చారిత్రాత్మక చిత్రంలో శ్రుతిహాసన్

15 Feb, 2017 02:22 IST|Sakshi
చారిత్రాత్మక చిత్రంలో శ్రుతిహాసన్

బ్రహ్మాండమైన చారిత్రాత్మక చిత్రంలో క్రేజీ హీరోయిన్  శ్రుతీహసన్  ఒక భాగం కానున్నారా? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉందనే సమాధానమే కోలీవుడ్‌ వర్గాల నుంచి వస్తోంది. శ్రుతి ఇప్పుడు మంచి జోష్‌లో ఉన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఆ బ్యూటీ సూర్యకు జంటగా నటించిన సీ–3 మంచి విజయం సాధించింది. తాజాగా తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న శబాష్‌నాయుడు చిత్రంలో తొలిసారిగా ఆయనతో కలిసి నటిస్తున్నారు. ఇది తమిళం, తెలుగు, హింది భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం అన్నది గమనార్హం. హిందీలో బెహెన్ మోగి తెరి అనే చిత్రంతో పాటు, తెలుగులో పవన్ కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రంలోనూ నటిస్తున్నారు.

తాజాగా సంఘమిత్ర అనే హిస్టారికల్‌ మూవీలో నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తమిళం, తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుందర్‌.సీ దర్శకత్వం వహించనున్నారు. శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ తన నూరవ చిత్రంగా రూపొందనున్న ఇందులో ఇంతకు ముందు ఇళయదళపతి విజయ్, టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు వంటి నటులతో నిర్మించాలని భావించినా వారి కాల్‌షీట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో యువ స్టార్స్‌ జయంరవి, ఆర్యలను కథానాయకులుగా ఎంపిక చేశారు.

అదేవిధంగా వారికి జంటగా బాలీవుడ్‌ భామలు దీపికాపడుకునే, సోనాక్షిసిన్హాలను నటింపజేయాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఒక కథానాయకిగా టాప్‌ హీరోయిన్లలో ఒకరైన శ్రుతీహాసన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆ ఏడాది రెండవ భాగంలో సెట్‌పైకి వెళ్లనున్న సంఘమిత్ర చిత్రానికి సంబంధించిన పూర్తి వివారాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.