ఒకటే జననం.. ఒకటే మరణం.. బతుకంతా హీరోగానే జీవితం!

8 Oct, 2014 22:26 IST|Sakshi
ఒకటే జననం.. ఒకటే మరణం.. బతుకంతా హీరోగానే జీవితం!

 సందర్భం  శ్రీహరి వర్ధంతి
 దాదాపు పన్నెండేళ్ళ క్రితం సంగతి... చెన్నై మహానగరం... ఓ వానాకాలపు ఉదయం 6 గంటల వేళ... రాత్రి నుంచి కురుస్తున్న జోరు వాన, చలి మధ్య నగరం బద్ధకంగా ముసుగు తన్ని నిద్రపోతోంది. కానీ, ఆ స్టార్ హోటల్లోని గదిలో కుటుంబంతో సహా బస చేస్తున్న ఆ నటుడు మాత్రం నిద్ర లేచి చాలాసేపైంది. వ్యాయామాలు ముగించుకొని, చెన్నై పోర్ట్‌లోని ఆ నాటి షూటింగ్‌కు అప్పటికే సిద్ధమై కూర్చొని కనిపించారు. అప్పటికి పుష్కరం పైగా ఆయన పద్ధతి అదే! నిజానికి, ఆ క్రమశిక్షణ, పని మీద ఆ శ్రద్ధే ఆయనను మధ్యతరగతి నుంచి స్టార్ హోటల్‌లో దిగే స్టార్ స్టేటస్‌కు తెచ్చాయి. ఎంత ఎదిగినా ఇచ్చిన మాట, ఒప్పుకొన్న పని, నమ్మినవారి క్షేమం మర్చిపోని ఆ హీరో శ్రీహరి.
 
 అయినవాళ్ళు కానీ, ఆర్థికంగా అండదండలు కానీ లేకుండా పైకి రావడం కష్టమైపోతున్న 1990లలో శ్రీహరి అందుకు పూర్తి భిన్నమైన ఉదాహరణ. స్వయంకృషితో పైకొచ్చి, వచ్చిన అవకాశాన్నల్లా సద్వినియోగం చేసుకొన్న సెల్ఫ్‌మేడ్ హీరో! సినిమాను జీవితంగా చేసుకున్న రఘుముద్రి శ్రీహరి జీవితమూ సినిమానే! హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శ్రీహరి బాలానగర్‌లో తిరిగిన చోట్లు, పడిన కష్టాలు, చేసిన శ్రమ- ఇవాళ్టికీ అక్కడ కథలుగా చెబుతారు.
 
 ఆయన మొదలుపెట్టింది - చిన్నాచితకా పాత్రలతో! ప్రధానంగా చేసింది - నెగటివ్ పాత్రలు! అయ్యింది - చిన్న చిత్రాలకు పెద్ద హీరోగా! అనేక విజయాల తరువాత మరింత పేరు తెచ్చుకుంది - కథకు కీలకమైన క్యారెక్టర్లతో! దాదాపు రెండు దశాబ్దాల పైగా శ్రీహరి సాగించిన అరుదైన సినీ ప్రస్థానమిది. ‘పాత్రను దర్శకుడు నాలోకి ఎంత బాగా ఎక్కిస్తే, ఆ పాత్రను అంతగా పండిస్తాను’ అని నిజాయతీగా చెప్పిన శ్రీహరి మూసచట్రంలో బందీ కాకుండా, ఎప్పటికప్పుడు తన నట జీవితాన్ని పునర్నిర్వచించుకోవడం విశేషమే. అందుకే, నటుడిగా ఆయన ప్రస్థానమంతా ఓ సహజ పరిణామ క్రమంగా సాగింది.
 
 వాచిక, ఆంగిక, ఆహార్యాలు మూడింటి మీదా శ్రీహరిది గట్టిపట్టు. పౌరాణిక, చారిత్రక, సాంఘిక పాత్రలు వేటికైనా సరిపడే నిండైన విగ్రహంతో నిలిచిన ఈ తరం ఆఖరి నటుల్లో ఆయనొకరు. ‘శ్రీకృష్ణార్జున విజయము’, ‘మగధీర’, ‘హలో బ్రదర్’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘ఢీ’ లాంటివే అందుకు ఉదాహరణ. ‘పోలీస్’, ‘సాంబయ్య’ లాంటి పాత్రల్లో ఆయన అటు సామాన్య జనాన్నీ, ఇటు దర్శక - నిర్మాతలనూ సంతోషపెట్టారు. ‘‘సినిమాల్లో నటించడానికి పనికొస్తాయని సోమర్‌సాల్ట్‌లు నేర్చుకొన్న’’ స్పోర్ట్స్‌మన్ ఆయన.
 
 వ్యాయామానికీ, క్రీడలకూ చిన్నప్పటి నుంచి ప్రాధాన్యమిచ్చిన ఈ బలశాలి ఒకప్పుడు జిమ్నాస్ట్‌గా 8 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ జిమ్నాస్ట్ కావాలని ఒకప్పుడు ఆయన కోరిక. కానీ, సినిమాలు బలంగా ఆకర్షించి, ఇటు వైపు రావడంతో అది తీరని కోరికగా మిగిలిపోయింది. విశేషం ఏమిటంటే, వచ్చిన దోవ, ఎక్కిన మెట్లు ఆయన మర్చిపోలేదు. అందుకే, క్రీడలకు సంబంధించి ఏ కార్యక్రమం చేపడుతున్నా, అడిగిన వారికి లేదనకుండా సాయం చేసేవారు. సినీ జీవితపు తొలినాళ్ళలో తన బుడిబుడి అడుగులకు మాట సాయం చేసినవాళ్ళకు కూడా తన స్టార్ ఇమేజ్ తోడ్పడుతుందంటే, సంతోషంగా ముందుకు వచ్చారు. అన్ని బంధాలూ ఆర్థిక సంబంధాలే అయిన సినీ సమాజంలో ‘రియల్‌స్టార్’గా పేరు తెచ్చుకున్నారు.
 
 ఏ ‘గాడ్ ఫాదరూ’ లేకుండా, ఎవరికీ వారసుడు కాకుండా సినీ రంగంలో పైకి వచ్చిన శ్రీహరి ‘మనం బతుకుతూ, మరో నలుగురికి బతుకునివ్వడమే జీవితం’ అని నమ్మారు. ఏదైనా సరే మనసులో పెట్టుకోకుండా చెబుతూ, మనసును హాయిగా ఉంచుకోవడాన్ని నమ్మిన శ్రీహరి వీలైనంత వరకు దాన్నే ఆచరించారు. చెన్నైలో డ్యాన్‌‌స తరగతుల్లో చూసిన నటి ‘డిస్కో’ శాంతి వ్యక్తిత్వం ఆయనను ఆకర్షించింది. ఆమే తండ్రి అయి, ఎనిమిదిమంది ఉన్న కుటుంబాన్ని సాకుతున్న తీరు మనసుకు హత్తుకుంది. అంతే! పెద్దలతో మాట్లాడి, ఆమెనే పెళ్లాడారు.
 
 చనిపోయిన కూతురు అక్షర పేరు మీద చేసిన సేవ, రాష్ట్ర రాజధాని దగ్గరలో కొన్ని గ్రామాలకు మంచినీటి వసతి విషయంలో శ్రీహరి చూపిన చొరవ కూడా సామాన్యుల్ని ఆయనకు మరింత దగ్గర చేశాయి. మానుకోలేకపోయిన అలవాట్లు ముదరబెట్టిన మాయదారి రోగం ముంబయ్‌లో హిందీ చిత్ర షూటింగ్‌కు వెళ్ళిన ఆ మనిషిని మింగేసినప్పుడు సామాన్య జనం జూబ్లీహిల్స్ నివాసానికి తండోపతండాలుగా తరలి వచ్చారంటే ఇలాంటి కారణాలెన్నో! జూబ్లీహిల్స్ నివాసం నుంచి కిలోమీటర్ల దూరమున్న ఖననవాటిక దాకా శ్రీహరి అంతిమయాత్రలో రోడ్డుకు ఇరుపక్కలా క్రిక్కిరిసిన జనం పరుగులు పెడుతూ పాల్గొనడం ఇటీవలి కాలంలో అతి కొద్దిమందికే దక్కిన అరుదైన ఆఖరి వీడ్కోలు! జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఇంటి దగ్గర ఓ భారీ వినైల్‌లో ఇవాళ్టికీ శ్రీహరి చిరునవ్వు చిందిస్తుంటారు. దాని మీద ‘ది లెజెండ్స్ నెవర్ డైస్’ అని ఉంటుంది. అవును. బతికుండగానే జనం మర్చిపోయేవారు ఎందరో! కానీ, కనుమరుగైనా కళ్ళ ముందే కదలాడే వ్యక్తిత్వాలు, వ్యక్తులు కొందరే! ఆ కొందరిలో ఒకడైన శ్రీహరి చిరంజీవి!!                        - రెంటాల జయదేవ