వ్యోమగాములు చూసేందుకు నాసా ఏర్పాట్లు  

14 Dec, 2017 22:04 IST|Sakshi

హ్యూస్టన్‌: స్టార్‌వార్స్‌.. ప్రపంచవ్యాప్తంగా చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ అలరించిన సినిమా. స్టార్‌వార్స్‌ సీరిస్‌లోభాగంగా ఆ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘స్టార్‌ వార్స్‌: ద లాస్ట్‌ జేడీ’ మూవీ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇది అంతగా చెప్పుకోవాల్సిన విషయమేమీ కాదు.. కానీ ఈ సినిమాను చూడడానికి అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావడానికి ముందే అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోని వ్యోమగాములకు చూపించేందుకు అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ నాసా ఏర్పాట్లు చేస్తోంది.

నాసాతోపాటు సినిమాను నిర్మించిన డిస్నీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు స్పేస్‌ఫ్లైట్‌ రిపోర్టర్‌ రాబిన్‌ సీమంగల్‌ తన ట్విటర్‌ పోస్టులో వెల్లడించాడు. నాసా పబ్లిక్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌ డాన్‌ హువోట్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. ఐఎస్‌ఎస్‌ వ్యోమగాములు స్టార్‌ వార్స్‌ మూవీని చూడనున్నట్లు స్పష్టంచేశారు. అయితే వాళ్లు ఎప్పుడు చూస్తారన్నది మాత్రం హువోట్‌ చెప్పలేదు. డిజిటల్‌ ఫైల్‌ రూపంలో సినిమాను ఐఎస్‌ఎస్‌కు పంపిస్తామని, దానిని వాళ్లు అక్కడున్న ల్యాప్‌టాప్‌ లేదా ప్రొజెక్టర్‌లో చూస్తారని డాన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు