విజయం చాలా అవసరం

27 Jul, 2014 23:39 IST|Sakshi
విజయం చాలా అవసరం

నా కొక విజయం చాలా అవసరం అంటున్నారు నట, దర్శక, నిర్మాత పార్తీపన్. జయాపజయాలను పక్కన పెడితే పార్తీపన్‌లో మంచి నటుడే కాదు అంతకు మించి మంచి క్రేయేటర్ ఉన్నారు. సినిమా అంటే కాలక్షేప మాధ్యమమే కాదు ప్రజలను ఆలోచింప చేసే వారికి ఉపయోగపడే అంశాలుండాలని భావించే కళాకారుడు పార్తీపన్. అయితే ప్రేక్షకుల నాడిని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు. అలాగని ప్రయత్నం చేయడం తప్పుకాదు. చిన్న గ్యాప్ తరువాత ‘కథై తిరైకథై వచనం ఇయక్కం’ అనే చిత్రంతో కొత్త రకం ప్రయోగం చేశారు. ఈ చిత్రం ఆగస్టు ఒకటిన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు పార్తీపన్ భావాలను తెలుసుకుందాం.
 
  కథే లేకుండా చిత్రం తీయడం ప్రయోగమా?
  దీన్ని ఒకయుక్తిగా భావించవచ్చు. పాటలు, మాటలు, హీరోహీరోయిన్లు లేకుండా చిత్రాలు వచ్చినట్లుగా కథే లేకుండా చిత్రం రూపొందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ఈ కథై తిరైకథై వచనం ఇయక్కం. చిత్రం తొలి భాగం సరదా సన్నివేశాలలో సాగుతుంది. రెండవ భాగం ముందు సన్నివేశాలకు కారణమేమిటన్న అంశాలు చోటు చేసుకుంటాయి. రెండవభాగం చూసేటప్పుడు ఒక కథ ఉందన్నది తెలుస్తుంది. ఈ అనుభవం ఖచ్చితంగా ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది.
 
  చిత్రంలో చాలామంది స్టార్స్ ఉన్నారట!
  వ్యాపారం కోసమే. అయితే నేను చేసే వ్యాపారం చిత్రంలో ఇంతమంది స్టార్స్ నటించారు. నా చిత్రంపై నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంపై జరిగే వ్యాపారం ఇది. ఇందరు స్టార్స్ ఉంటే ఎంత న్యాయం జరుగుతుందో దాన్ని రాబట్టడం వ్యాపార లక్షణమేగా.
 
  చిత్రం వెయిట్ పెంచుకుంటూ పోయినట్లున్నారు?
  విజయమే గౌరవ మర్యాదలను నిర్ణయిస్తుంది. ఆ విధంగా నాకిప్పుడొక కమర్షియల్ విజయం చాలా అవసరం. అందుకే ఈ స్థాయి లో తీశాను. ఇందులో పదిమంది ప్రముఖతార లు నటించారు. ఈ రోజు జీవితాన్ని ఈ రోజే అనుభవించు అనే తత్వం పాట ఈ తరం జాతీ యగీతంగా ఈపాట ఉంటుంది.ఆ నటీనటులందరూ పాట వినే నటించడానికి అంగీకరించారు.
 
  పెద్దరిస్క్ చేశారా?
  నిజమే. అయితే తొలుత నేను ఆడియన్స్‌ను నమ్ముతాను. ఆ తరువాత నన్ను నేను నమ్ముతాను. నన్ను నమ్మిన నిర్మాత కె.చంద్రశేఖర్ కోసం నిజంగా శ్రమించాను. చిత్రం ఆరంభంలోనే నేనీ చిత్రంలో నటించకూడదు. నూత న తారలతోనే చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాను. వేరే దారి లేక సీనియర్ నటుడు తంబిరామయ్యను ముఖ్యపాత్రలో నటింప చేశాను. మిగిలిన వారందరూ నూతన తారలే.