మమ్ముట్టి కొడుకుతో శ్రీదేవి కూతురు

22 Sep, 2015 04:30 IST|Sakshi
మమ్ముట్టి కొడుకుతో శ్రీదేవి కూతురు

మమ్ముట్టి కొడుకు శ్రీదేవి కూతురు ఇదేదో సినిమా టైటిల్‌గా బాగుండేటట్లుంది కదూ... అయితే ఇది సినిమా పేరు కాదు. ఒక క్రేజీ చిత్రం కోసం సూపర్‌స్టార్ల వారసులు హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారన్న తాజా వార్త. అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు తెరంగేట్రం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున వారసుడు అఖిల్ తొలి చిత్రంలో శ్రీదేవి వారసురాలు జాన్వీని నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. కారణాలేమైనా ఆ చిత్రంతో జాన్వీ రంగ ప్రవేశం జరగలేదు. అంతకు ముందు తమిళంలో విజయకాంత్ కొడుకు షణ్ముగపాండియన్‌కు జోడీగా పరిచయం కానున్నట్లు ప్రచారం జరిగింది.

అదీ వార్తలకే పరిమితం అయ్యింది. అలాంటిది కథానాయికగా జాన్వీ ప్రవేశానికి ఇప్పుడు రంగం సిద్ధం అయ్యిందన్నది తాజా సమాచారం. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్‌కు జంటగా జాన్వీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే మలయాళంలో సక్సెస్‌ఫుల్ హీరోగా వెలుగొందుతున్నారు. ఓ కాదల్‌కణ్మణి చిత్రంతో తమిళంలోనూ దాని అనువాదంగా రూపొందిన ఓకే బంగారం చిత్రంతో తెలుగులోనూ పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రేజీ జంటతో ఒక బ్రహ్మాండమైన చిత్రం చెయ్యడానికి ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం.

ఈయన ఇటీవల అద్భుతాలు సృష్టించిన బాహుబలి చిత్ర కథకుడు. ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తండ్రి అన్న విషయం గమనార్హం. విజయేంద్రప్రసాద్ నటి శ్రీదేవితో చర్చించి ఆమెకు కథను వినిపించినట్లు, కథ నచ్చడంతో ఆమె తన కూతుర్ని అందులో నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మొదలగు నాలుగు భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా