అమ్మమ్మగారి ఇల్లు అనుబంధాల హరివిల్లు

27 Nov, 2019 11:57 IST|Sakshi
హీరో నాగశౌర్యతో.. 

మనసుకు నచ్చిందే చేస్తా.. 

భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తా 

చిత్ర దర్శకుడు సుందర్‌ సూర్య

అతిథితో కాసేపు... 
‘ఆప్యాయతలు.. అనుబంధాలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను పెరిగిన వాతావరణం అలాంటిది. అమ్మ ప్రోత్సాహంతోనే సినిమా రంగంలో రాణిస్తున్నా. 12 ఏళ్ల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. ఆనంద క్షణాల్ని గుర్తుచేసుకుంటూ ప్రస్తుత కాలాన్ని గడపాలనే చిన్నలైన్‌ ఆధారంగానే ‘అమ్మమ్మగారి ఇల్లు’ సినిమా తీశా’ అంటూ బోలెడు ముచ్చట్లు చెప్పారు చిత్ర దర్శకుడు సుందర్‌ సూర్య. కథా చర్చల కోసం నగరానికి వచ్చిన ఆయన్ని ‘సాక్షి’ పలకరించింది. విశాఖతో తన అనుబంధాన్ని వివరించారు సుందర్‌. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
 – ఏయూక్యాంపస్‌(విశాఖ తూర్పు)

అమ్మ ప్రోత్సాహం...  
చిన్నతనం నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే సినీరంగాన్ని ఎంచుకున్నా. కుటుంబంలో పెద్దన్నయ్య ప్రభుత్వ ఉద్యోగి, చిన్నన్నయ్య వ్యాపారి. నాకు నచ్చిన రంగంలో రాణించాలని అమ్మ మణి ప్రోత్సహించింది. 

నా నమ్మకం అదే...  
మనసుకు నచ్చిన పనిచేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. దీనిని నేను బలంగా విశ్వసిస్తాను. అందుకే చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలనే బలమైన కాంక్షతో ముందుకు సాగా. ‘అమ్మమ్మగారి ఇల్లు’ చిత్రీకరణ నా బలమైన ఆకాంక్షను సాకారం చేసింది. ఆనంద క్షణాల్ని గుర్తుచేసుకుంటూ ప్రస్తుత కాలాన్ని గడపాలనే చిన్న లైన్‌ను ఆధారంగా చేసుకుని సిద్ధం చేసిన కథే ఇది.  

నటుడు రావు రమేష్‌కు సీన్‌ వివరిస్తూ

సినిమా కోసం  కాకినాడ నుంచి విశాఖకు...  
పిఠాపురంలో శివదుర్గా థియేటర్‌ మా మావయ్యది. చిన్నతనం నుంచి అక్కడ సినిమాలు చూడటం అలవాటైంది. డిగ్రీ చదివే రోజుల్లో విశాఖకు సినిమా చూసేందుకు వచ్చేవాడ్ని. ఉదయం కాకినాడ ప్యాసింజర్‌లో నగరానికి వచ్చి.. మధ్యాహ్నం భోజనం చేసి చిత్రాలయ థియేటర్‌లో సినిమా చూసి సాయంత్రం అదే పాసింజర్‌లో తిరిగి కాకినాడ వెళ్లేవాడ్ని. ఈ ఒక్క మాట చాలు నాకు సినిమాలంటే ఎంత ఆసక్తో చెప్పేందుకు..! 

కథలు రెడీ చేస్తున్నా..  
ప్రస్తుతం యాక్షన్‌ థ్రిల్లర్, రొమాంటిక్, కామెడి కథల్ని సిద్ధం చేసుకుంటున్నాను.  త్వరలో యూత్‌–యాక్షన్‌ ప్రధానంగా సాగే కథను సిద్ధం చేస్తున్నా. నా కథల్లో భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తా. ప్రతీ మనిషిని కట్టిపడేసేది అనుబంధాలే. వీటికే అధిక ప్రాధాన్యం.   

పుష్కరకాలంగా... 
చిత్రపరిశ్రమలో 12 ఏళ్లుగా పనిచేస్తున్నాను. జి.నాగేశ్వరరెడ్డి, ఎన్‌.శంకర్, బొమ్మరిల్లు భాస్క ర్‌ల వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. టీవీ సీరియల్స్, పలు ప్రకటనలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. అనంతరం పూర్తిస్థాయిలో దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నాను. ‘అమ్మమ్మగారి ఇల్లు’ నా తొలి ప్రయత్నం. కుటుంబ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కించాను.  

 ‘సిరివెన్నెల’ శైలి చాలా ఇష్టం...  
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచనా శైలి నాకు చాలా ఇష్టం. నేను చెప్పాలనుకున్న కథని ఆయన కేవలం తన పాటలో రెండు చరణాలతో చెప్పేస్తారు. అందుకే తొలి చిత్రానికి ఆయనతో పట్టుబట్టి, ఒప్పించి మరీ పాట రాయించుకున్నా. 
విశాఖ.. ఓ సెంటిమెంట్‌..  
చిత్రపరిశ్రమకు అనుకూలమైన పరిస్థితులు విశాఖలో ఉన్నాయి. అదే విధంగా విశాఖలో చిత్రీకరణ చేసుకున్న ప్రతీ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్ర పరిశ్రమలో ఉంది. వచ్చే నాలుగేళ్లలో చిత్రపరిశ్రమ నగరానికి వచ్చేస్తుందని నా నమ్మకం.  
 
కథలో బలం ఉంటే చాలు...  
తెలుగు నటులు కొత్తగా ఆలోచిస్తున్నారు. కేవలం కథను నమ్మి అవకాశాలు ఇస్తున్నారు. నూతన దర్శకుడైనా కథలో బలం ఉంటే వారు చేయడానికి వెంటనే ఆసక్తి చూపుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఈ చిత్రం నాకు విజయాన్నిస్తే, తరువాత చిత్రం నాకు బోనస్‌గా భావిస్తా.  

మరిన్ని వార్తలు