మళ్లీ బుల్లితెరకు?

18 Oct, 2014 01:09 IST|Sakshi
మళ్లీ బుల్లితెరకు?

శ్రీదేవి మళ్లీ నటిస్తే? బాగుంటుందని కోరుకున్నవారందరినీ ఆనందపరుస్తూ ఆమె ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. దాదాపు పధ్నాలుగేళ్ల తర్వాత వెండితెరపై ఆమె కనిపించిన చిత్రం ఇది. అదే నటన, అదే అందం.. శ్రీదేవిలో ఏ మాత్రం మార్పు లేదని ఆ సినిమా చూసినవాళ్లు కితాబులిచ్చేశారు. ఓ విజయవంతమైన చిత్రం ద్వారా రీ-ఎంట్రీ అయిన శ్రీదేవి మళ్లీ అదే స్థాయి చిత్రంలో నటించాలని తదుపరి చిత్రం ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికే తమిళంలో ఓ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారామె.

ఇటీవల శ్రీదేవికి బుల్లితెర నుంచి ఓ ఆఫర్ అందిందట. ‘మై లక్ష్మీ తేరీ ఆంగన్ కీ’ అనే ధారావాహికకు సంబంధించిన రెండో సీజన్‌లో ఓ కీలక పాత్రను శ్రీదేవితో చేయించాలని నిర్మాతలు అనుకున్నారని సమాచారం. ఇటీవల శ్రీదేవితో చర్చించారని భోగట్టా. అయితే, ఇంకా ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకోలేదట. ఇదిలా ఉంటే.. గతంలో ‘మాలిని అయ్యర్’ అనే కామెడీ షో ద్వారా బుల్లితెరపై మెరిశారు శ్రీదేవి. ఆ తర్వాత ఓ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇది జరిగి దాదాపు పదేళ్లయ్యింది. ఒకవేళ తాజా ప్రతిపాదనను ఆమె అంగీకరిస్తే... ఇంటిల్లిపాదీ ఆనందపడతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.