మార్పులకు ఆస్కారం

3 May, 2020 00:14 IST|Sakshi

కోవిడ్‌–19 (కరోనా వైరస్‌) ప్రభావం వల్ల రానున్న 93వ ఆస్కార్‌ నియమాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఆ మార్పులు 93వ ఆస్కార్‌ వేడుక వరకే. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినిమాల రిలీజులు ఆగిన విషయం తెలిసిందే. ఇందువల్ల కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యాయి. ఇలా విడుదలైన వాటిలో ప్రేక్షకులు అమితంగా మెచ్చిన సినిమాలు ఉండొచ్చని, ఆయా చిత్రబృందాల కష్టానికి నిజమైన ప్రతిఫలం దక్కాలనే ఉద్దేశంతో ‘అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ బోర్డ్‌’ ఆస్కార్‌ అవార్డుల నియమాల్లో మార్పులు చేసింది.

దీంతో డైరెక్ట్‌ ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ అండ్‌ వీఓడీ (వీడియో ఆన్‌ డిమాండ్‌) ద్వారా విడుదలైన సినిమాలు కూడా ఈసారి ఆస్కార్‌ అవార్డ్స్‌ పోటీ బరిలో ఉండొచ్చు. అయితే భవిష్యత్తులో ఈ సినిమాలు కచ్చితంగా థియేట్రికల్‌ రిలీజ్‌ను ప్లాన్‌ చేసుకుని ఉండాలనే షరతు పెట్టారు. అలాగే సౌండ్‌ మిక్సింగ్, సౌండ్‌ ఎడిటింగ్‌ విభాగాలను కలిపి ఒకే అవార్డు విభాగం కింద పరిగణించనున్నట్లు ఆస్కార్‌ అవార్డ్‌ కమిటీ వెల్లడించింది. ‘‘సినిమాను థియేటర్‌లో చూడడాన్ని మించిన అనుభూతి లేదు. కానీ కోవిడ్‌ 19 వైరస్‌ వల్ల ఆస్కార్‌ అవార్డు అర్హత నియమాల్లో తాత్కాలిక మార్పులు చేయక తప్పలేదు.

ఒకసారి థియేటర్స్‌ ఓపెన్‌ అయితే పాత రూల్సే వర్తిసాయి’’ అని అకాడమీ అధ్యక్షుడు డేవిడ్‌ రూబిన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 93వ ఆస్కార్‌ వేడుక 2021 ఫిబ్రవరి 28న జరగనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... సౌండ్‌ మిక్సింగ్, సౌండ్‌ ఎడిటింగ్‌ విభాగాలను కలిపి ఒకే అవార్డుగా పరిగణించాలనే నిర్ణయం పట్ల భారతీయ సౌండ్‌ డిజైనర్, సౌండ్‌ ఎడిటర్, సౌండ్‌ మిక్సర్‌ రసూల్‌ పూకుట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని అకాడమీ పునఃసమీక్షించుకోవాలని అభిప్రాయపడ్డారు రసూల్‌. 2008లో వచ్చిన ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రానికి సౌండ్‌ మిక్సింగ్‌ విభాగంలో ఇయాన్, రిచర్డ్‌లతో కలిసి రసూల్‌ ఆస్కార్‌ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు