అందుకు ధైర్యం కావాలి

30 Apr, 2019 02:04 IST|Sakshi
లగడపాటి శ్రీధర్, సుకుమార్, లగడపాటి సహిదేవ్‌

– సుకుమార్‌

‘రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి సినిమాల్లో నటించిన విక్రమ్‌ సహిదేవ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్‌ బ్రేవ్‌ హార్ట్‌’ అన్నది ఉపశీర్షిక. ప్రియాంక జైన్‌ కథానాయికగా, రఘు కారుమంచి కీలకపాత్రలో నటించారు. రఘు జయ దర్శకత్వంలో లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమాని మే 11న విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకుడు సుకుమార్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘తమిళ సినిమా ‘గోలి సోడా’కు రీమేక్‌ ఇది. ఈ చిత్రం ట్రైలర్‌ చాలా బావుంది. కొన్ని విజువల్స్‌ చూశా.. విక్రమ్‌ బాగా చేశాడు. తను 15ఏళ్లకే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో అంత పెద్ద పాత్రను తన భుజాల మీద మోయడం గొప్ప విషయం. ఇప్పుడు తనకు 17 ఏళ్లు. ఇంకా ఇంటర్‌ పూర్తి కాలేదు. లగడపాటి శ్రీధర్‌గారు విక్రమ్‌ని హీరోగా పెట్టి పెద్ద సినిమాతో భారీ లాంచింగ్‌ ప్లాన్‌ చేయొచ్చు.

అలా కాకుండా కుమారుడు ఆర్టిస్టుగా ఎదగాలని, కళాకారుడిగా ఒక ప్రయాణం కొనసాగించాలని అనుకోవడం చాలా బాగా నచ్చింది. విక్రమ్‌ సహిదేవ్‌కు ఈ సినిమా పెద్ద విజయం అందించాలని కోరుకుంటున్నా. ఈ సినిమాతో శ్రీకాంత్‌ ఎడిటర్‌గా పరిచయం అవుతున్నారు. కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయవచ్చు గానీ.. కొత్త సాంకేతిక నిపుణులను పరిచయం చేయడానికి ధైర్యం కావాలి. శ్రీధర్‌గారికి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘టీనేజ్‌ ప్రేమకథతో తెరకెక్కిన న్యూ ఏజ్‌ రివెంజ్‌ డ్రామా ఇది. మా విక్రమ్‌ సహిదేవ్‌కు మంచి పేరు తెస్తుందని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు లగడపాటి శ్రీధర్‌.

మరిన్ని వార్తలు