మన ఇంట్లోనో ..పక్కింట్లోనే జరిగినట్లు..

24 Dec, 2014 12:20 IST|Sakshi

చెన్నై : తనకు సినిమాల్లో అవకాశం తగ్గినప్పుడు బుల్లితెర ద్వారా బాలచందర్ ఛాన్సులు ఇచ్చి  ..తనకు  భిక్ష పెట్టారని నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు. ఆయన బుధవారం ఉదయం బాలచందర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ బాలచందర్ తనకు గురువు అని గుర్తు చేసుకున్నారు. ఆయన తీసిన సినిమాలు మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినవేనని... వారి సమస్యలతో పాటు మానసిక స్థితిని వెండితెరపై బాగా చూపించేవారన్నారు.

బాలచందర్ సినిమాలు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాయని..'మన ఇంట్లోనో లేక పక్కింట్లోనే..ఎక్కడో జరిగినట్లుగా  నిజ జీవితానికి' దగ్గరగా ఉంటాయన్నారు.  ఆయన సృష్టించిన పాత్రల్లో నటించిన నటులకు కూడా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. మధ్య తరగతి కుటుంబాల మానసిక స్థితిని ఏ దర్శకుడు ఇంత దగ్గరగా చిత్రీకరించలేదన్నారు. ఈ సందర్భంగా బాలచందర్తో తనకు ఉన్న అనుబంధాన్ని శుభలేఖ సుధాకర్ గుర్తు చేసుకున్నారు.