నాన్న , నేను అనుకునే అలా చేశాం : నాగార్జున

15 Feb, 2015 02:58 IST|Sakshi

 ‘‘నాన్నగారు ఇంకా చాలా రోజులు ఉండరని అప్పటికే మాకు తెలుసు. అందుకే, ఆయన చేతుల మీదుగా అఖిల్ పరిచయం అయితే బాగుంటుం దను కున్నాం. నాన్న గారి ఆశ కూడా అదే. అందుకే మేమిద్దరం అనుకుని, ‘మనం’ ద్వారా అఖిల్‌ను పరిచయం చేశాం. నాన్నగారి ఆశీర్వాదాలు చిన్నవి కాదు.. చాలా పెద్దవి’’ అంటూ తనయుడు అఖిల్ పరిచయ వేడుకలో అక్కినేని నాగార్జున ఉద్వేగంగా మాట్లాడారు. చిన్నప్పుడే ‘సిసింద్రీ’లో ఆకట్టుకున్న అఖిల్ ‘మనం’లో కొన్ని సెకన్లే కనిపించినా, ‘స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది’ అనిపించుకున్నారు. ఇక, పూర్తిస్థాయి హీరోగా అఖిల్ పరిచయం కానున్న చిత్రం ఆ మధ్య లాంఛనంగా ప్రారంభమైంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 కాగా, శనివారం రాత్రి హైదరాబాద్‌లో అక్కినేని అభిమానుల సమక్షంలో హీరోగా అఖిల్ పరిచయ వేడుకను భారీయెత్తున నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ - ‘‘ఈ కథ చాలా బాగుంది.  అయితే, ఇది ప్రేమకథా చిత్రం కాదు. పూర్తిగా మాస్ మూవీ’’ అన్నారు. ఇక, అఖిల్ దూసుకెళ్లిపోతాడని దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆశీర్వదించారు. వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘ఇది అభిమానులు పండగ చేసుకోవాల్సిన సమయం. పరిశ్రమకు కొత్త సూపర్ స్టార్ వచ్చాడు. క్రికెట్‌లో సిక్సర్లు, సెంచరీలు కొడతాడు.
 
 అలాగే, తన ప్రతి సినిమా కూడా సెంచరీయే అవుతుంది. అఖిల్ కచ్చితంగా తెరపైనా ఆల్‌రౌండర్ అవుతాడు’’ అని పేర్కొన్నారు. అమల మాట్లాడుతూ - ‘‘అక్కినేని కుటుంబంలోకి నాగార్జున ఫ్యాన్‌గా ప్రవేశించా. మా అబ్బాయిని మీ (అభిమానులను ఉద్దేశించి) చేతుల్లో పెడుతున్నాం. జాగ్రత్తగా చూసుకోండి. ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న హీరోయిన్ సాయేషా ఓ క్లాసిక్ బ్యూటీ’’ అని చెప్పారు. నాగచైతన్య మాట్లాడుతూ - ‘‘క్రికెట్ అంటే అఖిల్‌కి హాబీ. దాని కోసమే ఎంతో కష్టపడేవాడు. ఇక, సినిమా అంటే పిచ్చి. దీనికోసం ఏ స్థాయిలో కష్టపడతాడో ఊహించవచ్చు.
 
 దేశంలోని ప్రతి అభిమానినీ ఇంప్రెస్ చేస్తాడు’’ అన్నారు. వీవీ వినాయక్ మాట్లా డుతూ, ‘‘నన్ను నమ్మి నాగార్జునగారు పెద్ద బాధ్యతను నాకప్పగిం చారు. ఆయన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెడతాను’’ అని తెలిపారు. నితిన్ మాట్లాడుతూ - ‘‘నా ఆప్తమిత్రుడు అఖిల్‌తో సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నాగార్జునగారు నటించిన ‘నిన్నే పెళ్లాడతా’, వీవీ వినాయక్ గారి మాస్ సినిమాలు కలిస్తే ఈ సినిమా’’ అని చెప్పారు. ఈ వేడుకలో మహేశ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 
 చాలా ఉద్వేగంగా ఉంది : అఖిల్ అక్కినేని
 ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. చాలా ఉద్వేగంగా ఉంది. ముందుగా ఇద్దరు వ్యక్తులకు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్లే మా ‘అమ్మా, నాన్న’. ఒక మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో అమ్మ చెబుతుంటుంది. నాన్న అయితే ఎప్పుడూ అభిమానుల గురించే చెబుతుంటారు. మా అన్నయ్య (నాగచైతన్య) నా గురించి మాట్లాడుతుంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. మేమిద్దరం సూపర్ హిట్ మల్టీస్టారర్ మూవీ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నా. గత ఐదేళ్లుగా సీసీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా వెంకీ (వెంకటేశ్) మామతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కింది.

 అసలేం చేయాలి? ఎలాంటి సినిమా చేయాలి? అని తర్జన భర్జన పడుతున్న సమయంలో చీకట్లో సెర్చ్ లైట్‌లా కనిపించారు వినాయక్ గారు. మంచి కథ చెప్పారు. నేను అన్నయ్యలా భావించే నా స్నేహితుడు నితిన్ దాదాపు రెండు, మూడేళ్లుగా ‘నీ ఫస్ట్ సినిమా కమర్షియల్ హంగులతో ఉండాలి’ అని నసపెడుతూ వచ్చాడు (నవ్వుతూ). చివరికి తనే నా నిర్మాత కావడం ఆనందంగా ఉంది. సోమవారం నుంచి ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నాను. ఈ సమయంలో తాతగారు గుర్తొస్తున్నారు. ఆయన దేవుణ్ణి నమ్మేవారు కాదు. ఎందుకంటే అభిమానుల్లోనే దేవుణ్ణి చూసుకున్నారు. నాకూ వాళ్ళే దేవుళ్ళు.’’