అందుకే రెండు పడవల ప్రయాణం

17 Dec, 2017 01:42 IST|Sakshi

‘‘నేను దర్శకుడి కంటే ముందు రచయితని. నాలోని రచయితనే ఎక్కువ ఇష్టపడతాను’’ అన్నారు నటుడు–దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌. అల్లు శిరీష్‌ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో వస్తున్న ‘ఒక్క క్షణం’లో ముఖ్య పాత్ర పోషించారు అవసరాల. చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా అవసరాల శ్రీనివాస్‌ పలు విశేషాలు పంచుకున్నారు.

► ప్యారలల్‌ౖ లెఫ్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రమిది. ఒక జంట లైఫ్‌లో జరిగిన సంఘటనలు మరో జంటకు సంవత్సరం తర్వాత జరుగుతుంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? అన్నది మాత్రం సస్పెన్స్‌. నేను ఆర్కిటెక్‌ పాత్రలో కనిపిస్తాను. వీఐ ఆనంద్‌ తను చూసిన సంఘటనలతో ఈ కథ బాగా రాసుకున్నారు, బాగా తెరకెక్కించారు.

► ఇండస్ట్రీలో నా ప్రయాణం అంత సులువుగా జరగలేదు. ‘అమృతంలో చందమామ’ తర్వాత అవకాశాలు రాలేదు. ‘ఊహలు గుస గుసలాడే’తో మళ్లీ నటుడిగా బిజీ అయ్యాను. నాకు ఒకే బాటలో ఉండిపోవటం ఇష్టం ఉండదు. అందుకే నటుడిగా, దర్శకుడిగా రెండు పడవల్లో ప్రయాణం చేస్తున్నాను.

► దర్శకత్వం, రచన ఈ రెండిటిలో నేను రచనకే ఓటు వేస్తాను. ఒక సినిమా విజయం కథ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రచయితకు సరైన గుర్తింపు లభించడం లేదు. వాళ్ళ ఇగోను సంతృప్తిపరుచుకోవటానికి దర్శకులుగా మారుతున్నారు. డైరెక్టర్‌గా వారాహి సంస్థకు ఒక ప్రేమకథను, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ఒక థ్రిల్లర్‌ మూవీని చేయబోతున్నా. నేను ఇచ్చిన కథతో ఇతర దర్శకులు రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. నటుడిగా ‘అ!, మహానటి’ సినిమాలతో బిజీగా ఉన్నాను.

మరిన్ని వార్తలు