చారుశీల... స్వప్న బాల!

12 Aug, 2015 23:08 IST|Sakshi
చారుశీల... స్వప్న బాల!

‘‘ఈ చిత్రకథ విన్నప్పుడే హిట్ ఖాయం అనుకున్నా. అలాగే నేను చేసిన చారుశీల పాత్ర నా కెరీర్‌లో మెమొరబుల్‌గా నిలిచిపోతుందని ముందే తెలిసిపోయింది. సినిమా విడుదలయ్యాక కూడా అందరూ ఈ పాత్రను ఇష్టపడుతున్నారు. ఇంత మంచి పాత్ర ఇచ్చిన శివగారికి చాలా థ్యాంక్స్. పాటలపరంగా కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘చారుశీల.. స్వప్న బాల’ చాలా బాగుందని అందరూ అంటున్నారు’’ అని కథానాయిక శ్రుతీహాసన్ చెప్పారు.
 
 మహేశ్‌బాబు, శ్రుతి జంటగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్  పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్ మీట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ-‘‘ ‘శ్రీమంతుడు’ ఇంత పెద్ద శ్రీమంతుడు అవుతాడని ఊహించలేదు. ‘మంచి ఎమోషనల్ టచ్ ఉన్న సినిమా’ అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సాధారణంగా ఏ  సినిమా అయినా ఒక సెక్షన్‌కి నచ్చుతుంది, ఇంకో సెక్షన్‌కు నచ్చదు.
 
 కానీ అన్ని వర్గాల వారినీ ఆకట్టుకున్న సినిమా ఇది. ఇంత పెద్ద సక్సెస్‌ను అసలు ఊహించలేదు. తమిళ పరిశ్రమలోని దర్శక, నిర్మాతలందరూ ఫోన్ చేసి ఓ మంచి యూనివర్శల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తీశారని అభినందించారు’’ అని తెలిపారు. ‘‘మేం ఈ సినిమాను చాలా ప్రేమించి చేశాం. విడుదలయ్యాక ప్రేక్షకులు అంతకు మించిన ప్రేమను కురిపిస్తున్నారు. మంచి ఫీల్ గుడ్ మూవీకి చాలా పెద్ద సక్సెస్‌నిచ్చారు’’ అని జగపతిబాబు చెప్పారు.