అన్వేషణ ముగిసింది..కల ఫలించింది...

5 Jun, 2014 01:05 IST|Sakshi
అన్వేషణ ముగిసింది..కల ఫలించింది...

 ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. రెండూ క్లిష్టమైనవే. పెళ్లి గురించి పక్కన పెట్టి, ఇల్లు గురించి చెప్పాలంటే.. కట్టించుకోకుండా రెడీమేడ్‌గా కొనేసుకుందామన్నా, మనసుకు నచ్చిన ఏరియాలో, అభిరుచికి తగ్గది దొరకాలి. దొరికేవరకూ అన్వేషణ తప్పదు. కొన్ని నెలలుగా శ్రుతీ హసన్ సాగించిన ఇంటి అన్వేషణకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. నిన్న మొన్నటి వరకూ ముంబయ్‌లోని బాంద్రాలో అద్దె ఇంట్లో ఉండేవారు శ్రుతి.
 
 ఆ ఇంట్లోకి ఓ ఆగంతకుడు చొరబడటానికి ప్రయత్నించడం, అప్రమత్తంగా ఉండడంతో శ్రుతి ఎలాంటి ప్రమాదం ఎదుర్కోకుండా బయటపడడం తెలిసిందే. బహుశా అప్పటి నుంచే ఆ ఇల్లు ఖాళీ చేసి, సొంతింటికి మారిపోవాలనుకుని ఉంటారేమో. ముంబయ్‌లో ప్రముఖులు ఉండే ఏరియాల్లో ఒకటైన అంధేరీలో ఆమె ఓ ఫ్లాట్ కొనుక్కున్నారు. రెండు పడక గదులున్న ఈ ఫ్లాట్ శ్రుతి అభిరుచికి తగ్గట్టుగా ఉందట. ఓ శుభముహూర్తాన గృహప్రవేశం కూడా చేశారు శ్రుతి. అదే ఏరియాలో దర్శకుడు ఇంతియాజ్ అలీ, ప్రాచీ దేశాయ్ తదితరులు నివసిస్తున్నారు.
 
 ఇది ఇలా ఉంటే.. ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో దూసుకెళుతున్న శ్రుతికి భారీ అవకాశాలు చాలానే వస్తున్నాయి. త్వరలో మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో శ్రుతిని కథానాయికగా అడగడం, ఆమె పచ్చజెండా ఊపడం జరిగింది. మహేశ్ సరసన నటించనున్నందుకు శ్రుతీ హాసన్ చాలా ఎగ్జయిట్ అవుతున్నారట.