సమ్మర్‌లో సందడే సందడి!

16 Mar, 2015 22:35 IST|Sakshi

 వేసవి కాలం... సినీ ప్రియులకు పండగ కాలం. ఏసీథియేటర్లో తమ ఫేవరెట్ స్టార్ లేటెస్ట్ మూవీ చూస్తూ రీఛార్జ్  కావాలని చాలామంది కోరుకుంటారు. ఎప్పుడూ ప్రీ ప్లాన్డ్‌గా ఉండే బాలీవుడ్ సమ్మర్‌ని క్యాష్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 20న నుంచి మొదలుపెట్టి జూన్ 5 వరకు దాదాపు డజను హిందీ సినిమాల వరకూ విడుదల కానున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం...

 
 ప్లేబోయ్ ఇబ్బందులు!
 ప్రేమలో పడ్డ ఓ ప్లేబోయ్ కథ ‘హంటర్’. ప్రేయసి వచ్చాక ఈ ప్లేబోయ్‌ని గత జీవితం తాలూకు ఆనవాళ్లు ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తాయి? అనే కథాంశంతో నూతన దర్శకుడు హర్షవర్ధన్ కులకర్ణి ఈ సినిమా తీశాడు. గుల్షన్ దేవయ్య హీరో. రాధికా ఆప్టే, సాయి తమంకర్ కథానాయికలు.
 
 ప్రేయసి కోసం అప్పులు
 ఐపీయస్ ఆఫీసర్ కావాలనే ఆశయం ఉన్న ఓ యువకుడు ప్రేమలో పడతాడు. ప్రేయసి మెప్పు పొందడానికి బ్యాంక్‌లో లోన్ తీసుకుని కారు కొంటాడు. ఆ అప్పు తీర్చలేక, డబ్బు మనిషి అయిన ఆ ప్రేయసికి అసలు విషయం చెప్పలేక అతను పడే బాధలు ఎలాంటివి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఢిల్లీవాలీ జాలీమ్ గాళ్‌ఫ్రెండ్’. జపీందర్ కౌర్ దర్శకుడు. దివ్యేందు శర్మ, ప్రచీ మిశ్రా జంటగా నటించారు.
 
 దుష్టశక్తిని అడ్డుకునే డిటెక్టివ్
 1940లలో కోల్‌కతా నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన చిత్రం ‘డిటెక్టివ్ బ్యోమకేష్ భక్షి’. ఫక్తు క్రైమ్ థ్రిల్లర్. ప్రపంచాన్ని అంతం చేయడానికి ఓ దుష్టశక్తి పన్నిన కుట్రను ఓ యువ ప్రైవేట్ డిటెక్టివ్ ఎలా అడ్డుకున్నాడు? అనేది చిత్రకథ. డిటెక్టివ్ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ చేయగా, డిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు.
 
 లీలా.. భలే హాట్ గురూ
 హాట్ గాళ్ సన్నీ లియోన్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘ఏక్ పహేలీ లీలా’. ఈ చిత్రం ప్రచార చిత్రాలు, పాటలు ఇప్పటికే భారీ ఎత్తున అంచనాలు పెంచాయి. సన్నీ హద్దు మీరి అంగాంగ ప్రదర్శన చేసిన వైనం ఫొటోల్లో చూసి, ఈ చిత్రాన్ని మిస్ కాకూడదని చాలామంది ఫిక్సయ్యారు. పూర్వ జన్మల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో 300 ఏళ్ల క్రితం అమ్మాయిగా, నేటి తరం యువతిగా.. ఇలా సన్నీ పలు అవతారాల్లో కనిపించనున్నారు. బాబీఖాన్ దర్శకుడు.
 
 ముంబై నుంచి గోవా ప్రయాణం   విడుదల: ఏప్రిల్ 10
 ఇద్దరు పిల్లలు... చిన్నప్పటి నుంచి అమ్మా, నాన్న, స్కూలు.. ఇదే లోకం. అనుకోకుండా ‘వాళ్లకో నానమ్మ ఉందనీ, కేన్సర్‌తో బాధపడుతోందనీ తెలిసింది. ఆ జబ్బుకు అర్థం తెలియని ఆ పసి మససులు... డి క్షనరీలో చూసి అర్థం తెలుసుకున్నారు. తెగ బాధపడిపోయారు. నానమ్మను తీసుకొద్దామని అమ్మా, నాన్నలను అడిగారు.. వాళ్లు ఒప్పుకోలేదు... కుదరదన్నారు.. అంతే... ఎలాగైనా నానమ్మని చూడాలని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబై నుంచి గోవా బయలుదేరారు. తమకు ఏమాత్రం తెలీని ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆ ప్రయాణంలో ఏమైంది..? వాళ్లిద్దరూ నానమ్మను చేరుకున్నారా....? లేదా..? అన్నది తెలుసుకోవాలంటే ‘బేర్ ఫుట్ టూ గోవా’ను చూడాల్సిందే. అత్యంత సున్నితమైన భావోద్వేగాలను స్పృశించిన  ఈ సినిమాకి దర్శకుడు ప్రవీణ్ మోర్చాలే. సినిమా విడుదల కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా 18 మంది నుంచి 50 లక్షలు సేకరించారు.
 
 మిస్టర్ ఎక్స్ థ్రిల్‌కి గురి చేస్తాడా?
 హారర్ చిత్రాలు, సైన్స్ ఫిక్షన్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించగల సత్తా ఉన్న దర్శకుడు విక్రమ్‌భట్. ఆయన రూపొందించిన తాజా త్రీడీ చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే సూపర్ హీరో మూవీ ఇది. మిస్టర్ ఎక్స్‌గా ఇమ్రాన్ హష్మీ, ఆయన సరసన అమైరా దస్తూర్ నటించారు. అదృశ్య శక్తులు పొందే వ్యక్తి తనను తప్పుదోవ పట్టించినవారిపై ఎలా పగ తీర్చుకున్నాడు? అనేది కథాంశం. ఇందులో నిర్మాత మహేశ్ భట్ టైటిల్ సాంగ్ కూడా పాడటం విశేషం.
 
 గబ్బర్ మళ్లీ వస్తున్నాడు
 అక్షయ్‌కుమార్, శ్రుతీహాసన్ జంటగా తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’. తమిళ చిత్రం ‘రమణ’ (తెలుగులో ‘ఠాగూర్’)కి రీమేక్ ఇది. అవినీతిని అంతం చేయాలనే లక్ష్యంతో సాగే గబ్బర్ అనే వ్యక్తి కథ ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ రీమేక్‌పై భారీ అంచనాలున్నాయి.
 
 డబుల్ మస్తీ
 సన్నీ లియోన్ అభిమానులకు ఈ వేసవి డబుల్ ధమాకా ఇచ్చినట్లే. ‘ఏక్ పహేలీ లీలా’లో కనిపించిన కొన్ని రోజులకే మళ్లీ ‘మస్తీజాదే’తో తెరను కనువిందు చేయనున్నారు సన్నీ. శృంగార ప్రధానంగా సాగే వినోదాత్మక చిత్రం ఇది. ఇందులో సన్నీ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. మిలాప్ జవేరీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
 
 తండ్రీ, కూతుళ్ల అనుబంధం
 మంచి కథాంశాలను ఎన్నుకుని, తెరకెక్కించే దర్శకుడిగా సూజిత్ సర్కార్‌కి పేరుంది. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పీకు’. తండ్రీ, కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. తండ్రిగా అమితాబ్ బచ్చన్, కూతురిగా దీపికా పదుకొనె నటించారు.
 
 మరోసారి సన్నీ..
 మే 1న కనిపించి, వారం తిరిగేసరికల్లా మళ్లీ సన్నీ లియోన్ కనిపించబోతున్న చిత్రం ‘కుచ్ కుచ్ లోచా హై’. ఇందులో సన్నీ సినిమా తార పాత్రలో కనిపించనున్నారు. గుజరాత్‌కి చెందిన బడా వ్యాపారవేత్త పాత్రను రామ్‌కపూర్ చేశారు. ప్రధానంగా ఈ ఇద్దరి చుట్టూ కథ తిరుగుతుంది. దేవంగ్ ధోలాకియా దర్శకత్వం వహించారు.
 
 ముంబయ్ చరిత్రతో...
 1960ల్లో సాగే కథతో రూపొందిన చిత్రం ‘బాంబే వెల్వట్’. బాక్సర్‌గా చేసే యువకుడు, జాజ్ సింగర్‌గా సాగే అమ్మాయి తమ కలలను సాకారం చేసుకోవడానికి ఏం చేశారు? అనేది ఈ చిత్రకథ. ముంబయ్ చరిత్రను కూడా చూపించే చిత్రం కావడంతో బాంబే వెల్వట్ అని టైటిల్ పెట్టారు. రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ జంటగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
 
 మరోసారి స్వాగతం
 ‘వెల్కమ్’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ఇది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో జాన్ అబ్రహాం, శ్రుతీహాసన్, నానా పటేకర్, అనిల్ కపూర్ తదితరులు నటించారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అనీస్ బజ్మీ దర్శకత్వంలోనే మలి భాగం కూడా రూపొందింది.
 
 తను, మనూ  మళ్లీ వస్తున్నారు
 మాధవన్, కంగనా రనౌత్ జంటగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రూపొందిన ‘తను వెడ్స్ మను’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘తను వెడ్స్ మను రిటర్న్స్’. ఇందులో తమిళ నటుడు ధనుష్ అతిథి పాత్ర చేయడం విశేషం.
 
 నౌకలో ఏం జరిగింది?
 నౌకలో ప్రయాణం చేస్తున్న ఓ పంజాబీ కుటుంబం, ఇతర ప్రయాణీకుల చుట్టూ సాగే కథతో రూపొందిన చిత్రం ‘దిల్ దడక్నే దో’. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క శర్మ, ప్రియాంకా చోప్రా, రణ్‌వీర్ సింగ్, షెఫాలీ షా, అనిల్ కపూర్ తదితరులు నటించారు.
 
 - డి.జి. భవాని