విశాల్‌కు సమన్లు

12 May, 2019 09:44 IST|Sakshi

పెరంబూరు: నడిగర్‌ సంఘానికి చెందిన స్థలం విక్రయ వ్యవహారంలో తగిన ఆధారాలు సమర్పించాలని నటుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్‌కు సమన్లు జారీ చేశారు. అయితే శుక్రవారం విశాల్‌ గైర్హాజరయ్యారు. వివరాలు.. కాంచీపురం జిల్లా సెంగల్‌పట్లు తాలూకా గుడువాంచేరిలో నడిగర్‌ సంఘానికి 26 సెంట్ల స్థలం ఉంది. దాన్ని గత సంఘ అధ్యక్షుడు శరత్‌కుమార్, రాధారవి తదితరులు అక్రమంగా విక్రయించారంటూ ప్రస్తుత సంఘ అధ్యక్షుడు నాజర్‌ కాంచీపురం జిల్లా క్రైంబ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా చెన్నై హైకోర్టులోనూ విశాల్‌ వర్గం పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆధారాలుంటే నటుడు శరత్‌కుమార్, రాధారవి తదితరలను అరెస్ట్‌ చేసి విచారించాలని పోలీసులను ఆదేశించారు.

దీంతో కాంచీపురం నేర పరిశోధన శాఖ పోలీసులు శరత్‌కుమార్, రాధారవి, తదితర నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా ఈ కేసులో తగిన ఆధారాలను అందజేయాలని కోరుతూ పోలీసులు నటుడు విశాల్‌కు సమన్లు జారీ చేశారు. కాగా ఈ విషయమై విశాల్‌ శుక్రవారం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. ఆయన తరఫు వ్యక్తి వచ్చి విశాల్‌ షూటింగ్‌లో ఉన్న కారణంగా హాజరు కాలేకపోయారని, మరో రోజు హాజరవుతారని, కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పిస్తారని తెలిపారు. దీంతో విశాల్‌ తగిన ఆధారాలు అందిస్తేనే ఈ కేసులో ముందుకు వెళ్లగలమని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.  

మరిన్ని వార్తలు