అప్పుడు ఎంత అంటే అంత!

16 Jun, 2019 03:16 IST|Sakshi
శశాంక్, శ్రీహరి, శాంతి, మేఘాంశ్‌

శశాంక్‌.. మేఘాంశ్‌.. ‘రియల్‌ స్టార్‌’గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన శ్రీహరి కుమారులు. ‘రాజ్‌దూత్‌’ చిత్రం ద్వారా మేఘాంశ్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు. శశాంక్‌కి డైరెక్టర్‌ అవ్వాలనే ఆశయం ఉంది. ఈ ఇద్దరూ తమ తండ్రి శ్రీహరి గురించి పంచుకున్న విశేషాలు.

►  హీరోగా పరిచయమవుతున్న ఈ సమయంలో నాన్న పక్కన ఉంటే అనే ఫీలింగ్‌ రాక మానదు..
మేఘాంశ్‌: కచ్చితంగా. నాన్న ఉండి ఉంటే పక్కనే ఉండి నడిపించేవారు. ఒక భరోసా ఉండేది. అది మిస్సవుతున్నాం. సినిమా కమిట్‌ అయ్యే ముందు ఆర్టిస్ట్‌గా నాన్నకు వచ్చిన దాంట్లో ఓ 5 శాతం వచ్చినా చాలు అనుకున్నాను. నాన్న పేరు చెడగొట్టకూడదు అనే బాధ్యతతో చేశాను.

►  నాన్న ఉన్నప్పుడే హీరో అవ్వాలనే టాపిక్‌ మీ మధ్య వచ్చిందా?
మేఘాంశ్‌: మేం ఇద్దరం సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలనుకున్నారు. కానీ హీరోనా? డైరెక్టర్‌గానా? అనే డిస్కషన్‌ అయితే ఎప్పుడూ రాలేదు. అప్పుడు చిన్నపిల్లలం కదా.

►  మీ నాన్నగారు ఫిట్‌గా ఉండేవారు. మీరు కూడా అదే అలవర్చుకున్నట్టున్నారు?
మేఘాంశ్‌: ఆయన్ను చూసే జిమ్‌ చేయడం స్టార్ట్‌ చేశాం. నాన్నకి ఫిట్‌గా ఉండటం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మాకది ఇన్‌స్పైరింగ్‌గా ఉండేది. మా జిమ్‌లో నాన్న ఫొటోలు ఉంటాయి. జిమ్‌ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆ ఫొటోలు చూస్తుంటాం.

►  శ్రీహరిగారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు..
మేఘాంశ్‌: అందరికీ హెల్ప్‌ చేయడం.
శశాంక్‌: హంబుల్‌గా ఉండటం.
మేఘాంశ్‌: హంబుల్‌గా ఉంటూనే రాయల్‌గా ఉండటం.

►  ఫాదర్స్‌ డే సెలబ్రేట్‌ చేసుకునేవారా? ఏదైనా గిఫ్ట్‌ ఇచ్చేవారా?
ఇద్దరూ: ఆయన ఉన్నప్పుడు ప్రతిరోజూ మాకు సెలబ్రేషనే.
శశాంక్‌: ఓ రోజు ఆమ్లెట్‌ చేసి ఇచ్చా. మస్త్‌ ఉంది అన్నారు.
మేఘాంశ్‌: నేను నాన్నతో చాలా క్లోజ్‌గా ఉండేవాడిని.
శశాంక్‌: వీడు డాడీ పెట్‌.

►  నాన్న వెళ్లిపోయిన తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటి?
శశాంక్‌: లైఫ్‌స్టైల్‌ మారిపోయింది. అప్పుడు బాధ్యతలు లేవు. ఇలా అంటే (చిటికేస్తూ) అన్నీ వచ్చేసేవి. ఇప్పుడు కొంచెం చూసి ఖర్చు పెడుతున్నాం. ఫైనాన్షియల్‌గా చాలా రెస్పాన్సిబుల్‌ అయిపోయాం.

►  స్కూల్‌కి వెళ్లను అన్నప్పుడు నాన్న కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
మేఘాంశ్‌: మమ్మీ కొట్టేది. కానీ డాడీ ఎప్పుడూ కొట్టలేదు. స్కూల్‌ బంక్‌ కొడితే డాడీ దగ్గరకు వెళ్లిపోయేవాళ్లం.

►  డాడీ ఏ విషయంలోనూ కోప్పడలేదా?
మేఘాంశ్‌: ఎప్పుడూ లేదు.
శశాంక్‌: ఒకే ఒక్కసారి నన్ను కోప్పడ్డారు. ఆయన్ను చూడటానికి ఫ్యాన్స్‌ వచ్చారు. నేను పటాసులు కాలుస్తున్నాను. గేట్‌ దగ్గర రాకెట్‌ పేలిస్తే ఓ అభిమాని మీదకు వెళ్లింది. అప్పుడు కోప్పడ్డారు. ఇంకోసారి కార్‌ విండోలో నుంచి మేఘాంశ్‌ చేయి బయటపెడితే అద్దం పైకి ఎత్తేశా.  అప్పుడు తిట్టారు.

►  బిజీ ఆర్టిస్ట్‌ అయినా మీతో టైమ్‌ ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేసేవారా?
ఇద్దరూ: రోజూ కలసి భోజనం చేసేవాళ్లం. అప్పుడు మమ్మీ మా అల్లరి గురించి చెబుతుండేది. వాళ్ల గురించి ఇప్పుడెందుకు? హ్యాపీగా తిననివ్వు అని మమ్మీనే తిట్టేవాళ్లు. మాకు ఒక్క తిట్టు కూడా పడేది కాదు.

►  మీ ప్రోగ్రెస్‌ కార్డ్‌ ఎవరు సైన్‌ చేసేవాళ్లు?
మేఘాంశ్‌: మమ్మీనే. అప్పుడప్పుడు పాస్‌ అయ్యేవాణ్ణి, అప్పుడప్పుడు ఫెయిల్‌ అయ్యేవాణ్ణి.
శశాంక్‌: కానీ వాడి తిట్లన్నీ నాకు పడేవి. ఎందుకంటే ముందు నా ప్రోగ్రెస్‌ కార్డ్‌ చూసి నన్ను తిట్టేది. మళ్లీ వాడిని ఏం తిడతాంలే అనుకునేదేమో. నన్ను తిడుతూనే ఉండేది.

►  మీ ఇద్దర్లో టామ్‌ ఎవరు? జెర్రీ ఎవరు?
మేఘాంశ్‌: వాడే. (శశాంక్‌ని చూపిస్తూ) వాడు కొట్టేటోడు.. నేను పడేటోడ్ని. (నవ్వుతూ )

►  మీ తమ్ముడు హీరో అవుతున్నాడు కదా. ఏమనిపిస్తుంది?
మేఘాంశ్‌: మంచిగా చెప్పురా ప్లీజ్‌.
శశాంక్‌: అలా చెప్పాలనే ఆలోచిస్తున్నా. ఫస్ట్‌ నాకు నవ్వొచ్చింది. బచ్చాగాడు హీరో అయిపోయాడు అనుకున్నాను. అయితే నేను చెప్పేదొక్కటే. హిట్‌ అయినా ఫట్‌ అయినా హంబుల్‌గా ఉండాలి.

►  మీ నాన్నగారు ఉన్నప్పుడు ఓసారి పదివేలకు చాక్లెట్లు కొన్నారట?
శశాంక్‌: నాన్నగారి కార్డ్‌ తీసుకెళ్లాడు. అక్కడున్న చాక్లెట్లు అన్నీ కొన్నాడు. రేయ్‌.. మేఘాంశ్‌ పదివేలు అయిందీ అంటే ఓ చాక్లెట్‌ పక్కన పెట్టి ఇప్పుడు 9 వేలే కదా తీసుకో అన్నాడు (నవ్వుతూ).
మేఘాంశ్‌: మాకు రిస్ట్రిక్షన్స్‌ ఉండేవి కావు. పాకెట్‌మనీ ఇచ్చేవాళ్లు కాదు. ఎవరికైనా డబ్బులిచ్చి మాతో పాటు పంపేవాళ్లు. మేం కొనుక్కునేవాళ్లం. అప్పుడు ఎంత అంటే అంత. ఇప్పుడు ఎంత అవసరం ఉంటే అంత.

►  యాక్టర్‌ అవుతున్నారు. హోమ్‌ వర్క్‌ కోసం నాన్న సినిమాలేమైనా చూశారా?
మేఘాంశ్‌: అలా ఏం చూడలేదు. అయితే నాన్నని చూడటం కోసమే ఆయన సినిమాలు చూస్తుంటాను.

►  మీ నాన్నగారికి తీరని కోరిక ఏదైనా మిగిలిపోయిందా?
శశాంక్‌: పాలిటిక్స్‌. ఇంకో సంవత్సరం ఉండి ఉంటే కచ్చితంగా పాలిటిక్స్‌లోకి ఎంటర్‌ అయ్యేవారు. ఆయనకు బాగా ఇంట్రెస్ట్‌. సహాయం చేయాలని అనుకుంటారు.

►  మరి మీలో ఎవరికైనా ఆ ఇంట్రెస్ట్‌ ఉందా?
మేఘాంశ్‌: ఇంట్రెస్ట్, నాలెడ్జ్‌ రెండూ లేవు.

►   నాన్న యాక్ట్‌ చేసిన సినిమాల్లో బాగా నచ్చినవి?
ఇద్దరూ: కింగ్, ఢీ, భద్రాచలం, విజయరామరాజు... ఇలా చాలా ఉన్నాయి.

►   తమ్ముడు హీరో అయ్యాడు.. మరి అన్న డైరెక్టర్‌ ఎప్పుడు అవుతాడు?
శశాంక్‌: షార్ట్‌ ఫిల్మ్స్‌ తీస్తున్నాను. ఇంకా ఏమీ అనుకోలేదు.

 
శశాంక్, మేఘాంశ్‌

మరిన్ని వార్తలు