ఆ పుస్తకం షారూఖ్ ఆలోచనలు మార్చేసింది

12 Jul, 2016 11:17 IST|Sakshi

హీరోగా వ్యాపారా వేత్తగా బిజీగా ఉండే బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, ఏ మాత్రం కాళీ సమయం దొరికినా పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతాడు. ఎక్కువగా ఫిక్షన్, నాన్ ఫిక్షన్ రచనలను ఇష్టపడే షారూఖ్, ఇటీవల చదివిన స్టీవ్ జాబ్స్ బయోగ్రఫి, వ్యాపారం పట్ల తన ఆలోచనా విధానాన్ని మార్చేసిందంటున్నాడు. యాపిల్ సహ వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ సూచించినట్టుగా ఒక సమయంలో కేవలం ఒక పని మీదే దృష్టి పట్టాలని నిర్ణయించుకున్నాడు షారూఖ్.

ప్రస్తుతం తన వ్యాపార సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా క్రియేటివ్ ఫీల్డ్కు సంబంధించిన ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు షారూఖ్. సినిమా నిర్మాణంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, టివి ప్రొడక్షన్, యాడ్ ఫిలిం మేకింగ్ లాంటి రంగాల్లో ఉన్న షారూఖ్, టివి, యాడ్ రంగాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. పూర్తిగా సినీ రంగం మీద దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించాడు షారూఖ్ ఖాన్.