అంజన్న సన్నిధిలో..

9 Aug, 2018 08:34 IST|Sakshi
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న హీరో నితిన్, చిత్ర యూనిట్‌ బృందం

నిర్మాత దిల్‌ రాజు చినవెంకన్న, మద్ది క్షేత్రాలను దర్శించిన చిత్రయూనిట్‌

జంగారెడ్డిగూడెం సమీపంలోనిగుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారిని శ్రీనివాస కల్యాణంచిత్ర బృందం బుధవారం దర్శించుకుంది. ఈ సందర్భంగా క్షేత్రంలో మొక్కనాటి నీరు పోస్తున్న హీరో నితిన్‌

ద్వారకాతిరుమల: సమాజంలో ప్రతిఒక్కరి జీవితంలో ఉండే భావోద్వేగ క్షణాలే శ్రీనివాస కల్యాణం సినిమా అని.. ఈ సినిమాను చూస్తుంటే మీ ఇంట్లో ఓ పెళ్లి జరుగుతున్న అనుభూతి కలుగుతుందని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌ రాజ్‌ అన్నారు. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శ్రీనివాస కల్యాణం చిత్ర యూనిట్‌ బుధవారం సందర్శించింది. నిర్మాత దిల్‌ రాజ్, దర్శకుడు సతీష్‌ వేగేశ్న, హీరో నితిన్, హీరోయిన్లు రాశీ ఖన్నా, నందిత శ్వేత, నటులు రాజేంద్ర ప్రసాద్, అజయ్‌ స్వామి, అమ్మవార్లను దర్శించ ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజ్‌ శ్రీవారి విమానగోపుర స్వర్ణమయ పథకానికి రూ.1,26,000ను విరాళంగా ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావుకు అందించారు. కొద్దిసేపు వారు క్షేత్రంలో సందడి చేశారు. భక్తులు వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.

విలువలు ఉన్న సినిమా
శేషాచలకొండపైన అతిథి గృహంలో నిర్మాత దిల్‌ రాజ్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘శ్రీనివాస కల్యాణం’ టైటిల్‌ పెట్టినప్పటి నుంచి తనలో ఏదో వైబ్రేషన్‌ కలిగిందని చెప్పారు. ఏడుకొండల స్వామి దర్శనం వద్ద ఈ చిత్ర కథ తయారైందన్నారు. మనందరి జీవితాల్లో ప్రధానమైన పుట్టుక, పెళ్లి, చావు వంటి సంఘటనలపై దర్శకుడు సతీష్‌ వేగేశ్నతో షేర్‌ చేసుకునే సమయంలో ఈ కథకు జీవం ఏర్పడిందన్నారు. బొమ్మరిల్లు, శతమానంభవతి వంటి చిత్రాలు తర్వాత ఎంతో విలువలు ఉన్న సినిమాగా దీనిని రూపుదిద్దామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు తప్పకుండా కొన్ని విషయాలనైనా ఈ సినిమా నుంచి స్వీకరిస్తారన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు వారి పెళ్లి ఇలా జరిగితే బాగుంటుందన్న ఆశ కలుగుతుందన్నారు. గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరించనుందని చెప్పారు. చిత్ర విడుదలను పురస్కరించుకుని సెంటిమెంట్‌గా చిన వెంకన్నను దర్శించేందుకు ఇక్కడకు వచ్చామన్నారు.

మద్దిని దర్శించడం సెంటిమెంట్‌
జంగారెడ్డిగూడెం రూరల్‌: సినిమా విడుదలకు ముందు మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకోవడం సెంటిమెంట్‌ అని, స్వామివారిని దర్శించుకున్న తర్వాత విడుదల చేసిన ప్రతి చిత్రం విజయవంతమయ్యాయని సినీ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని బుధవారం శ్రీనివాస కల్యాణం చిత్ర బృందం సందర్శించింది. హీరో నితిన్, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేత, నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు వేగేశ్న సతీష్, నటులు రాజేంద్రప్రసాద్, అజయ్‌ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు వారికి స్వామి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు. అనంతరం నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ సుప్రీం, ఫిదా, జవాన్, రాజా ది గ్రేట్‌ వంటి చిత్రాల విడుదలకు ముందు మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్నట్టు చెప్పారు. దర్శకుడు వేగేశ్న సతీష్‌ మాట్లాడుతూ తాను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వాడినన్నారు. చిత్ర పంపిణీదారులు ఎల్‌వీఆర్, జంగారెడ్డిగూడెం రాజేశ్వరి థియేటర్‌ యాజమాన్యం నవీన్, రాజాన పండు, ఎస్సై వి.జగదీశ్వరరావు పాల్గొన్నారు. క్షేత్రంలోని ఉపాలయం వేంకటేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో హీరో నితిన్, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేత, నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు వేగేశ్న సతీష్, నటులు రాజేంద్రప్రసాద్‌ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు