అపరిచితుల ప్రయాణం

27 Feb, 2020 03:14 IST|Sakshi
ఇంద్రజ, సుమంత్‌ అశ్విన్, ప్రియ వడ్లమాని

నలుగురు అపరిచితులు.. 3,450 కిలోమీటర్లు రోడ్డుపై ప్రయాణం.. వాళ్ల ప్రయాణం దేనికోసం? ఆ సమయంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేంటి? అనే కథాంశంతో ఓ సినిమా మొదలైంది. సుమంత్‌ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకులు రామ్‌గోపాల్‌ వర్మ, పూరి జగన్నాథ్, నగేష్‌ కుకునూర్‌ వద్ద పని చేసిన గురుపవన్‌ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. గురప్ప పరమేశ్వర ప్రొడక్ష¯Œ ్స పతాకంపై జి. మహేష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కెమెరామేన్‌ సి. రాంప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ఎన్‌.బి. బాలసుబ్రహ్మణ్యం క్లాప్‌ ఇచ్చారు. గురుపవన్‌ మాట్లాడుతూ –‘‘భిన్న నేపథ్యాలు కలిగిన నలుగురు అపరిచితులు హైదరాబాద్‌ నుంచి బైకులపై చేసే ప్రయాణమే ఈ సినిమా.

మార్చి 2న తొలి షెడ్యూల్‌ మొదలుపెడతాం’’ అన్నారు. ‘‘శ్రీకాంత్, ఇంద్రజ వంటి మంచి నటులతో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు సుమంత్‌ అశ్విన్‌. ‘‘శ్రీకాంత్, నేను ‘జంతర్‌ మంతర్‌’ సినిమాతో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యాం. ఇన్నాళ్లకు ఆయనతో మళ్లీ సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఇంద్రజ. ‘‘గురు పవన్‌ చెప్పిన కథ నచ్చడంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నా’’ అన్నారు మహేష్‌. ప్రియ వడ్లమాని, సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ చిరంజీవి ఎల్‌. మాట్లాడారు. అమ్ము అభిరామి, నాజర్, పృథ్వీ, ఈశ్వరీ రావు, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించనున్నారు.

మరిన్ని వార్తలు