పాపులారిటీ ఉన్నవారికే ‘బిగ్‌బాస్‌’లో చోటు

30 Jul, 2019 08:07 IST|Sakshi

‘స్టార్‌ మా’ ప్రతినిధి శ్రీధర్‌ గురివిశెట్టి

శ్వేతారెడ్డి ఫిర్యాదుకు వివరణ  

బంజారాహిల్స్‌: ప్రజాదరణ పొందిన బిగ్‌బాస్‌–3 నిర్వాహకులపై జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి చేసిన ఆరోపణలకు స్టార్‌ మా టీవీ ప్రతినిధి సోమవారం వివరణ ఇచ్చారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి తనను ఎంపిక చేసినట్లు చెప్పి ఒప్పందం కూడా కుదుర్చుకొని క్యాస్టింగ్‌ కౌచ్‌కు తాను ఒప్పుకోకపోవడంతో తొలగించారని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని శ్వేతారెడ్డి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు పోలీసులు స్టార్‌ మా అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌కు వారం క్రితం నోటీసులు జారీ చేశారు. శ్వేతారెడ్డిని ఇంటర్వ్యూ చేసిందెవరు? ఎందుకు తిరస్కరించారు? ఇంటర్వ్యూ చేసిన వారికి స్టార్‌ మా కార్యాలయంతో ఉన్న సంబంధాలేంటి? అన్న అంశాలపై సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

దీనిపై స్టార్‌ మా అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ గురివిశెట్టి సమాధానమిచ్చారు. బిగ్‌బాస్‌ షోకు డైరెక్టర్‌ అభిషేక్‌ అని, ప్రొడ్యూసర్‌గా ఎండెమోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌గా ఉందన్నారు. ఇంటర్వ్యూను ఎండెమోల్‌ ప్రొడక్షన్‌ హౌస్, స్టార్‌ మా టీవీ, మెంటల్‌ అండ్‌ ఫిజికల్‌ హెల్త్‌ అసిస్టెంట్లు చేసి సెలెక్ట్‌ మెంబర్స్, రిజక్ట్‌ మెంబర్స్‌ను గుర్తిస్తారన్నారు. వందకు పైగా ప్రశ్నలను సంధించి ఎందుకు కొందరు అనర్హత పొందుతారో తెలియజేస్తామన్నారు. ప్రజాదరణ, ప్రేక్షకుల్లో గుర్తింపు, ఆడియన్స్‌ హృదయాలను గెలవాలనే తపన ఉన్నవారినే బిగ్‌బాస్‌–3కి ఎంపిక చేశారన్నారు. ఈ షోకు ప్రోగ్రాం డిపార్ట్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్యామ్‌శంకర్, క్రియేటివ్‌ కన్సల్టెంట్‌గా అభిషేక్‌ ముఖర్జీ, మేనేజర్‌గా రవికాంత్, స్టార్‌ మా పీఆర్‌ఓగా రఘు వ్యవహరిస్తున్నారని ఆయన సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా శ్యామ్, రవికాంత్, రఘు, అభిషేక్‌లపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో శ్వేతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 354, 506 కింద కేసు నమోదైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు