తాతగారు చివరగా చూసిన సినిమాల్లో ఇదొకటి!

1 Nov, 2016 00:06 IST|Sakshi
తాతగారు చివరగా చూసిన సినిమాల్లో ఇదొకటి!

‘‘2012లో ‘విక్కీ డోనర్’ చూశా, బాగా నచ్చింది. చివరి రోజుల్లో తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) టీవీలో చూసిన చివరి రెండు మూడు సినిమాల్లో ఇదొకటి. ‘తెలుగులో ఇలాంటి సినిమా ఎందుకు చేయకూడదు’ అన్నారాయన. ఏడాదిపాటు ‘విక్కీ డోనర్’ లాంటి స్క్రిప్ట్ కోసం ఎదురు చూశా. నిర్మాత రామ్మోహన్ సలహాతో రీమేక్‌కి ఓటేశా. రియల్ లైఫ్‌లో నాకు పిల్లలు లేకపోవడం ఈ సినిమా చేయడానికి ఓ కారణం’’ అని సుమంత్ అన్నారు. ఆయన హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుధీర్ పూదోట, వై.సుప్రియ నిర్మించిన సినిమా ‘నరుడా.. డోనరుడా’. హిందీ ‘విక్కీ డోనర్’కి ఇది రీమేక్. మల్లిక్ రామ్ దర్శకుడు.

ఈ నెల 4న రిలీజవుతోంది. ‘‘ఓ మహిళగా చెబుతున్నా.. ఫ్యామిలీ అందరూ చూడదగ్గ చిత్రమిది. వైవిధ్యమైన, సున్నితమైన కథను మల్లిక్ రామ్ తెరకెక్కించిన తీరు బాగుంది’’ అని వై. సుప్రియ అన్నారు. ‘‘వీర్యదానం మీద చాలా సినిమాలొచ్చాయి. కానీ, ‘విక్కీ డోనర్’ వంటి గొప్ప సినిమా ఇప్పటివరకూ రాలేదు’’ అని మల్లిక్ రామ్ అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ -‘‘కథ  గీత దాటితే.. జుగుప్సగా, బూతుగా అనిపించే అవకాశం ఉంది. కానీ, హృదయానికి హత్తుకునేలా తీశారు’’ అన్నారు. ‘‘సుమంత్ ఎలాంటి పాత్రలోనైనా నటించగలడని ఈ సినిమా నిరూపిస్తుంది’’ అని సుధీర్ పూదోట అన్నారు.
 

>