మరో పాతికేళ్లు ఇలాగే అలరించాలి : వెంకటేశ్‌

20 Dec, 2016 23:56 IST|Sakshi
మరో పాతికేళ్లు ఇలాగే అలరించాలి : వెంకటేశ్‌

‘‘నాటుకోడి’ టైటిల్‌ మాసీగా, ఎనర్జిటిక్‌గా ఉంది. పాతికేళ్లుగా శ్రీకాంత్‌ ఎన్నో మంచి చిత్రాల్లో నటించి, మెప్పించారు. మరో పాతికేళ్లు తను ఇలాగే నటించి అందర్నీ ఎంటర్‌టైన్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో వెంకటేశ్‌. శ్రీకాంత్, మనోచిత్ర జంటగా నానికృష్ణ దర్శకత్వంలో బందరు బాబీ, నానికృష్ణ నిర్మించిన చిత్రం ‘నాటుకోడి’. యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయగా, వెంకటేశ్‌ స్వీకరించారు. తలసాని మాట్లాడుతూ– ‘‘శ్రీకాంత్‌ ఒక కమిట్‌మెంట్‌తో పైకొచ్చాడు. స్వయంకృషితో తనకంటూ ఓ ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం సక్సెస్‌ అయి టీమ్‌కు మంచి పేరు రావాలి’’ అన్నారు.

శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘మొదటిసారి అవినీతి పోలీసాఫీసర్‌గా నటించా. గతంలో నానికృష్ణ, నా కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవరాయ’లా ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ‘‘సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాల్లో మా ‘నాటుకోడి’ ఓ భాగం అవుతుంది’’ అని నానికృష్ణ అన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డైరెక్టర్‌ కల్యాణ్‌ కృష్ణ, హీరో తరుణ్, నటులు కోట శ్రీనివాస రావు, శివాజీరాజా, సంగీత దర్శకుడు రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు.