ఆమె చెల్లెలు లాంటిది: క్రికెటర్‌ శ్రీశాంత్‌

9 Jul, 2017 19:39 IST|Sakshi
ఆమె చెల్లెలు లాంటిది: క్రికెటర్‌ శ్రీశాంత్‌
తమిళసినిమా: నటి నిక్కీగల్రాణి తనకు చెల్లెలు లాంటిదని నటుడిగా రంగప్రవేశం చేస్తున్న సంచలన క్రికెట్‌ కీడాకారుడు శ్రీశాంత్ అన్నారు. ఈయన హీరోగా నటిస్తున్న తొలి చిత్రం టీమ్‌ 5. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెడ్‌ కార్పెట్‌ ఫిలింస్‌ పతాకంపై రాజ్‌ జక్కారియాజ్‌ నిర్మిస్తున్నారు. సురేశ్‌ గోవింద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీశాంత్‌కు జంటగా నటి నిక్కీగల్రాణి నటిస్తున్నారు. ముఖ్య పాత్రలో మరాఠి నటుడు దేశ్‌పాండే నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతాన్ని, సైజిత్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

ఈ చిత్రం గురించి  శ్రీశాంత్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను బైక్‌ రేసర్‌గా నటిస్తున్నానని తెలిపారు. అందుకోసం ప్రత్యేక శిక్షణ పొందానని చెప్పారు. తనకిది తొలి చిత్రం అని, నటి నిక్కీగల్రాణి 25 చిత్రాలకు పైగా నటించారని అందువల్ల నటనలో ఆమె తనకు చాలా నేర్పించారని చెప్పారు. నిక్కీగల్రాణి తనకు చెల్లెలు లాంటిదని అన్నారు. తను చిన్నతనం నుంచి ఆయనకు తెలుసన్నారు. తన కుటుంబంలో అమ్మ, నాన్న, చెల్లెలు, అన్నయ్య అందరూ సినిమాకు చెందిన వారేనని తెలిపారు.

తాను మాత్రమే క్రికెట్‌ రంగంలోకి వెళ్లానని, ఇప్పుడు మళ్లీ సినిమారంగంలోకి వచ్చానని అన్నారు. తనకు సినిమా, క్రికెట్‌ రెండూ ఇష్టమేనని చెప్పారు. త్వరలోనే భారత క్రికెట్‌ జట్టుతో కలిసి క్రికెట్‌ ఆడనున్నట్లు చెప్పారు. తాను రజనీకాంత్, కమలహాసన్‌లను చూసి పెరిగిన వాడినని అన్నారు. కొందరు విజయ్, అజిత్‌లతో కలిసి నటిస్తారా అని అడుగుతున్నారని, వారితో ఒక్క సన్నివేశంలో నటించడానికైనా సిద్ధమేనని శ్రీశాంత్‌ అన్నారు.