధించిన సినిమా ‘సింధూర పూవె’. తెలుగులో ‘సింధూర పువ్వు’గా విడుదలై అంతే పెద్ద హిట్‌ అయ్యింది. కాని ఇది నిర్మాత అయిన ఆబావానన్‌ సృష్టి అని చెప్పాలి. ఆబావానన్‌ తమిళంలో భిన్నమైన కథలను రూపొందించి గుర్తింపు పొందాడు. అతడు విలక్షణంగా రాసి దగ్గరుండి తీయించిన సినిమాగా సింధూర పువ్వును గుర్తించాలి. రాంకీ, నిరోషాలకు ఈ సినిమా చాలా పేరు తెచ్చింది. దాంతో వీళ్లు నిజ జీవితంలో భార్యాభర్తలు అయ్యారు. ఈ సినిమాలోని ‘సింధూర పువ్వా తేనె చిందించ రావా’ పాట చిత్రలహరిలో రాని ఎపిసోడ్‌ ఉండేది కాదు. సంగీతం అందించిన మనోజ్‌–గ్యాన్‌ జంట కొన్ని సినిమాలకు మాత్రమే పని చేసి విడిపోయి తన చెడు తానే తెచ్చుకుంది. సింధూర పువ్వుకు ఈ జంట ఇచ్చిన పాటలు, నేప«థ్య సంగీతం చాలా హిట్‌. అసలు ఫొటోగ్రఫీ, లొకేషన్స్, ఎడిటింగ్, ఎమోషన్‌ను రైజ్‌ చేసే ఎడిటింగ్, స్టంట్స్‌... అన్నీ చాలా బాగుంటాయి. విజయకాంత్‌కు మొదటిసారి ఈ సినిమా ఉత్తమ నటుడుగా స్టేట్‌ అవార్డ్‌ తెచ్చి పెట్టింది. తెలుగులో విజయకాంత్‌కు సాయి కుమార్‌ చాలా బాగా డబ్బింగ్‌ చెప్పాడు. అన్నట్టు ఆబావానన్‌ 2016లో జైలుకు వెళ్లాడు. బ్యాంకులను రెండున్నర కోట్లకు ముంచినందుకుగాను అతనికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. సినిమా కథల్లోలానే నిజజీవితంలోనూ ట్విస్ట్‌లు ఉంటాయనడానికి ఇదొక ఉదాహరణ. 
– కె

మరిన్ని వార్తలు