ఉత్తమ హీరోయిన్‌గా శ్రీదేవి

13 Apr, 2018 20:02 IST|Sakshi

జాతీయ అవార్డులలో ఉత్తమ హీరోయిన్‌గా లెజెండరీ తార శ్రీదేవికి అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. చనిపోయిన వ్యక్తికి ఈ కేటగిరీలో అవార్డు ప్రకటించటం ఇదే తొలిసారి. అవార్డు పట్ల శ్రీదేవి భర్త బోనీకపూర్‌, పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్‌ యాక్టర్‌ ఎప్పటికీ నిలిచి ఉంటారని ఈ అవార్డు నిరూపించింది. ఆమె పరిపూర్ణత కోసం పరితపించే నటి. ఇది మాకు చాలా ప్రత్యేకమైన క్షణం’ అని వారు చెబుతున్నారు. ఇక సినీ చరిత్రలో ధృవతారకు చిట్టచివరకు ఉత్తమ నటి(మొదటిసారి) అవార్డు దక్కిందని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

శ్రీదేవి అవార్డుపై వివాదాలు వెల్లువెత్తటం ఇష్టం లేదని జ్యూరీ మెంబర్‌, దర్శకుడు శేఖర్‌కపూర్‌ చెబుతున్నారు.‘శ్రీదేవి అవార్డుపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు లేకపోలేదు. కానీ, ఆమెకు ఊరికనే ఇవ్వలేదు. సినీ లోకానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తింపు. ఆమె చివరి చిత్రం మామ్‌లో ఆమె నటనకు ఇచ్చిన గౌరవం’ అని ఆయన తెలిపారు. రవి ఉద్యావర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన మామ్‌ శ్రీదేవి ఆఖరి చిత్రం(షారూఖ్‌ జీరోలో నటించినప్పటికీ అందులో చిన్న పాత్రే). తన కూతురు అత్యాచారానికి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకునే లెక్చరర్‌ దేవకీ పాత్రలో శ్రీదేవి నటించి మెప్పించారు. పాక్‌ నటి సజల్‌ అలీ కూతురి పాత్ర పోషించింది. టాలీవుడ్‌ రచయిత కొన వెంకట్‌ మామ్‌కు కథా సాయం అందించారు.

>
మరిన్ని వార్తలు