లాకింగ్‌ అండ్‌ పాపింగ్‌!

6 Feb, 2019 03:37 IST|Sakshi
శ్రద్ధాకపూర్

యూకేలో ఉండే ఆ పాకిస్థానీ అమ్మాయి, పంజాబ్‌ కుర్రాడు డ్యాన్స్‌లో పోటీపడాల్సి వచ్చింది. ఒకరు విజేతగా నిలుస్తారు. ఆ తర్వాత వీరిద్దరికీ పోటీగా మరో డ్యాన్సర్‌ సవాల్‌ విసిరాడు. ఫైనల్‌గా విజేత ఎవరు? అనే విషయం తెలుసుకోవాలంటే చాలా టైమ్‌ పడుతుంది. కానీ ఈ సినిమా లండన్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ కోసం మాత్రం టైమ్‌ దగ్గర పడింది. రెమో డిసౌజా దర్శకత్వంలో వరుణ్‌ ధావన్, శ్రద్ధాకపూర్, నోరా ఫతేహీ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమాకు ‘స్ట్రీట్‌ డ్యాన్సర్స్‌ 3’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో వరుణ్‌ ధావన్, శ్రద్ధాకపూర్‌లకు చెందిన లుక్స్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో పంజాబ్‌ కుర్రాడి పాత్రలో వరుణ్‌ ధావన్, పాకిస్థానీ అమ్మాయి పాత్రలో శ్రద్ధాకపూర్‌ నటిస్తున్నారు.

ఈ సినిమా కోసం శ్రద్ధా ఐదురకాల కొత్త డ్యాన్సులు నేర్చుకున్నారు. ‘అఫ్రో, లాకింగ్‌ అండ్‌ పాపింగ్, క్రంప్, టుట్టింగ్‌ అండ్‌ యానిమేషన్, అర్బన్‌’.. ఈ ఐదు రకాల నృత్యాలను యూకేలో ఉంటున్న భారతీయ నృత్యకారుడు ప్రశాంత్‌ షిండే, టానియా టోరియాల నుంచి నేర్చుకున్నారు. శ్రద్ధాకి డ్యాన్స్‌ నేర్పించడం కోసం ఈ ఇద్దరూ ఇండియా వచ్చారు. ఇక ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఈ నెల 10న లండన్‌లో జరగనుంది. మార్చి 25 వరకు ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. ఇంతకుముందు రెమో డిసౌజా దర్శకత్వంలోనే 2013లో ‘ఏబీసీడీ’ (ఏనీ బడీ కేన్‌ డ్యాన్స్‌), 2015లో ‘ఏబీసీడీ 2’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘స్ట్రీట్‌ డ్యాన్సర్స్‌ 3’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్‌ 8న విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు